close

తాజా వార్తలు

ఉన్నత విద్య.. ఉద్యోగాలకుఒకటే గేట్‌

2020 పరీక్ష షెడ్యూల్‌ విడుదల

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్న గేట్‌-2020కి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్ష స్కోరు అటు ఉన్నత విద్యకూ, ఇటు ఎన్నో రకాల ఉద్యోగాలను సాధించుకోడానికీ సాయపడుతుంది.  దీని ప్రిపరేషన్‌ ఇతర పోటీపరీక్షలను రాయడానికీ ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన ప్రణాళికతో మంచి ర్యాంకు పొందితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)ను ఈసారి ఐఐటీ దిల్లీ నిర్వహిస్తోంది. ఐఐటీలతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు), వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో ఉన్నత విద్యాప్రవేశాలకు గేట్‌ స్కోరు తప్పనిసరి. బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌, గెయిల్‌, హాల్‌, ఐఓసీఎల్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌పీసీఐఎల్‌, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ లాంటి పరిశోధన సంస్థలు గేట్‌ స్కోరు ఆధారంగా ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తున్నాయి. దీని స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాల పాటు, పీఎస్‌యూలకి ఒకటి లేదా రెండు సంవత్సరాలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇంజినీరింగ్‌ /ఎంఎస్‌సీ/ఎంసీఏ పూర్తయిన, ఆఖరి సంవత్సరం చదివే విద్యార్థులు గేట్‌ రాయవచ్చు. ఇంజినీరింగ్‌ మూడో ఏడాది విద్యార్థులు అనర్హులు. ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను 25 పేపర్లలో నిర్వహిస్తారు. అభ్యర్థి ఏదో ఒక పేపర్‌ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ సంవత్సరం కొత్తగా బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ను చేర్చారు.

ప్రత్యక్ష ఉపయోగాలు

గేట్‌తో మనదేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు నెలకు రూ. 12,400/- ఉపకార వేతనం లభిస్తుంది.
* ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. నెలకు రూ. 28,000/- ఉపకార వేతనం ఇస్తారు. 
* ఎన్‌ఐటీఐఈ (ముంబయి)లో పీజీడీఐఈ, పీజీడీపీఎం, పీజీడీఎంఎంలలో ప్రవేశానికి గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 
* ప్రభుత్వరంగ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న కలిగిన సంస్థలతోపాటు కొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఈ స్కోరు ఆధారంగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. 
* వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు గేట్‌ ప్రాతిపదిక.

పరోక్ష ప్రయోజనాలు

* గేట్‌ సన్నద్ధత ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ స్టేజ్‌-1 టెక్నికల్‌ పేపర్‌ ప్రిపరేషన్‌కు గట్టి పునాది.
* ఇతర పోటీ పరీక్షల సన్నద్ధత సులభమవుతుంది.
* క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కూ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకూ ఈ తయారీ ఉపయోగపడుతుంది.

పరీక్ష విధానం

ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.

విభాగం-1: (జనరల్‌ ఆప్టిట్యూడ్‌):  ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు, 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధితమైనవి (వెర్బల్‌ ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వొచ్చు.

విభాగం-2: (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టు):  ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 26- 55 ప్రశ్నలకు ఒక్కోప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
* ఒక తప్పు జవాబుకు 33.33 శాతం మార్కులను తగ్గిస్తారు. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున  మైనస్‌ మార్కులుంటాయి. అయితే న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.

టాప్‌  ర్యాంకుకు సూత్రాలు

గేట్‌లో ఉత్తమ ర్యాంకు తెచ్చుకోవాలంటే.. విద్యార్థులు తరచూ చేసే తప్పులకు దూరంగా ఉండాలి. స్కోరు మెరుగుపరుచుకునేందుకు కొన్ని మెలకువలు పాటించాలి.

తరచూ చేసే తప్పులు:  * సిలబస్‌ పరంగా ఏ అంశాలపై అధిక దృష్టిపెట్టాలో గుర్తించకపోవటం.  * ఒక ప్రామాణిక పుస్తకాన్ని లోతుగా చదవకుండా ఎక్కువ పుస్తకాలను పైపైన చదవటానికి ప్రయత్నించడం. * చదివిన అంశాల పునశ్చరణను నిర్లక్ష్యం చేయటం. ‌* గత ప్రశ్నపత్రాలనూ, మాదిరి ప్రశ్నపత్రాలనూ సాధన చేయటంలో అలసత్వం. * పరీక్ష రాసేవరకూ నిలిపి ఉంచాల్సిన ప్రేరణను ఏదో ఒక సమయంలో కోల్పోయి, సన్నద్ధతను సరిగా కొనసాగించకపోవటం.

మెలకువలు: సొంత అధ్యయన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది స్వీయ అభిరుచికి తగినట్లుగా ఉంటుంది కాబట్టి సాధనకు మంచి మార్గాన్ని సూచిస్తుంది. ఈ ప్రణాళికే గేట్‌లో మంచి ర్యాంకు/మార్కులు సాధించి పెట్టటానికి మొదటి మెట్టు. ఇతరుల ప్రణాళికను అనుకరించకపోవడమే మేలు. *సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ సబ్జ్జెక్టులో ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతమవుతుంది. దీనితో పాటు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడమూ ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపై, ప్రశ్నల సాధనపై స్పష్టత వస్తుంది.
ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి. ప్రిపరేషన్‌ త్వరగా మొదలుపెట్టి, అత్యంత త్వరితంగా పూర్తిచేయాలి. దీనివల్ల సిలబస్‌లో వున్న కాన్సెప్టులు, విషయాలను ఎక్కువగా సాధన చేసుకోవచ్చు. * చదివిన ప్రతి అంశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. ఇదెంతో ముఖ్యం. ప్రతి అధ్యాయానికీ సంబంధించి ముఖ్యాంశాలను చిన్నచిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. ఇవి పునశ్చరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. * అధ్యయన సందర్భంగా ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. * పుస్తకాల్లోని సాల్వ్‌డ్‌, అన్‌-సాల్వ్‌డ్‌ ప్రశ్నలను అభ్యాసం చేయాలి. * గత ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి. దీనివల్ల ఏ అంశాలకు, ఏ కాన్సెప్టులకు ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది. ఐఈఎస్‌ ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలు, ఇతర రాష్ట్రాల పోటీపరీక్షల  ప్రశ్నపత్రాలు కూడా సాధన చేయాలి. * వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్‌ టెస్టులు రాయాలి. దానిలో చేసిన తప్పులను సవరించుకోవాలి. * వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ గురించి ప్రతిదీ తెలుసుకుని సాధన చేయాలి. * రోజూ 8 నుంచి 10 గంటల సమయం సాధనకు కేటాయించాలి. అయితే సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. * క్లిష్టమైన, సాధారణ, అతిసాధారణ అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. * ప్రాథమికాంశాలపై అవగాహన తెచ్చుకొని తరువాత కఠినమైన ప్రశ్నలను సాధన చేయాలి. * ప్రతి వారాంతం, నెలకొకసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. * పరీక్షలో అధిక సమయం పట్టే, క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు. సులువైన ప్రశ్నలను మొదటే పూర్తిచేయాలి. * ప్రతి ప్రశ్నకూ సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.

సమ్మేళనం.. నూతనత్వం

ప్రతి పేపర్‌లో పదికి మించిన సబ్జెక్టులు ఉన్నాయి. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు ఒక సవాలుగా మారింది. కాబట్టి ఐఐటీ ప్రొఫెసర్లు రెండు, మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పేపర్‌లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు. * ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు ఎలక్ట్రికల్‌ పేపర్‌లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్‌లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌. ‌* గణితం నుంచి 10- 15 శాతం మార్కులుంటాయి. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి. * కీలకమైన న్యూమరికల్‌ ప్రశ్నలకు సరైన సమాధానం రాయడానికి ప్రాథమికాంశాలపై పట్టు ఉండాలి. కేవలం ఫార్ములా ఆధారంగా చదివితే ఫలితం దక్కదు. చిన్నచిన్న కన్వెన్షనల్‌ ప్రశ్నలను సాధన చేస్తే ప్రాథమికాంశాలపై పట్టు దొరుకుతుంది.
-  వై.వి.గోపాలకృష్ణమూర్తి

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 03 సెప్టెంబర్‌ 2019.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ గడువు: 24 సెప్టెంబర్‌ 2019
పరీక్ష తేదీలు: 1, 2, 8, 9 ఫిబ్రవరి, 2020.
http://gate.iitd.ac.in

రిఫరెన్స్‌ పుస్తకాలు

న్యూమరికల్‌ ఎబిలిటీ:  ఆర్‌.ఎస్‌ అగర్వాల్‌
మ్యాథమేటిక్స్‌: ఏఆర్‌ వసిష్ట, బీఎస్‌. గ్రేవాల్‌, హెచ్‌కే దాస్‌
ఇంగ్లిష్‌: రెన్‌ & మార్టిన్‌ గ్రామర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.