close

తాజా వార్తలు

విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ

క్యాషియర్‌ను వెంబడించి రూ.20లక్షలు ఎత్తుకెళ్లిన వైనం
విశాఖలో సంచలనం సృష్టించిన దోపిడీ ఘటన
రంగంలోకి దిగిన సీపీ ఆర్కే మీనా

విశాఖ: గాజువాకలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. కంపెనీకి చెందిన నగదును బ్యాంకులో జమ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెంబడించి రూ.20లక్షలు దోచుకెళ్లిన ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో పోర్టు రోడ్డులో శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన కంపెనీకి చెందిన నగదుతో బైక్‌పై వెళ్తుండగా.. కొందరు దుండగులు ఆయన్ను వెంబడించారు. నిర్జన ప్రదేశం రాగానే అతడిపై దాడిచేసి గాయపరిచి నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఏమీ చేయలేక బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని సిరి ట్రాన్స్‌పోర్టులో క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నెల్లూరు వాసి. బెంగళూరుకు కంపెనీ పనిపై వెళ్లి నిన్న నగరానికి చేరుకున్న శ్రీనివాస్ రూ.19 లక్షల నగదు తీసుకుని వచ్చాడు. గాజువాక ఎస్‌బీఐ నుంచి మరో రూ.లక్ష డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో ఉంచాడు. దువ్వాడ వద్ద సినర్జీ కంపెనీకి విశాఖ నగరంలో ఉన్న కార్యాలయంలో ఈ నగదు చెల్లించేందుకు స్కూటీపై వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు బాధితుడు పేర్కొన్నాడు.

పక్కా నిఘాతోనే.. 

శ్రీనివాస్‌పై నిఘా ఉంచి ఆయన్ను వెంబడించిన ఇద్దరు దుండగులు..  పోర్టు రోడ్డులోని జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలోకి రాగానే శ్రీనివాస్ బండిని అపారు. అతడిని కత్తితో బెదిరించి స్కూటీ డిక్కీ తాళాలను లాక్కున్నారు. ముగ్గురి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. శ్రీనివాస్‌పై అగంతకులు పిడిగుద్దులతో దాడి చేశారు. అనంతరం డిక్కీని తెరిచి రూ.20 లక్షల నగదును పట్టుకుని వారు నగరంవైపు వెళ్లే రోడ్డులో పరారైనట్టు బాధితుడు పోలీసులకు తెలిపాడు. 

ఆగంతకులిద్దరూ 25ఏళ్ల లోపేవారే..

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసిన పోలీసులు బాధితుడు శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగులిద్దరూ 25 ఏళ్ల లోపుగా ఉన్న యువకులన్న సమాచారం తప్ప వారు ఏ బైక్ మీద వచ్చారన్నది తాను పరిశీలించలేదని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇందులో ఎవరి పాత్ర ఉందన్న అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.