close

తాజా వార్తలు

అవుతారా.. అగ్రి డాక్టర్లు!

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గైడెన్స్‌

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీలు చేస్తే కెరియర్‌ ఎలా ఉంటుందనే అంశంపై అందరికీ అవగాహన అంతంత మాత్రమే. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయనే అపొహలూ ఉన్నాయి.   కానీ గవర్నమెంట్‌ జాబ్‌కు మించి ఉద్యోగాలకూ, ఉన్నత విద్యకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే.. సేద్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లే ఈ కోర్సులను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పంటలు.. పల్లె వాతావరణంపై మక్కువ ఉంటే అగ్రి క్లినిక్‌లు పెట్టుకొని అగ్రి డాక్టర్లుగా మారవచ్చు. రైతుల అభిమానాన్ని పొందవచ్చు. కాదనుకుంటే ఏకంగా ఆధునిక అన్నదాతలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదగవచ్చు.

క డాక్టర్‌ లేదా లాయర్‌ లేదా చార్టర్డ్‌ అకౌంటెంట్‌లాగా భిన్నమైన వృత్తి నిపుణుడిగా (ప్రొఫెషనల్‌) ఎదగాలనుకుంటున్నారా.. సొంతంగా ఏదైనా వ్యవసాయ సంబంధ పరిశ్రమ స్థాపించి మరికొందరికి ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్త కావాలనుకుంటున్నారా.. గ్రామాల్లో సాధారణ డాక్టర్‌ పెట్టుకునే ఆస్పత్రి మాదిరిగా మీరూ ఒక అగ్రి క్లినిక్‌ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారా.. అయితే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సులు మీ కోసమే. వీటిని చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఎన్నో స్వయం ఉపాధి అవకాశాలను అందుకోవచ్చు. వ్యవసాయాధికారిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయవచ్చు. వ్యవసాయ పరిశోధకుడిగా ప్రపంచ ఆహార భద్రతలో భాగస్వామి కావచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన, వ్యవసాయ, పశువైద్య డిగ్రీ సీట్ల భర్తీకి త్వరలో కౌన్సెలింగ్‌ జరగనుంది. నీట్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌, దంతవైద్య కోర్సులకు కౌన్సెలింగ్‌ పూర్తికాగానే ఈ  కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటిస్తారు. ఏపీలో మూడు రకాల డిగ్రీల సీట్ల భర్తీకి ఆచార్య ఎన్జీ రంగా వర్శిటీ సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని వర్శిటీ ఉపకులపతి దామోదర నాయుడు తెలిపారు. అలాగే తెలంగాణలో జయశంకర్‌ వర్శిటీ త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ప్రకటన జారీ చేస్తామని వర్శిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. వివరాల కోసం ఈ రెండు వర్శిటీల వెబ్‌సైట్లను చూడవచ్చు.

 

కాలేజీలు.. సీట్ల వివరాలు

ఏపీలో 11 వ్యవసాయ కళాశాలలు: ఏపీలో 5 ప్రభుత్వ, మరో ఆరు ప్రైవేటు వ్యవసాయ కాలేజీలున్నాయి. బాపట్ల, తిరుపతి, నైరా, మహానంది, రాజమండ్రిలోని ప్రభుత్వ వ్యవసాయ కాలేజీల్లో మొత్తం 2,769 సీట్లు ఉన్నాయి. రాజమండ్రి మినహా మిగతా 4 కాలేజీల్లో వ్యవసాయ పీజీ (ఏజీ ఎంఎస్సీ) సీట్లు 411 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు కాలేజీల్లో మరో 1,152 ఏజీ బీఎస్సీ సీట్లు ఉన్నాయి. ఇంకా వ్యవసాయ ఇంజినీరింగ్‌లో 432, ఫుడ్‌ టెక్నాలజీలో 292, కమ్యూనిటీ సైన్స్‌లో 184 సీట్లను ఆచార్య ఎన్జీ రంగా వర్శిటీ ఈ విద్యా సంవత్సరంలో భర్తీ చేస్తుంది. పూర్తి వివరాలకు రంగా వర్శిటీ వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్శిటీ ఉంది. ఇందులో బీఎస్సీ (హార్టీకల్చర్‌) సీట్లు ఉన్నాయి. ఇందులో 300 సాధారణ, 13 పేమెంట్‌ సీట్లు ఉన్నాయి. పేమెంట్‌ సీట్లకు ఇతర ఫీజులు కాకుండా ఏటా రూ.48,400 అదనంగా కట్టాలి. ఏపీలో ఉద్యాన వర్శిటీకి సంబంధించి క్యాంపస్‌లో ఒకటి, పార్వతీపురం (విజయనగరం), చిన్నలతరిపి (ప్రకాశం), అనంతరాజుపేట (కడప)ల్లో కాలేజీలున్నాయి. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య వర్శిటీ ఉంది. దీని పరిధిలో తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడిలో కాలేజీలున్నాయి.
తెలంగాణలో 6 వ్యవసాయ, 2 ఉద్యాన కాలేజీలు: తెలంగాణలో శ్రీకొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్శిటీ క్యాంపస్‌ ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్శిటీ ఆవరణలోనే ఉంది. కానీ త్వరలో సిద్దిపేట జిల్లా ములుగుకు మారుతుంది. రాజేంద్రనగర్‌, మోజర్ల (పాత మహబూబ్‌నగర్‌ జిల్లా)లో ఉద్యాన కాలేజీలున్నాయి. వీటిలో సాధారణ సీట్లు 130, పేమెంట్‌ సీట్లు 20 ఉన్నాయి. రాజేంద్రనగర్‌ కాలేజీలో మాత్రమే 28 పీజీ సీట్లున్నాయి. 
తెలంగాణలో మొత్తం 6  వ్యవసాయ కాలేజీలు రాజేంద్రనగర్‌, జగిత్యాల, అశ్వారావుపేట, పాలెం, వరంగల్‌, సిరిసిల్లలో ఉన్నాయి. వీటిలో ఎంసెట్‌ ర్యాంకుతో నింపే సీట్లు 432. ఇవి కాకుండా...ఐసీఏఆర్‌ జాతీయ ప్రవేశ పరీక్ష ర్యాంకులతో 40, సాధారణ పేమెంట్‌ కోటా 75, ఎన్నారై కోటాలో మరో 25 భర్తీచేస్తారు. వ్యవసాయ ఇంజినీరింగ్‌లో మరో 65 సీట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్‌, జగిత్యాల కాలేజీల్లో కలిపి మొత్తం 91 ఏజీ ఎంఎస్సీ (పీజీ) సీట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్‌లో ‘అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’ సబ్జెక్టుతో ఎంబీఏ డిగ్రీకి 18 సీట్లున్నాయి. 
పీవీ నరసింహారావు పశువైద్య వర్శిటీ రాజేంద్రనగర్‌లో ఉంది. దీని పరిధిలో క్యాంపస్‌తో పాటు కోరుట్ల, వరంగల్‌లో పశువైద్య కాలేజీలున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఫిషరీస్‌, కామారెడ్డిలో డెయిరీ టెక్నాలజీ కాలేజీలున్నాయి. ఎంసెట్‌లో 2018లో తెలంగాణ స్థానిక కోటా జనరల్‌ ఓపెన్‌ కేటగిరీలో 1030 ర్యాంకు వచ్చిన విద్యార్థికి గతేడాది చిట్టచివరి బీవీఎస్సీ (పశువైద్య) డిగ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్‌, దంతవైద్య కోర్సుల్లో సీటు రాని వారంతా తొలి ప్రాధాన్యం బీవీఎస్సీకే ఇస్తున్నారు. 
ఇంజినీరింగ్‌, ఫుడ్‌, టెక్నాలజీ, హోంసైన్స్‌ డిగ్రీలు: వ్యవసాయ, ఉద్యాన డిగ్రీలతో పాటు వ్యవసాయ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్‌ డిగ్రీ సీట్లను సైతం వ్యవసాయ వర్శిటీలే భర్తీచేస్తున్నాయి. ఏపీలో 2, తెలంగాణలో ఒకటి వ్యవసాయ ఇంజినీరింగ్‌ కాలేజీలున్నాయి. తెలంగాణ హోంసైన్స్‌ (కమ్యూనిటీ సైన్స్‌) కాలేజీ హైదరాబాద్‌ నగర నడిబొడ్డున టెలీఫోన్‌ భవన్‌ పక్కనే ఉంది. ఎంసెట్‌ రాయకపోయినా ఇంటర్‌ మార్కులతోనే హోంసైన్స్‌ సీట్లు ఇస్తారు. 

ఎంసెట్‌ రాయకపోయినా..

ఎంసెట్‌ రాయకపోయినా ఈ డిగ్రీల్లో చేరేందుకు మరో రెండు మార్గాలున్నాయి. ఒకటి పేమెంట్‌ సీటు. ఇందుకోసం తెలంగాణలో అయితే ఎన్నారై కోటా కింద నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే సరికి రూ.35 లక్షలు చెల్లించాలి. ఈ కోటాలో 25 ఏజీ బీఎస్సీ సీట్లను ప్రభుత్వ వ్యవసాయ కాలేజీల్లోనే జయశంకర్‌ వర్శిటీ ఇస్తోంది. నేరుగా వర్శిటీ క్యాంపస్‌లోనే సీటు పొందవచ్చు. ఇలా ప్రభుత్వ కాలేజీల్లో పేమెంట్‌ సీటు పొందే అవకాశం చాలా రాష్ట్రాల్లో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు వ్యవసాయ కాలేజీల్లో ఏటా రూ.2 లక్షలు ట్యూషన్‌ రుసుంతో పాటు అదనంగా డొనేషన్‌ కింద మరో రూ.15 లక్షల దాకా వసూలుచేస్తున్నారు. రెండోది జాతీయ స్థాయిలో ఐసీఏఆర్‌ నిర్వహించే ప్రవేశపరీక్ష రాసి ర్యాంకు సాధిస్తే దేశవ్యాప్తంగా ఏ వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలోనైనా సీటు పొందవచ్చు. ప్రతీ వర్శిటీలోని మొత్తం సీట్లలో 15 శాతం ఐసీఏఆర్‌ పరీక్ష ర్యాంకులతోనే మండలి నేరుగా భర్తీచేస్తుంది. 

అంతర్జాతీయంగా అవకాశాలు ఎన్నో!
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకే కాదు వ్యవసాయ శాస్త్రవేత్తలకు విదేశాలు స్వాగతం పలుకుతున్నాయి.

వ్యవసాయ పరిశోధనల్లో నిజాయతీ, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేసే వారికి అమెరికా, ఐరోపా ఖండంలోని పలు దేశాలు ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నాయి. అమెరికాకు వెళ్లాలంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగే కావాల్సిన అవసరం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తగా సగర్వంగా వెళ్లవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీలు చదివిన అనేకమంది అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నతస్థానాల్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలోని ప్రసిద్ధ ఫ్లోరిడా వర్శిటీలో నీటి వినియోగ పరిశోధనా విభాగం ప్రస్తుత అధిపతి 35 ఏళ్ల క్రితం రాజేంద్రనగర్‌లోని అప్పటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీలో చదివిన విద్యార్థే. ఈ రెండు వర్శిటీలకు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జర్మనీ తదితర దేశాల్లోని అనేక ప్రముఖ వర్శిటీలతో ఒప్పందాలున్నాయి. చాలా దేశాలు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాయి. వ్యవసాయాధికారులుగా,  శాస్త్రవేత్తలుగా భారతదేశంలో పనిచేసి రిటైరైన వారిని ఆఫ్రికా దేశాలు భారీ వేతనాలిచ్చి కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి.

మన దేశంలోనూ..

మనదేశంలోనూ వ్యవసాయ డాక్టరేట్లకు, పట్టభద్రులకు చాలా అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో విత్తన పరిశ్రమల వార్షిక టర్నోవర్‌ రూ.25 వేల కోట్లకు చేరింది. మరో పదేళ్లలో ఇది రూ.55 వేల కోట్లను దాటుతుందని వృద్ధి రేటు అంచనా.  తెలంగాణలో దేశంలోకెల్లా అత్యధికంగా 300కి పైగా విత్తన కంపెనీలున్నాయి. వీటికి తోడు మనదేశం మొత్తం మీద మేలైన విత్తన, సాధారణ పంటలు పండించేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఈ అంశాలన్నీ వ్యవసాయ డిగ్రీ చదివేవారికి అనుకూలమైనవి.  వ్యవసాయ వర్శిటీలు, పరిశోధనా సంస్థలకు విధానాల రూపకల్పన ప్రధాన అధికార కేంద్రం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌). దిల్లీలో ఉంది. దీని పరిధిలో 109 వ్యవసాయ పరిశోధనా సంస్థలున్నాయి.  దేశంలో సివిల్‌ సర్వీసుల తరవాత అంతటి ప్రతిష్ఠాత్మకంగా ఈ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ఉద్యోగాలకు పోటీ పరీక్షలు జరుగుతుంటాయి. లక్షలాది రూపాయల వేతనాలతో పాటు వ్యవసాయ పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందవచ్చు. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్శిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేయవచ్చు. పీహెచ్‌డీ దాకా కుదరక వ్యవసాయ డిగ్రీతోనే చదువు ఆపేసిన వాళ్లు సొంత రాష్ట్రంలో మండల వ్యవసాయ, ఉద్యాన అధికారి పోస్టుల్లో ప్రభుత్వ ఉద్యోగిగా చేరవచ్చు. కానీ ఈ ఉద్యోగాల సంఖ్య తక్కువ. 

ఉద్యాన డిగ్రీ కోర్సులు పూర్తిచేస్తే...

దేశంలో పండ్లు, కూరగాయలు, పసుపు, మిరప, ఆయిల్‌పాం, పూలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు పనులన్నీ ఉద్యాన శాఖ పరిధిలో ఉంటాయి. వీటిపై పరిశోధనలు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నాయి. ప్రపంచ జనాభా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. 2100 నాటికి 1100 కోట్లకు జనాభా చేరుతుందని అంచనా. వీరి ఆకలి తీర్చడానికి పంటల దిగుబడులు పెరగాలి. దానికి ఉద్యాన పరిశోధనలు చాలా అవసరం. చైనా, నెదర్లాండ్స్‌, ఇజ్రాయిల్‌ వంటి పలుదేశాలు ఉద్యాన పంటల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ రంగంలో స్థిరపడే వారికి ఉద్యాన డిగ్రీ కోర్సులు పునాదిరాయి వంటివి. డిగ్రీతో ఆపకుండా పీజీ, పీహెచ్‌డీ దాకా వెళ్లే ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరితే అనేక దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలం. ఉద్యోగాలే కాకుండా సొంతంగా పండ్ల, కూరగాయల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు పెట్టుకునేవారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ డిగ్రీ చేసి ఇతర దేశాలకెళ్లి పీజీ, పీహెచ్‌డీ చేస్తే మరిన్ని ప్రోత్సాహకాలు, అవకాశాలున్నాయి. 

పశువైద్యుడి చేతిలోనే మనిషి ఆరోగ్యం

పశువైద్య డిగ్రీ చేసిన వారు పశువైద్యులుగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. వీరు నిత్యం పశువులకే వైద్యం చేయాలి.కానీ వీరితోనే మనుషుల ఆరోగ్యమూ ముడిపడి ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మాంసం విక్రయించే ప్రతి దుకాణానికి పశువైద్యుడి ధ్రువీకరణ తప్పనిసరి. మనదేశంలో మాంసాహారుల సంఖ్య కోట్లలో ఉంది. నిత్యం లక్షలాది టన్నుల మాంసాన్ని ప్రజలకు అమ్ముతున్నారు. వీటిని కోసే ముందు అవి ఆరోగ్యంగా ఉన్నాయని తప్పనిసరిగా పశువైద్యుడు ధ్రువీకరించాలి. ఆ ధ్రువీకరణ లేకుండా మాంసం అమ్మడం నేరం. ధ్రువీకరించని మాంసం తింటే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మనుషుల ఆరోగ్యం పరోక్షంగా పశు వైద్యుల చేతుల్లోనే ఉందని చెబుతారు. ఈ కోర్సు చదివిన వారికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పశువైద్య ఉద్యోగాలున్నాయి. ఇవి కాకుండా నగరాల్లో ప్రైవేటు ఆస్పత్రులూ పెట్టుకోవచ్చు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు, పరిశోధనలు చేస్తే మరిన్ని మంచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలుంటాయి. అమెరికా, ఐరోపా వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటు పశువుల ఆస్పత్రులకు, పశువైద్యులకు ఎంతో డిమాండ్‌ ఉంది. దేశంలో అపార కోస్తాతీరం, నదులు, చెరువుల్లో చేపల పెంపకం ఉంది. రూ.వేల కోట్ల విలువైన మత్స్య, రొయ్యల వ్యాపారం జరుగుతోంది. మత్స్య పరిశ్రమ ఏటా వృద్ధి చెందుతోంది. ఫిషరీస్‌ డిగ్రీ కోర్సు చేసినవారు సొంతంగా మత్స్య పరిశ్రమ పెట్టుకుని ఎదగవచ్చు. ఈ పరిశ్రమలో ఉద్యోగావకాశాలకు కొంత గిరాకీ ఉంది.
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పోషకాహారం ఎలా తినాలి, ఎలా తయారు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. ఆహార పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందుతోంది.  ఎగుమతులు రూ.వేల కోట్లలో ఉంటున్నాయి. దీంతో పరిశ్రమలకు ఫుడ్‌, డెయిరీ టెక్నాలజీ చేసిన పట్టభద్రుల అవసరం పెరుగుతోంది. ఆహారం, పాలు లేకుండా ఏ దేశమూ, ఏ మనిషీ జీవించలేరు. ఈ టెక్నాలజీలో డిగ్రీలు, పీజీలు చదివిన వారు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేటు ఆస్పత్రుల్లో వైద్యులతో సమానంగా ఫుడ్‌ టెక్నాలజీ నిపుణులను నియమిస్తున్నారు. ఈ కోర్సులు చేసిన వారికి పలు దేశాల్లో ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం తక్కువే.

సాధారణ డాక్టర్లకు దీటుగా... అగ్రి డాక్టర్‌లు

సాధారణ డాక్టర్‌ నిర్వహించే ఆస్పత్రిలో ప్రజల రోగాలకు వైద్యం చేస్తారు. అదే వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఒక గ్రామంలో అగ్రి క్లినిక్‌ పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల వేలాది ఎకరాల్లో సాగయ్యే పంటలకు సోకే తెగుళ్లు, పురుగులు, రోగాలను నియంత్రించే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తారు. దీనివల్ల ఆ పైర్లపై రైతులు విచ్చలవిడిగా రసాయన పురుగుమందులు, ఎరువులు చల్లకుండా అడ్డుకోవడం అగ్రి క్లినిక్‌ నిర్వహించే ‘అగ్రి డాక్టర్‌’ చేతుల్లోనే ఉంటుంది. వీరు ఇచ్చే శాస్త్రీయ సలహాలు, సూచనల కోసం వేలాది మంది రైతులు బారులు తీరతారు. వారిచ్చే రుసుములతో ఆదాయం వస్తుంది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రి క్లినిక్‌లు, ప్రైవేటు పశువైద్యశాలలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడిప్పుడే తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వీటి సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకూ ఈ సంస్కృతి విస్తరిస్తోంది. అయిదు కోట్ల మంది రైతు కుటుంబాలకు అగ్రి డాక్టర్ల సేవలు చాలా అవసరం. నిపుణుల కోసం ఈ రంగాలు ఎదురు చూస్తున్నాయి.  అగ్రి క్లినిక్‌లు పెట్టాలని ముందుకొచ్చే వారికి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు శిక్షణ, రాయితీలూ ఇస్తున్నాయి.

ఉద్యోగమే కాదు... సేద్యంపై ఆసక్తి ఉంటేనే!

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విభాగాల్లో డిగ్రీలు చేయాలనుకునే వారు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. ఉద్యోగమే కాదు సేద్యంపై ఆసక్తి ఉంటేనే ఈ కోర్సులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డిగ్రీ పట్టా చేతికందగానే అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోవచ్చని  చాలామంది భావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఒక నాలుగు వేల వరకు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. రిటైరై ఖాళీలేర్పడితేనే ప్రభుత్వం భర్తీచేస్తుంది. ఏటా తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా పట్టభద్రులు ఈ వర్శిటీల నుంచి బయటకు వస్తున్నారు. అందులో 10 శాతంమందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నిరాశ చెందకుండా ఇతర దేశాల్లో లేదా ఇక్కడే పీజీలు చేయాలి. పై చదువులు కుదరకపోయినా లేదా ఆసక్తి లేకపోయినా ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయడం మంచిది. ఇందుకు మానసికంగా సిద్ధమైన వారే ఈ కోర్సులను ఎంచుకోవాలి. దేశంలో మంచి పంటలు పండించి లాభాలను ఆర్జించే రైతుల కోసం ఐసీఏఆర్‌ సహా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు కాగడా వేసి వెతుకుతుంటాయి. ఇటీవల బిహార్‌లో ఇంటర్‌ చదివిన ఒక యువకుడు వరిలో అధిక దిగుబడి సాధిస్తే దేశమంతా కీర్తించింది. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన లావణ్య అనే యువతి సేంద్రియ పంటలతో రూ.లక్షలు ఆర్జిస్తుంటే రాష్ట్ర వ్యవసాయశాఖ సత్కరించింది. సాధారణ వ్యక్తులే ఇలాంటి అద్భుతాలు చేస్తుంటే... వ్యవసాయ, ఉద్యాన డిగ్రీల్లో పుచ్చుకొని ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు సాగుచేస్తే మరెంతో సాధించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువ రైతులను ప్రోత్సహిస్తున్నాయి.
- మంగమూరి శ్రీనివాస్‌, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.