close

తాజా వార్తలు

మెరుగైన ప్యాకేజీకి మేటి మార్గాలు!

లక్షలు.. వేల మందిని దాటి విజేతగా నిలవాలంటే కొన్ని అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాలి. అందులోనూ ఏడాదికి పాతిక లక్షలకు పైగా వేతనం ప్యాకేజీని పొందాలంటే కొంత ప్రత్యేకతను ప్రదర్శించాలి.  సరదాగా చదువుకుంటూ.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొద్దిగా శ్రద్ధ పెడితే మంచి జీతాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి  నైపుణ్యాలనే మెరుగుపరుచుకొని రూ. 28.75 లక్షల వార్షిక ఆదాయంతో అమెజాన్‌లోకి అడుగుపెట్టాడు నీరుకొండ సత్యసాయి శివరామకృష్ణ. ఆకర్షణీయమైన అలాంటి ఆఫర్లను అందుకోడానికి ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ అంశాలను పరిశీలించవచ్చు.

ఇంజినీరింగ్‌ చదవాలని నిర్ణయించుకున్న విద్యార్థి ఆసక్తి, సబ్జెక్టులపై ఉన్న పట్టు ఆధారంగా బ్రాంచిని ఎంచుకోవాలి. మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు, కాలేజీ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి సరిపోతుంది. నిజానికి అప్పటికి ఏం చేయాలన్నదానిపై స్పష్టత కూడా ఉండదు. కానీ ముఖ్యమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి.   ఉదాహరణకు- సీఎస్‌ విద్యార్థులు కంప్యూటర్స్‌ సబ్జెక్టులు, ఈఈఈ వాళ్లు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలు మొదలైనవి. 
చాలామంది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు రాబోయేముందో, ఇంజినీరింగ్‌ పూర్తయ్యాకో అదనపు కోర్సులపై ఆసక్తి చూపుతుంటారు. ఎక్కువ శాతం కళాశాలల్లో మూడో సంవత్సరం ముగిసిన తర్వాత ప్లేస్‌మెంట్‌ శిక్షణ ఇస్తారు. ఇది దాదాపుగా 2 నుంచి 3 నెలలు ఉంటుంది. వీటిల్లో మొదటి సంవత్సరంలో తెలుసుకున్న అంశాలనే ఎక్కువగా నేర్పుతుంటారు. ఆ శిక్షణ విద్యార్థికి రివిజన్‌లాగా ఉండాలి. అలాకాకుండా తాజాగా నేర్చుకోవడం మొదలు పెడితే వెనుకబడిపోయినట్లే. అప్పటి వరకు గడిచిన కాలమంతా వృథా అయినట్లే. ఇంజినీరింగ్‌ రెండో ఏడాది నుంచే ఆసక్తి మేరకు అభ్యర్థులు చిన్న చిన్న కోర్సులు చేయాలి. వీలైతే సంబంధిత ప్రాజెక్టులు చేయాలి. అప్పుడే అవగాహన పెరుగుతుంది. తరగతుల్లో ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి పాయింట్లను రాసుకుంటూ సొంత నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. మొత్తానికి రెండో ఏడాది పూర్తయ్యేనాటికి కనీసం కొన్ని విభాగాలపై పట్టు సాధించాలి.

‘ఇవన్నీ రెండో ఏడాదే చేయాలనుకోవడం మరీ తొందర’ అని భావించేవారూ ఉంటారు. మొదటి రెండు సంవత్సరాల్లో ప్రాథమికాంశాలను చదివుంటారు  కాబట్టి అదనపు కోర్సులు చేయడం సులభం అవుతుంది. కొన్ని అంశాలు కొంత నేర్చుకున్న తర్వాత అనాసక్తి అనిపిస్తే మార్చుకోవచ్చు. కానీ చివరి ఏడాదిలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే సమయం వృథా అవుతుంది. ఇతరులకంటే వెనుకబడిపోతున్నామనే ఒత్తిడీ పెరుగుతుంది. 


నేర్చుకునే మార్గాలెన్నో..! 

ఏదైనా నేర్చుకోవాలనుకునే వారికి స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు మంచి మార్గం. ఆన్‌లైన్‌లో ఎన్నోరకాల కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ద నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) ఇంజినీరింగ్‌లోని అన్ని బ్రాంచీల వారికీ ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది.  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరుతోపాటు ఏడు ఐఐటీలు- బాంబే, దిల్లీ, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌ గువాహటి, రూర్కీ కలిసి దీన్ని రూపొందించాయి. ప్రముఖ లెక్చరర్లు దీనిలో బోధిస్తారు. సంబంధిత వీడియోలూ అందుబాటులో ఉంటాయి. బోధనతోపాటు విద్యార్థికి అసైన్‌మెంట్లు ఇస్తారు. ఆ వారం విన్న పాఠాల ఆధారంగా వాటిని చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థికి ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ అలవాటవుతుంది. ఏడాదికి రెండు సార్లు కోర్సును ప్రారంభిస్తారు. ఒక్కో కోర్సు కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు ఉంటుంది. సంబంధిత సర్టిఫికెట్‌ను పొందాలనుకుంటే కొంత మొత్తం చెల్లించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో పాసైతే సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనికి మార్కెట్‌లో చాలా విలువ ఉంటుంది. ఇంకా.. గీక్స్‌ అండ్‌ గీక్స్‌, ఇంటర్వ్యూ బిట్‌, టాప్‌ కోడర్‌, ఐ డిజర్వ్‌ వంటి ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌లో ఎన్నో కోర్సులను ఉచితంగా ఇస్తున్నాయి. మెటీరియల్‌  ఉంటుంది. అసైన్‌మెంట్లూ ఇస్తుంటాయి. 


సెట్‌లుగా.. సమగ్రంగా! 

అకడమిక్‌ సబ్జెక్టులతోపాటు అదనపు కోర్సులంటే సమయం సరిపోతుందా అని చాలామందికి సందేహం! ఈ కోర్సులకు పెద్దగా సమయం పట్టదు. రోజుకు గంట  కేటాయించగలిగితే చాలు. అసైన్‌మెంట్లకు మాత్రం 2-3 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. శని, ఆదివారాలను ఇందుకు ఉపయోగించుకోవాలి. ఆన్‌లైన్‌ కాకుండా నేరుగా నేర్చుకోవాలనుకునేవారు ఆదివారాలను వినియోగించుకోవాలి. అవి కూడా గంట నుంచి రెండు గంటలకు మించి ఉండవు. అయితే నేర్చుకునేది ఏదైనా ఒక సెట్‌లా నేర్చుకోవాలి. ఉదా: జావా డెవలపర్‌ కావాలనుకున్నారనుకుందాం.. దానికి సంబంధించి ఏయే కోర్సులు నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి. అది ప్రాథమిక అంశాల నుంచి లోతుగా వెళ్లేలా ఉండాలి. ఇవన్నీ ఒక సెట్‌గా ఉంటాయి. వాటన్నింటినీ నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. జావా, కోర్‌ జావా, జావా స్క్రిప్ట్‌, హెచ్‌టీఎంఎల్‌, డేటాబేస్‌.. ఇలా ఒక సెట్‌ నేర్చుకోవాలి. మెషిన్‌ లర్నింగ్‌.. దాని పరిచయం, డీప్‌ లర్నింగ్‌..ఇలా వెళ్లాలి. తరువాత దానికి సంబంధించి చిన్న ప్రాజెక్ట్‌ లాంటిది చేయాలి. 


అన్నీ నేర్చేసుకుందాం అనుకోవద్దు 

కాంపిటిటివ్‌ కోడింగ్‌పై పట్టు సాధించాలనుకుంటే ముందుగా ఒక లాంగ్వేజ్‌ని బాగా నేర్చుకోవాలి. ఆపై కోడింగ్‌ బేసిక్స్‌పై దృష్టిపెట్టాలి. అందుబాటులో ఉన్న వాటన్నింటినీ నేర్చుకోవాలనే తపన వద్దు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఏదైనా ఒక స్కిల్‌ను లోతుగా నేర్చుకుంటే సరిపోతుంది. రెండు, మూడింటి గురించి ప్రాథమికంగా తెలుసుకున్నప్పటికీ ఒకదాన్ని లోతుగా నేర్చుకోవాలి. దాని ఆధారంగా ఎంపిక చేస్తున్న సంస్థలపై దృష్టిపెట్టాలి. అప్పుడే త్వరగా ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నింటికి ఎప్పటికప్పుడు రివిజన్‌ అవసరమవుతుంది. మేథ్స్‌లాంటి వాటికి కాన్సెప్ట్‌ అర్థమైతే కొన్ని రోజులు, నెలలపాటు గుర్తుంటుంది. కానీ సింటాక్స్‌ లాంటివి అలా కాదు. వీటిలోనూ కాన్సెప్ట్‌ ఉంటుంది, అర్థమవుతుంది. కానీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జ్ఞాపకం ఉండాలంటే సాధన తప్పనిసరి. 


సలహాలు.. సాయం 

ఇంజినీరింగ్‌లో చేరగానే చదివే వాతావరణం మారిపోతుంది. వెన్నంటి చదివించే విధానం ఉండదు. ఇక్కడ మార్కులు ముఖ్యమే కానీ, అవే ప్రధానం కాదు. కొన్ని టాపిక్‌లపై అవగాహన ఉండి, కొంత కష్టపడితే ఎవరైనా పాస్‌ కావచ్చు. కానీ ఉద్యోగం కావాలంటే పరిజ్ఞానం అవసరం. దీనికి మెంటార్ల సాయం కావాలి. లెక్చరర్లు, సీనియర్లు, తోటి విద్యార్థుల సలహాలను తీసుకోవచ్చు. ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఒకరు తోడుగా ఉండేలా చూసుకోవడం మంచిది. కుదరకపోతే కనీసం అసైన్‌మెంట్లు చేసే విధానంపై ఆలోచనలను పంచుకోవాలి. ప్రాజెక్టులను చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఇంకొకరితో కలిసే చేయాలి. 


ఆసక్తితో కోడింగ్‌ వైపు అడుగులు 

హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదివాను. మేథ్స్‌ చేయడం నాకు సరదాగా ఉంటుంది. అందుకే దానితో సంబంధమున్న కంప్యూటర్‌ సైన్స్‌ను ఎంచుకున్నాను. మేథ్స్‌పై ఆసక్తే కోడింగ్‌వైపు నడిపించింది. చివరికి ప్రాంగణ నియామకాల్లో అమెజాన్‌లో ఉద్యోగం సాధించడానికీ కారణమైంది. 
ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో నాకూ ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు. సీ++ మాత్రం నేర్చుకున్నాను. రెండో ఏడాది మొదటి సెమిస్టర్‌లో లెక్చరర్ల సలహా మేరకు ఎన్‌పీటీఈఎల్‌లో చేరాను. అక్కడ డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ అల్గారిథమ్‌ (డీఏఏ) కోర్సు నేర్చుకున్నాను. కోడింగ్‌పై అవగాహన ఎన్‌పీటీఈఎల్‌లో చేరిన తర్వాతే వచ్చింది. మేథ్స్‌కీ, కోడింగ్‌కీ సంబంధం అర్థమైంది. ఆసక్తి పెరిగింది. డీఏఏ ద్వారా కోడ్‌ రాయడానికి ఎంతసేపు పడుతుంది, దాని ఎగ్జిక్యూషన్‌ అంశాలపై అవగాహన పెంచుకున్నాను. 
తరువాత స్మార్ట్‌ ఇంటర్వ్యూస్‌లో.. కోడింగ్‌ నేర్చుకున్నాను. అక్కడ కాంప్లెక్స్‌ కోడింగ్‌ నేర్పిస్తారు. మూడో సంవత్సరం సెకండ్‌ సెమ్‌ నుంచి నాలుగో ఏడాది వరకూ నేర్చుకున్నాను. అక్కడే టీచింగ్‌ అసిస్టెంట్‌గా కూడా చేశాను. ఇదంతా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలో ఉపయోగపడింది. నేను సీ++ చేసినపుడు ఒక చిన్న హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో జీయూఐ డెవలప్‌ చేశాను. దీంతో ఆ లాంగ్వేజీపై పట్టు వచ్చింది. స్నేహితుడితో కలిసి ఇంకా కొన్ని రూపొందించాను.

ఇంటర్వ్యూలో: అమెజాన్‌ ఉద్యోగానికి సంబంధించి ఒక రాతపరీక్ష, నాలుగు ఇంటర్వ్యూలు జరిగాయి. మొదటి రౌండ్‌లో.. కాంపిటిటివ్‌ ప్రోగ్రామింగ్‌పై 2 ప్రశ్నలు (వాటిలో ఒకటి లాజికల్‌), 20 ఎంసీక్యూ ప్రశ్నలు బేసిక్స్‌ ఆఫ్‌ ఓఎస్‌, డీబీఎంఎస్‌ మొత్తంగా కంప్యూటర్‌ సైన్స్‌ టాపిక్స్‌ మీద అడిగారు. వాటిలోనూ ప్రోగ్రామింగ్‌ అంశాలనే అడిగారు. దాని తర్వాత 4 రౌండ్లు ఇంటర్వ్యూ. అన్నీ టెక్నికల్‌ రౌండ్లే! ప్రతి టెక్నికల్‌ రౌండ్‌లోనూ కోడింగ్‌ ప్రశ్నలే అడిగారు. ప్రతి రౌండూ గంట- గంటన్నర ఉంటుంది. కాంపిటిటివ్‌ ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌, ఎంత బాగా కోడ్‌ రాయగలుగుతున్నాం, కోడ్‌ ఎందుకు రాస్తున్నామన్న దానిపై ఎంత అవగాహన ఉందో పరిశీలించారు. కోర్‌ సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 5 ప్రశ్నలు అడిగారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.