close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 26/08/2019 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమానత్వం సాధ్యమే!

లింగసమానత్వ దినోత్సవం సందర్భంగా


స్వాతంత్య్ర భారతావనికి డెబ్బయి ఏళ్లు...అయినా అతివకు స్వేచ్ఛేక్కడిది! తమ్ముడికేమో కాన్వెంట్‌ స్కూల్‌... ఆమెకేమో సర్కారు బడి! గడప దాటి అడుగు బయట పెట్టాలంటే ఆంక్షలు...చదువుకొని, ఉద్యోగం చేయాలన్నా...తప్పని ప్రతిబంధకాలు...శ్రమించి సంపాదించిన డబ్బును ఖర్చు చేయాలన్నా...భర్త అనుమతి సరేసరి. చట్టాలొచ్చినా గృహహింసకు బాధితులవుతున్నవారెందరో...ఇది ఒకప్పటి పరిస్థితి కాదు...
ఇప్పుడు మన ఇంట్లో, మన సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అగచాట్లు. దీనికి పరిష్కారాలు మనచేతుల్లోనే అంటున్నారు కొందరు.

 స్వేచ్ఛనివ్వాలి....

ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా... కొన్నిచోట్ల ఇంట్లో పరిస్థితులు బయటకు వెళ్లనిచ్చేలా లేవు. మా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏవైనా సామాజిక కార్యక్రమాలు జరిగితే అబ్బాయిల్లా మేం అందులో పాల్గొనలేం. ఒకవేళ అమ్మానాన్న అనుమతిచ్చినా... చుట్టూ ఉండే సమాజం ఆడపిల్లవు నీకవసరమా... అని ఎత్తిచూపుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే కదా మన ఆలోచన పరిధి విస్తరించేది, బయటి ప్రపంచం తెలిసేది. స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళ ప్రజాప్రతినిధుల విషయంలో చాలా వరకు వారి భర్తలదే పెత్తనం. అబ్బాయిల్లా వారూ బయటి కార్యక్రమాల్లో పాల్గొని ఉండుంటే వారిలో నాయకత్వ లక్షణాలు పెరిగేవి. తమ విధుల్లో భర్తలను వేలుపెట్టనిచ్చేవారు కాదు. నా స్నేహితుల్లో చాలా మందికి 18 ఏళ్లు దాటిన వెంటనే పెళ్లిళ్లు చేసేశారు. పై చదువులు, భవిష్యత్తు గురించి వారు కన్న కలలకు గౌరవం లేదు. వారు ఏది చేయాలన్నా భర్త దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితిలో మార్పురావాలి. ఆడపిల్లల నిర్ణయాలకు స్వేచ్ఛనివ్వాలి.

- పులిశెట్టి ధనలక్ష్మి, విద్యార్థి, ఆల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాల.


చట్టాలు సరిగ్గా అమలు చేయాలి...

కొన్నేళ్ల కిందట మహిళలు చదువుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. వారికి ఆస్తి హక్కు ఉండేది కాదు. కేవలం చదువు కోసమే వారు పోరాడాల్సిన దుస్థితి. ఒక లక్ష్యం, ఆదర్శం ఉన్న మహిళలు మాత్రమే ఎంతో పోరాడి చదువుకోగలిగేవారు. తరువాత కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు వచ్చాయి. సమాజంలో మహిళల అణచివేతను తొలగించాలన్న ఉద్దేశంతో ఎన్నో పోరాటాలూ జరిగాయి. వీటి ఫలితంగా ప్రభుత్వాలు స్త్రీల రక్షణ కోసం గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం... ఇలా చాలా చట్టాలు చేశాయి. ఇవి మహిళా జీవితంలో కొంత వరకు మార్పు తీసుకొచ్చినప్పటికీ...అమలులో మాత్రం ఇంకా వెనకబడిపోతున్నాం. వాటిని సరిగ్గా అమలు చేయాలి. మహిళల కోసం ప్రత్యేకంగా విమెన్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్లు, పోలీస్‌ స్టేషన్లు ఉన్నా...వాటి సంఖ్య ఇంకా పెరగాలి.
- కొండవీటి సత్యవతి, భూమిక ఫౌండేషన్‌ 


బలహీనులమని అనుకోకూడదు...

స్త్రీలకు సమానత్వం అనేది అవసరంలేదు. ఎందుకంటే... స్త్రీలేనిదే పురుషుడు లేడు, సమాజం లేదు. మహిళల ఆలోచనావిధానం కొంతవరకూ మారితే చాలు. వాళ్లను మించిన శక్తిమంతులు మరొకరు ఉండరు. ఉదాహరణకు మా అమ్మ తన చిన్నతనంలోనే యూనివర్సిటీ స్థాయిలో బంగారుపతకం సాధించింది. మా పిన్నీ అంతే. తనూ డిగ్రీలో గోల్డ్‌ మెడలిస్ట్‌. నాకో అక్క, చెల్లి. అమ్మ వాళ్లిద్దరూ చదువుకునేలా, ధైర్యంగా ఉండేలా పెంచింది. మగవాళ్లతో పోల్చేది కాదు. ఇంట్లో మొదటిప్రాధాన్యం వాళ్లకే. ఆడపిల్ల తరువాతే ఎవరైనా అని చెప్పేది. ఇప్పుడు అక్క టీచర్‌గా చేస్తోంది. ఆ రోజు అమ్మ ప్రోత్సహించడం వల్లే...తన కాళ్లపై తాను నిలబడగలిగింది. ఇలాంటి మార్పు ప్రతిచోటా వస్తే ఆడపిల్లలకు గౌరవం దక్కుతుంది. ఈ రోజుల్లోని సామాజిక పరిస్థితులు, రకరకాల వ్యాపకాల దృష్ట్యా తామేదో బలహీనులమని అనుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. వాళ్లు  ఏదయినా సాధించగలరని అనుకుంటే చాలు... ఎన్నో చేయగలుగుతారు. చిన్నప్పటినుంచీ మగవాళ్లతో పోల్చకుండా... ఆడవాళ్లలో ధైర్యం నూరిపోయగలిగితే వాళ్లను మించినవారు ఉండరు. ఇంటిని ఉన్నతంగా చక్కదిద్దే మహిళలు... కెరీర్‌, ఇంటికే పరిమితం కాకుండా... సమాజంలోనూ తమవంతుగా మార్పు తేగలిగితే ఎంతోమందికి మేలు చేసినవారవుతారు. రాజకీయాల్నీ కెరీర్‌గా ఎంచుకునే రోజు వస్తే... తమలాంటి ఎంతోమంది మహిళల్ని చక్కదిద్దగలుగుతారు.
- ప్రవీణ్‌కుమార్‌, వ్యాపారవేత్త, హైదరాబాద్‌


  చదువుతోనే మార్పు

నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో అమ్మాయిలను తక్కువగానే చూస్తున్నారు. అబ్బాయిలను ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చేర్పించడం, అమ్మాయిలను విస్మరించడం గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ మాఊర్లో ద్విచక్ర వాహనంపై అమ్మాయి ఒంటరిగా వెళ్లడమూ తప్పే అన్నట్లు చూస్తారు. మా ఫౌండేషన్‌ ద్వారా సేవ చేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు రకరకాలుగా ప్రశ్నించేవారు. టీషర్ట్‌ వేసుకోవడం తప్పన్నట్లు చూసేవారు. ‘మీకెందుకమ్మా ఇలాంటివన్నీ.. మీ పెద్దవాళ్లు ఆడపిల్లలను ఇలా ఎలా బయటికి పంపిస్తున్నారు?’ అనే ప్రశ్నలు ప్రతిచోటా ఎదురయ్యేవి. ఇవన్నీ విన్నప్పుడు ఇంకెక్కడుంది సమానత్వం అనిపించేది. అన్ని విషయాలు వారందరికీ అర్థమయ్యేలా వివరించి, మా ప్రయత్నం గురించి చెప్పేవాళ్లం. సేవకు ఆడ, మగ తేడాలేదు అని అని వారికి అవగాహన కల్పించి ముందుకెళ్లేవాళ్లం. చదువుతోనే లింగసమానత్వం సాధ్యమవుతుందని నమ్ముతున్నా.
- తేజస్విని పొడపాటి, సామాజిక కార్యకర్త, భూమి ఫౌండేషన్‌ ఇంకొన్నేళ్లు పట్టొచ్చు...

అప్పట్లో తల్లిదండ్రులే పిల్లల పెంపకంలో తేడాలు చూపించేవారు. అమ్మాయి, అబ్బాయి ఒకే పాఠశాలలో చదువుతున్నా ఇంటి పనులన్నీ ఆడపిల్లతోనే చేయించేవారు. మగవాళ్లు అన్నింట్లో ఎక్కువ అనే మనస్తత్వం అందరిలోనూ ఉండేది. మా పాఠశాలలో హాజరు పట్టికలో అబ్బాయిల పేర్లన్నీ రాసిన తరువాతే అమ్మాయిల పేర్లు రాసేవారు. వివక్ష అక్కడి నుంచి మొదలై, అన్ని విషయాల్లో ప్రతిబింబించేది. అబ్బాయిలను పెద్ద చదువులు చదివిస్తూ, అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి పంపించేవారు. నేను రాజమండ్రి, కాకినాడలో చదువుకున్నా. వృత్తి రీత్యా బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పట్టణాల్లోనూ పనిచేశాను. అప్పటితో పోలిస్తే ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది కానీ పూర్తి స్థాయిలో లింగసమానత్వం సాధించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. లింగనిర్ధారణ చట్టవిరుద్ధమైనా...ఇంకా దొంగచాటుగా పరీక్షలు చేయిస్తూ   అమ్మాయి అని తెలియగానే కడుపులోనే చంపేస్తున్నారు. పెద్దవారిలో ఈ ఆలోచనాధోరణి పోతే సమాజంలో ఎంతో మార్పు వస్తుందని అనుకుంటున్నా.
-  డాక్టర్‌ పద్మజ, ఆప్తమాలజిస్ట్‌


 ఎంతో మార్పు వచ్చింది... కానీ!

మా తరం ముందున్న మహిళల్ని గమనిస్తే... మగవాళ్లదే ప్రపంచం. ఆడపిల్లల్ని పెంచడం, కాస్త పెద్దయ్యాక ఓ అయ్యచేతిలో పెట్టడం... ఇలాగే గడిచిపోయాయి రోజులు. పనులు, తిండి, నిద్ర తప్ప వాళ్లకు ఏమీ ఉండేది కాదు. దానివల్ల ఆ రోజుల్లో మహిళలకు ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా... స్వేచ్ఛ అంతంత మాత్రమే. అవి పురుషాధిక్యత  రోజులు. మా ఇంట్లో పరిస్థితే చూస్తే... ఆడవాళ్లు వంటింటికే పరిమితమైన రోజులు. ఆడవాళ్లెవరూ మగవారి అభిప్రాయానికి  ఎదురుచెప్పేవారు కాదు. ఏ నిర్ణయమైనా మగవారిదే. పురుషులకు రాజీ పడటం అనేది తెలిసేది కాదు. స్త్రీలకేమో తమ కోరికలు, అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండేది కాదు. మా తరం వచ్చేసరికి మా అక్కలు పెద్దగా చదువుకోకపోయినా మా ఆవిడ నాతో సమానంగా ఉద్యోగం చేసేది. ఇద్దరం కష్టపడాల్సిన పరిస్థితి. ఇంట్లో నేనూ తనకు పనుల్లో ఎంతోకొంత సాయం చేసేవాడిని. ఇప్పుడు మా కూతురు డాక్టర్‌. కోడలూ పనిచేస్తోంది. మా అల్లుడు, కొడుకూ ప్రతి పనిలో వాళ్లకు అందుబాటులో ఉంటున్నారు. వీళ్లతో సమానంగా ఇంటిపనుల నుంచి... ప్రతి బాధ్యతను పంచుకుంటున్నారు. పురుషులు పరిస్థితులను అర్థం చేసుకుని చాలామంది మగవారు రాజీపడుతున్నారు.  రాబోయే తరాల్లో ఇది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇదే మార్పు సమాజంలో ఉంటే... స్త్రీలకు ఎంతో సహకారం లభించినట్లే. వాళ్లు ఏ రంగంలోనైనా ధైర్యంగా అడుగుపెట్టగలుగుతారని నా అభిప్రాయం.
-వేమూరి సుబ్బారావు, రిటైర్డ్‌ ఉద్యోగి 


మగవారి దృక్పథం మారాలి...

మా ఊర్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే చిన్నచూపే చూస్తారు. ఎంతో మంది ‘అయ్యో మగబిడ్డ పుట్టకపాయే’ అని సానుభూతి చూపిస్తున్నారు. పుట్టిన వెంటనే భవిష్యత్తులో ఇవ్వబోయే వరకట్నం గురించి ఆలోచించి భారంగా భావిస్తున్నారు. కానీ ఈ ధోరణి మారాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పుడూ మగవారి మాటే చెల్లుతుంది. మహిళల విషయంలో మగవారి దృక్పథం మారాలి. ఆర్థిక, ఇతర వ్యవహారాల్లో వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి. అప్పుడు సమానత్వం సాధ్యం అవుతుంది.
- గాజుల రాహుల్‌, విద్యార్థి, ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్‌Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.