close

తాజా వార్తలు

అడిగినవన్నీ చెబితే..ఖాతా ఖాళీనే!

గూగుల్‌లో సైబర్‌ బూచాళ్లు

హైదరాబాద్‌: ఏదైనా సంస్థకు సంబంధించిన ఆన్‌లైన్‌ లావాదేవీల్లో తేడా ఉంటే ఏం చేస్తాం? వెంటనే ఆ సంస్థ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడతాం.. అలా  మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది. సైబర్‌ నేరస్థులు గూగుల్‌లో పొంచి ఉండటమే ఇందుకు కారణం. నకిలీ వెబ్‌సైట్లను రూపొందించి కస్టమర్‌ కేర్‌ ప్రతినిధుల్లా మాట్లాడుతూ... బ్యాంకు ఖాతాల వివరాల్ని కాజేయడమనే కొత్త పంథాకు తెర తీయడం తాజా ధోరణి.  బాధితుడికి ఏమాత్రం అనుమానం రాని రీతిలో వివరాలు తీసుకుని ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా సాగుతోందీ నయా దందా.

రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇటీవలి కాలంలో ఈ తరహా ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కస్టమర్‌కేర్‌తో మాట్లాడాలనుకునే వారినే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరస్థులు పన్నాగాలు పన్నుతున్నారు. ఆయా సంస్థల నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఉంచుతున్నారు.   వినియోగదారులు అసలు సంస్థ వెబ్‌సైట్‌గా పొరబడి అందులోని కస్టమర్‌ కేర్‌  నంబరుకు ఫోన్‌ చేస్తే ఉచ్చులోకి లాగుతారు. సంస్థ ప్రతినిధిలాగే మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామనే పేరుతో మెల్లిగా వినియోగదారుడి బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు సమాచారం రాబడతారు. అనంతరం వాటి ఆధారంగా ఖాతా/కార్డుల్లోని డబ్బును మాయం చేస్తారు. ఖాతా/కార్డు నుంచి నగదు బదిలీ అయినట్లు బాధితుడి చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చాక గానీ.. తాము మోసపోయామనే విషయం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో  ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జేబు గుల్ల కావడం ఖాయం. ఈ మధ్య కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానంలో నగదు లావాదేవీలు అధికం కావడంతో సైబర్‌ నేరగాళ్లు అటు వైపు కన్నేశారు. ఆయా సంస్థల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి కస్టమర్‌ కేర్‌ ప్రతినిధుల్లా మాట్లాడుతూ... బురిడీ కొట్టిస్తున్నారు. ఒకవేళ యూపీఐ లావాదేవీ జరిపినప్పుడు ఏదైనా కారణంతో ఫెయిలైతే వినియోగదారులు సహజంగా కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తారు. ఇదే అవకాశంగా సదరు సంస్థల నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లను గూగుల్‌లో నిక్షిప్తం చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

ఈసీఐఎల్‌ వ్యాపారికి రూ.లక్ష టోకరా
ఈసీఐఎల్‌ డీఏఈ హౌసింగ్‌ కాలనీకి చెందిన ఓ వ్యాపారి(35) ‘సౌత్‌ శారీ’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారు. ఆ లావాదేవీ పూర్తి కాకపోవడంతో ఈ నెల 11న ఆ సంస్థ కస్టమర్‌ కేర్‌తో మాట్లాడేందుకు గూగుల్‌ సెర్చింజన్‌లో వెతికారు. అక్కడ కనిపించిన నంబరుకు ఫోన్‌ చేశారు. అవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి... వ్యాపారి బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న చరవాణి నంబరు అడిగాడు. వ్యాపారి ఆ నంబరు చెప్పడంతో అతడి చరవాణికి మూడు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. ఆ సందేశాల్ని తాను సూచించే చరవాణి నంబరుకు పంపించాలని కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి చెప్పడంతో వ్యాపారి అలాగే చేశారు. అదే రోజు మరో వ్యక్తి వ్యాపారికి ఫోన్‌ చేసి పిన్‌ నంబర్లు తెలుసుకుని ఖాతా నుంచి రూ.లక్ష మాయమైనట్లు గుర్తించి రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో ఓ యువకుడి నుంచి యూపీఐ వెబ్‌సైట్‌ కాల్‌సెంటర్‌ ముసుగులో నేరస్థులు రూ.30 వేలు కాజేశారు.

నేరుగా మాట్లాడితే అనుమానించాల్సిందే...
సాధారణంగా ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తుంటాయి. తర్వాత వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఫోన్‌ చేసి ప్రతినిధితో మాట్లాడే అవకాశం ఉంది. అలా కాదని కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయగానే రికార్డెడ్‌ వాయిస్‌ కాకుండా నేరుగా ప్రతినిధి మాట్లాడారంటే మాత్రం తప్పకుండా అనుమానించాల్సిందే. అప్పుడు బ్యాంకు ఖాతాలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల సమాచారం, ఓటీపీచెప్పడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని గుర్తించాలి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.