close

తాజా వార్తలు

పాక్‌ పక్కలో ఐబీజీ బల్లెం..!

 కోరలు తొడుగుతున్న ‘కోల్డ్‌స్టార్ట్‌’ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భారత్‌ ఉచ్చులు బిగిస్తోంది. కోల్డ్‌ స్టార్ట్‌ వ్యూహానికి కోరలు తొడుగుతోంది. దీంతో పాక్‌ సైనిక వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ వ్యూహం కచ్చితంగా అమలు చేస్తే పాక్‌ సైన్యం భారత్‌ ముందు ఏ మాత్రం నిలవలేదు. ఆదేశం అందింది మొదలు ఒక్కసారిగా శత్రువుపై విరుచుకుపడేందుకు సైనిక బృందాలు సచేతనమైపోతున్నాయి.  
తాజాగా ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌(ఐబీజీ) తొలి బ్యాచ్‌ కమాండోలను సరిహద్దుల్లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 3,323 కిలోమీటర్ల మేరకు ఉన్న సరిహద్దుల్లో టెన్షన్లు పెరిగిపోవడంతో ఎట్టకేలకు సైన్యం 11 నుంచి 13 ఐబీజీలను సరిహద్దులకు తరలించనుందని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల తెలిపారు. ఇప్పుడు దీనిలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని యోల్‌లో ఉన్న IXకార్ప్స్‌ను ఐబీజీగా పశ్చిమ సరిహద్దుకు తరలించనుంది. భారత సైన్యంలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన గ్రూప్‌ ఇదే.   

ఏమిటీ కోల్డ్‌స్టార్ట్‌ వ్యూహం..

ఈ వ్యూహంలో ఉగ్రదాడులకు పాల్పడిన దేశానికి జవాబు ఇచ్చేందుకు దళాలను సరిహద్దుల్లో సిద్ధంగా ఉంచుతారు. గతంలో ప్రధాన దళాలను దేశం మధ్యలో ఉంచి అవసరమైన ప్రాంతాలకు తరలించేవారు. కానీ, ఉగ్రదాడులు పెరిగిపోవడంతో శత్రుదేశానికి జవాబు ఇచ్చేందుకు దళాలను సరిహద్దులకు తరలించాలంటే చాలా సమయం పడుతోంది. ఈ లోపు పాక్‌ దళాలు అప్రమత్తమైపోతున్నాయి. అదే సమయంలో ప్రపంచదేశాలు కూడా భారత్‌పై దౌత్య ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన సమయంలో  కూడా ఇదే విధంగా దళాలను సరిహద్దులకు తరలించే సమయానికి భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సరిహద్దులు దాటకుండా ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ను భారత్‌ నిర్వహించింది. కానీ, ఇది ఉగ్రదాడులను ఆపలేకపోయింది. సైనికుల, సరుకుల తరలింపునకు చాలా సమయం పడుతుంది. భారత్‌ వంటి పెద్దదేశంలో మరీ ఈ సమయం ఎక్కువ. 
 ఈ అంశాలను దృష్టిలోపెట్టుకొని ప్రభుత్వం వ్యూహం మార్చుకొని సైనిక జనరల్‌ పద్మనాభన్‌ తయారు చేసిన కోల్డ్‌స్టార్ట్‌ డాక్టరీన్‌ను అనుసరించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా శత్రువు ఏదైన ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే ఒక్కసారిగా భారత సైనిక, యాంత్రిక(ట్యాంకులు, శతఘ్నులు) దళాలతో మెరుపుదాడి చేసి కొంత  భాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకొంటాయి.  ఆ తర్వాత చర్చల సమయంలో భారత్‌కు పైచేయి లభిస్తుంది. కవ్వింపు చర్య జరిగిన 72 గంటల్లో దీనిని పూర్తి చేసేయాలి. ప్రపంచ దేశాలు సచేతనమైపోయి దౌత్యఒత్తిడి వచ్చేలోపు శత్రుదేశానికి చెందిన కొంత భూభాగం మన దళాల ఆధీనంలో ఉంటుంది. అందుకు వివిధ విభాగాలకు చెందిన దళాలు సరిహద్దుల్లో సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు భారత్‌ ఇదే వ్యూహానికి పదును పెడుతోంది. దీనికోసం ఐబీజీలను సిద్ధం చేస్తోంది. ఈ బృందాలు రాజస్థాన్‌,  జమ్ము, పంజాబ్‌ ప్రాంతాల నుంచి వేగంగా పాక్‌లోకి చొచ్చుకుపోయే విధింగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 2011లో నిర్వహించిన ‘ఆపరేషన్‌ విజయీభవ’లో ఈ వ్యూహాన్ని పరీక్షించి విజయం సాధించారు. ఈ వ్యూహం అత్యంత ప్రమాదకరమైందని గతంలో పాక్‌ అధికారిక పత్రిక డాన్‌ పేర్కొంది.  ఈ భయంతోనే స్వల్పశ్రేణి అణు క్షిపణి నాసర్‌ను పాక్‌ అభివృద్ధి చేసుకొంది. కానీ దీనిని ప్రయోగించాలంటే పాక్‌ ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి.

సైన్యంలో మార్పులకు ఇది తొలిమెట్టు..

ఇటీవల కాలంలో సైన్యంలో మార్పులు చేస్తున్నట్లు చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. భారత పోరాట సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు ప్రతి సెక్టార్‌ను జాగ్రత్తగా పరిశీలించి మార్పులు చేయనున్నట్లు తెలిపారు. తొలుత కశ్మీర్‌ సరిహద్దుల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. తక్కువ దళాలతో శక్తిమంతంగా మారడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. 

చిన్నదే కానీ.. శత్రువుకు చుక్కలే..
సంప్రదాయ పోరాట దళాలు యుద్ధానికి వెళ్లాలంటే ఒకదానికి మరో విభాగం మద్దతుగా ఉండాలి. ఉదాహరణకు పదాతి దళం వెళుతుంటే దానికి వైమానిక దళం మద్దతు ఇస్తుండాలి. లేకపోతే ట్యాంకులు లేదా శతఘ్నుల నుంచి మద్దతు తీసుకోవాలి. అప్పుడు మూడు విభాగాలు అక్కడకు తరలిరావాలి.. వ్యూహాల్లో సమన్వయం ఉండాలి. యుద్ధంలోని అమూల్యమైన సమయం దీనికి వృథాగా మారుతుంది. అలా కాకుండా ప్రతి పోరాట దళానికి వేర్వేరుగా గగనతల పోరాట విభాగం, శతఘ్ని విభాగం, ట్యాంక్‌ విభాగాలు కలిపి ఉంటాయి. ఒక్కో ఐబీజీలో 6 నుంచి 8 బెటాలియన్లు ఉంటాయి. ఐబీజీలకు అప్పగించిన పని ఆధారంగా ఈ బెటాలియన్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. తొలుత 20 వేల నుంచి 25వేల మంది కమాండోలతో ఐబీజీలను సిద్ధం చేయనున్నారు.  

వేగం వీటి ప్రాణం..

ఈ దళాలను తరలించేందుకు అందుబాటులో ఉన్న గ్రూపుల నుంచి రవాణా సదుపాయాలను కూడా ఐబీజీలు ఎల్లవేళలా పొందుతాయి. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు వీటికి నేతృత్వం వహించనున్నారు. ఈ గ్రూపులు చిన్నవిగా, మెరికల్లాంటి కమాండోలతో కూడి ఉండటంతో వేగంగా స్పందిస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.