close

తాజా వార్తలు

ప్రియుడి కోసం అపహరణ నాటకం

తండ్రిని బ్లాక్‌మెయిల్‌ చేయించిన యువతి

నిందితురాలు సహా ముగ్గురి అరెస్టు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: ప్రియుడి కోసం ‘అపహరణ నాటకం’ ఆడి తండ్రి నుంచి డబ్బు రాబట్టాలని యువతి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తనను కిడ్నాప్‌ చేశారని పేర్కొంటూ రూ.10 లక్షలు డిమాండ్‌ చేయించింది. విచారణలో అసలు విషయం వెలుగు చూడటంతో ఆమెతోపాటు ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణగిరి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన ఆర్ముగం (51) తెలంగాణలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు కుమారుడు విఘ్నేష్‌ (24), కుమార్తె విద్య (22) ఉన్నారు. విఘ్నేష్‌ సిరుచ్చేరిలోని ఐటీ కంపెనీలో, విద్య చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విద్య తన స్నేహితురాలి సోదరి పెళ్లికి వెళుతున్నట్లు ఇటీవల తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. అనంతరం ఈ నెల 12న తండ్రి మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది. ఆ రోజున కొద్దిసేపటికి ఓ ఆగంతుకుడు ఫోన్‌ చేసి విద్యను కిడ్నాప్‌ చేశామని, రూ.10 లక్షలు ఇవ్వాలని ఆర్ముగాన్ని డిమాండ్‌ చేశాడు. విద్యతో అతడు మాట్లాడించగా... ఆమె తనను నగరంలోని కోయంబేడు బస్టాండు నుంచి ఎవరో అపహరించుకొచ్చి చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు భయంతో కూడిన స్వరంతో చెప్పింది. విఘ్నేష్‌కు కూడా దుండగుడు ఫోన్‌ చేసి ఇదే తరహాలో చెప్పాడు. ఆర్ముగం వెంటనే చెన్నైకు చేరుకుని కుమారుడితో కలిసి కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జాయింట్‌ కమిషనర్‌ విజయకుమారి ఆధ్వర్యంలోని పోలీసు బృందం విచారణ చేపట్టగా... ఫోన్‌ చేసిన ఆగంతుకుడు కడలూరులో ఉన్నట్లు సెల్‌ఫోను సిగ్నల్‌ ఆధారంగా కనుగొన్నారు. వెళ్లి విచారణ చేపట్టగా అతను కారైక్కాల్‌కు చెందిన మనోజ్‌ అలియాస్‌ సురేష్‌బాబు అని తెలిసింది. విద్య, అతడు ప్రేమించుకున్నట్లు వెల్లడైంది. సురేష్‌ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేందుకు రూ.10 లక్షలు అవసరం అయ్యాయని సమాచారం. తన తండ్రి ఇటీవల ప్లాటు అమ్మిన డబ్బు ఉందని, కిడ్నాప్‌ నాటకమాడి ఆ డబ్బు రాబడదామని విద్య సలహా ఇచ్చినట్లు వెల్లడైంది. సురేష్‌బాబు ఇచ్చిన సమాచారంతో స్నేహితురాలు అక్షయ ఇంట్లో విద్య ఉన్నట్లు తేలింది. ఈ ఘటనలో విద్య, సురేష్‌, అక్షయను పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.