close

తాజా వార్తలు

తక్కువ వడ్డీ పేరుతో మాయాజాలం

వార్తాపత్రికలు.. అంతర్జాలంలో ప్రకటనలు
ఈనాడు, హైదరాబాద్‌

మీరు వ్యాపారం చేస్తున్నారా? కొత్తగా ఫ్లాట్‌ కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా?..మీకు తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ సైబర్‌ నేరస్థులు మోసాలు చేస్తున్నారు. వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తున్నారు. బాధితులకు నమ్మకం కల్పిస్తున్నారు. ఆసక్తి ప్రదర్శించిన వారి వద్ద నుంచి రూ.50వేల నుంచి రూ.15లక్షల వరకూ వసూలు చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. ఆగస్టు నెలలో తొలి పదిరోజుల్లోనే 20మందిని మోసం చేశారు. రూ.6.30లక్షలు నగదు బదిలీ చేసుకున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌, దిల్లీ నగరాల్లో ఉంటున్న సైబర్‌ నేరస్థులు ఈ మోసాలకు పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

రుణం ఇస్తామంటూ..రూ.11.80లక్షలు నగదు బదిలీ
తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు ఓ విశ్రాంత అధికారి నుంచి రూ.11.80లక్షలు వసూలు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వెంగళరావు నగర్‌లో ఉంటున్న సదరు విశ్రాంత అధికారి ఒక ఆంగ్లపత్రికలో రుణం ఇస్తామనే అన్న ప్రకటన చూశారు. ప్రకటనలోని నంబర్‌కు ఫోన్‌ చేయగా.. రాయల్‌ ఫైనాన్స్‌ దాదర్‌ ప్రతినిధినంటూ అజయ్‌గుప్తా మాట్లాడాడు. తన భార్య నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల అభివృద్ధికి రూ.75లక్షలు రుణం కావాలంటూ అధికారి అజయ్‌ను కోరాడు. ముందుగా రూ.75,500 డిపాజిట్‌ చేయాలని అజయ్‌ కోరగా..ఆ అధికారి మొత్తాన్ని తాను సూచించిన బ్యాంక్‌ ఖాతాలో జమచేశాడు. ఇక అప్పటి నుంచి జీఎస్టీ, ముందస్తు రుణవాయిదాలు, ఇతర కారణాలంటూ అజయ్‌ అయిదు నెలల్లో బాధితుడి వద్ద నుంచి  రూ.11.80లక్షలు వసూలు చేసుకున్నాడు. జులై నాల్గోవారంలో రూ.75లక్షల చెక్కు పంపిస్తానని చెప్పిన అజయ్‌.. ఆగస్టు నెల వచ్చినా చెక్కు పంపకపోవడంతో విశ్రాంత అధికారికి అనుమానం వచ్చింది. ఆగస్టు 4,5 తేదీల్లో ఫోన్‌ చేయగా..అజయ్‌ స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన ఆయన బుధవారం రాత్రి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

సుధార్‌ ఫైనాన్స్‌ పేరుతో...
ముంబయికి చెందిన సుధార్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఇద్దరు సైబర్‌ నేరస్థులు ధర్మేష్‌ వోరా అనే వ్యాపారస్థుడిని మోసం చేసి రూ.2.23లక్షలు స్వాహా చేశారు. యువకులు, వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ వారం రోజుల క్రితం ధర్మేష్‌కు ఒక యువతి ఫోన్‌ చేసింది. తనకు రూ.60లక్షలు రుణం కావాలంటూ ధర్మేష్‌ అభ్యర్థించాడు.  గుర్తింపు పత్రాలు, ధరావతు నిమిత్తం రూ.50వేలు నగదు బదిలీ చేయాలంటూ యువతి చెప్పింది. ధర్మేష్‌ రూ.50వేలు ఆమె సూచించిన ఖాతాలో జమచేశాడు. మరుసటి రోజు ఒక యువకుడు ఫోన్‌ చేసి ఆదాయపు పన్ను, జీఎస్‌టీ కట్టాలని రూ.90వేలు చెల్లించాలని సూచించాడు. రుణం మంజూరైనట్టు తనకు రుజువులు కావాలని, రూ.60లక్షల చెక్కు పంపించాలని ధర్మేష్‌ కోరాడు. రూ.83వేలు చెల్లిస్తే చెక్కు వస్తుందంటూ నకలు ప్రతిని వోరాకు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. అతడు రూ.83వేలు పంపించగానే ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఇది తెలియని ఓరా రెండురోజుల తర్వాత ఫోన్‌ చేశాడు. ఫోన్‌ నంబర్లు పనిచేయడం లేదంటూ సమాధానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆరు నెలల కిస్తీలు ముందే చెల్లించాలని..
మంగళ్‌హాట్‌లో ఉంటున్న ఆటోడ్రైవర్‌ మునీర్‌కు వారం రోజుల క్రితం సిటీ ఫైనాన్స్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాము వ్యక్తిగ అవసరాలకు తక్కువ వడ్డీకే రుణం ఇస్తున్నామని చెప్పాడు. రూ.16క్షల రుణం ఇస్తామని, ప్రాసెసింగ్‌ రుసుం రూ.15వేలు.. ఆరు కిస్తీలు ముందే చెల్లించాలని వివరించాడు. అతడు చెప్పిన వివరాలను నమ్మిన మునీర్‌ మరుసటి రోజు రూ.15వేలు అతడు సూచించిన ఖాతాలో వేశాడు. అనంతరం మరోవ్యక్తి ఫోన్‌ చేసి మీకు రుణం మంజూరైనట్లు ధ్రువీకరణ పత్రం పంపుతున్నామని, రెండురోజుల్లో రూ.16లక్షల నగదు బ్యాంకు ఖతాలో జమచేస్తామన్నారు. రెండురోజుల తర్వాత ఇంకో వ్యక్తి ఫోన్‌ చేసి రూ.90వేలు కడితే తప్ప రుణం రాదని చెప్పడంతో ఆ మొత్తాన్నీ పంపించాడు. తర్వాత మరికొంత చెల్లించాలంటూ దశలవారీగా మొత్తం రూ.2.55లక్షలు స్వాహా చేశారు. అయిదు రోజుల క్రితం మునీర్‌ వారికి ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.