close

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే దారుణ హత్య 

కత్తితో వీధుల్లో వీరంగం
ఉలిక్కిపడిన చోడవరం 
 గంటన్నరలోనే నిందితుడి అరెస్టు

రక్తపు మడుగులో కోన రాజేష్‌ మృతదేహం

చోడవరం, చోడవరం పట్టణం, న్యూస్‌టుడే

ఆదివారం మధ్యాహ్నం... సమయం మూడు గంటలు.. చోడవరం పట్టణంలోని బీఎన్‌ రహదారి ఎప్పటిలాగే నిత్యం రద్దీగా ఉంది. వాహనాలు అటూ ఇటూ తిరుగుతున్నాయి.చోడవరం ఉన్నత పాఠశాల దగ్గరలోని మద్యం దుకాణం వద్ద ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తోటి స్నేహితుల కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ఓ ఆగంతకుడు ద్విచక్రవాహనంపై వచ్చి దిగాడు. పొట్టేలును నరికే కత్తిని చేతిలోకి తీసుకుని అక్కడే ఉన్న యువకుడిపై దాడిచేశాడు. అందరూ చూస్తుండగానే మెడభాగంలో నరికి చంపాడు. కత్తి చూపించి అందరినీ బెదిరిస్తూ తిరిగి వెళ్లిపోయాడు. అత్యంత క్రూరంగా జరిగిన ఈ హత్య జిల్లా అంతటినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆగమేఘాలపై రంగంలోకి దిగిన పోలీసులు గంటన్నర వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు.

ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చోడవరంలో పిళ్లావారి తోటలో నివాసముంటున్న కోన లోవరాజేష్‌ (22) మరో స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బీఎన్‌రోడ్డులోని మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. మిగతా స్నేహితుల కోసం వేచి చూస్తుండగా ఓ ఆగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి రాజేష్‌పై దాడి చేశాడు. ఈ సమయంలో వెనుక కూర్చొన్న స్నేహితుడికి కత్తి తగిలింది. వెంటనే ఇతను బండి దిగి పారిపోయాడు. ఈ క్రమంలో రాజేష్‌ ఆగంతకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తివేటుకు అతడి ఎడమ చెయ్యి తెగిపోయింది. వెనువెంటనే ఆగంతకుడు మెడ భాగంలో కత్తితో తీవ్రంగా నరకడంతో సంఘటన స్థలంలోనే రాజేష్‌ మృతిచెందాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన తరలివచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు.

విలేకర్లతో మాట్లాడుతున్న నర్సీపట్నం ఏఎస్పీ హఫీజ్‌

అప్పటివరకు స్నేహితులతో ఆడుకుంటూ...: పిళ్లావారి తోటకు చెందిన రాజేష్‌ మధ్యాహ్నం భోజన సమయం వరకు చీడికాడ రోడ్డులో ఐటీఐ వద్ద తోటి స్నేహితులతో క్రికెట్‌ ఆడుకున్నాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత భోజనం తెచ్చుకునేందుకు హోటల్‌కు మరో స్నేహితుడిని వెంటబెట్టుకొని వెళ్లాడు. మరో ముగ్గురు స్నేహితుల కోసం మద్యం దుకాణం సమీపాన ద్విచక్ర వాహనం నిలిపి వేచి చూస్తున్నాడు. ఈలోగా హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్‌ స్నేహితులు బోరున విలపించారు. అప్పటివరకు తమతో కలిసి ఆటలాడిన స్నేహితుడు దారుణంగా హత్యకు గురికావడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరితో సరదాగా గడిపేవాడని రోదిస్తూ తెలిపారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

మృతుడి తల్లిదండ్రులు బొరయ్య, లక్ష్మిలకు రాజేష్‌తోపాటు కుమార్తె గౌరి ఉన్నారు. ఇతడి తాత కన్నయ్య, అమ్మమ్మ సన్యాసమ్మతో పాటు మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో సంఘటన ప్రదేశం కిటకిటలాడింది. కత్తితో నరికిన ప్రాంతంలో ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోయినా ఓ యువకుడు తీసిన వీడియో అందరి చరవాణిలలో హల్‌చల్‌ చేసింది. ఆగంతకుడు తన ముఖం కనిపించకుండా తెల్లటి శిరస్త్రాణం పెట్టుకుని వచ్చి రాజేష్‌ను హత్యచేసి గాంధీగ్రామం వైపు వెళ్లిపోయాడని స్థానికులు చెప్పారు. వెళ్లేటపుడు కత్తిని గాలిలో చూపిస్తూ బెదిరిస్తూ వెళ్లాడు. పోలీసుల దర్యాప్తులో ఈ దారుణానికి ఒడిగట్టింది బెన్నవోలు గ్రామానికి చెందిన నిందితుడు పండూరి సత్తిబాబు అని తేలింది.

పోలీసులు అప్రమత్తం

హంతకుడు రాజేష్‌ను ముట్టుపెట్టి.. వీడి పనయింది ఇక దానిని (భార్య) చంపేయాలంటూ వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలో ఉన్న యువకులు అతని మాటలు విన్నారు. వెంటనే చోడవరం ఎస్సై లక్ష్మీనారాయణకు చెప్పారు. ఆయన స్పందించి బుచ్చెయ్యపేట పోలీసులను అప్రమత్తం చేశారు. హంతకుడిది చోడవరం మండలం బెన్నవోలు అని తెలియడంతో అతడి ఇంటి వద్ద బుచ్చెయ్యపేట పోలీసులు నిఘా పెట్టారు. సంఘటన స్థలం నుంచి నేరుగా బెన్నవోలులోని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అక్కడి నుంచి చోడవరం స్టేషన్‌కు తరలించారు. వెంటనే ఎస్సై స్పందించి చర్యలు చేపట్టడం మరో ప్రాణాన్ని రక్షించింది.

చోడవరంలో హత్య జరిగిన ప్రదేశం ఇదే

మరో ఇద్దరి హత్యకు నిందితుడి కుట్ర

వ్యక్తిగత, కుటుంబ తగాదాల కారణంగానే రాజేష్‌ను సత్తిబాబు హత్య చేశాడని, మరో ఇద్దరిని మట్టుబెట్టాలని అనుకున్నాడని నర్సీపట్నం ఏఎస్పీ అరీఫ్‌ హఫీజ్‌ ఆదివారం తెలిపారు. రాత్రి చోడవరం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాజేష్‌ను హత్యచేసిన తరువాత స్వగ్రామమైన బెన్నవోలులో భార్యతోపాటు తన సోదరుడిని హతమార్చాలని అనుకున్నాడని చెప్పారు. పోలీసులు అప్రమత్తమై నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. దర్యాప్తులో సీసీ టీవీ పుటేజ్‌ ద్వారా నిందితుడిని వెంçనే గుర్తించామన్నారు. ఈ హత్య కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన హెడ్‌ కానిస్టేబుల్‌ జి.రాము, కానిస్టేబుళ్లు ఎం.సముద్రం, మహేష్, హోంగార్డు శివరామరాజులను ఆయన అభినందించారు. నిందితుడు సత్తిబాబు హత్యకు వినియోగించిన కత్తితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వివేకానంద, పి.వి.నరసింహరావు, ఎస్సైలు బాలకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నిందితుడు సత్తిబాబు

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.