close

తాజా వార్తలు

ఏట్లో.. చీకట్లో..ఆ ఆరుగురు ఏమయ్యారు?

 ఏటి నీటిలో కుటుంబం గల్లంతు
జాడ కరవు.. కొనసాగుతున్న అన్వేషణ   
పోట్లదుర్తిలో విషాదఛాయలు  

గల్లంతైన రామాంజనేయులు, భార్య పెంచలమ్మ, తల్లి సుబ్బమ్మ,

కుమార్తెలు మేఘన, అంజలి (పాత చిత్రం.. ఇందులో కుమారుడు లేడు)

ప్రొద్దుటూరు -ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే : అంచనాలకు అందని వరదనీటి ఉద్ధృతి ఓ కుటుంబాన్ని గల్లంతు చేసింది. అర్ధరాత్రి చీకట్లో ఆటోలో స్వగ్రామానికి పయనమైన ఆరుగురు అనూహ్యంగా ఏటిలో కొట్టుకుపోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. స్వగ్రామం పోట్లదుర్తి ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి ఎస్సీ కాలనీకి చెందిన మునగాల రామాంజనేయులు (30), ఆయన భార్య పెంచలమ్మ (28), తల్లి సుబ్బమ్మ (55), కుమార్తెలు మేఘన (5), అంజలి (4), మరో ఆరు నెలల అబ్బాయి దువ్వూరు మండలం గొల్లపల్లెలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఈ నెల 16న వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి ఆటోలో తమ స్వగ్రామానికి తిరుగుపయనం అయ్యారు. మార్గమధ్యంలో కామనూరు వంక దాటే ప్రయత్నంలో వరదనీటి తాకిడికి ఆటో సహా మొత్తం నీటిలో పడిపోయారు. చీకట్లో వారు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో కామనూరు గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. వారిని కాపాడేందుకు మోకులు అందించారు. రాత్రి సమయ కావడం, చిమ్మచీకట్లు ఉండటం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిని ఒడ్డుకు చేర్చలేకపోయారు. ఆ సమయంలో ముగ్గురు కొట్టుకుపోయారని భావించి అధికారులకు సమాచారం అందించారు. గ్రామీణ సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్ర అధికారి రఘునాథ, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమై గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం మొత్తం ఆరుగురు గల్లంతయిన విషయం వారి బంధువుల ద్వారా పోలీసుల దృష్టికి వచ్చింది.

కుందూ నదిలో గాలింపు చర్యలు చేపట్టిన డీఎస్పీ సుధాకర్‌, సీఐ విశ్వనాథరెడ్డి తదితరులు

రెండు రోజులుగా గాలింపు : రెండు రోజులుగా గల్లంతైన వారి కోసం పోలీసులు, ఇతర శాఖల వారు తీవ్రంగా గాలించారు. బుధవారం ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్‌, గ్రామీణ సీఐ విశ్వనాథరెడ్డి కుందూ నదిలో కామనూరు నుంచి ఖాజీపేట మండలం ఏటూరు వరకూ గాలించారు. జిల్లా ఎస్పీ అభిషేక్‌ మొహంతి ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐలు విశ్వనాథరెడ్డి, రామకృష్ణ, నలుగురు ఎస్‌ఐలు సునీల్‌రెడ్డి, నారాయణ యాదవ్‌, రఫి, యోగేంద్రలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అగ్నిమాపక కేంద్ర అధికారి రఘునాథ కూడా ప్రత్యేక బృందంలో ఉన్నారు. ప్రొద్దుటూరు తహసీల్దారు చండ్రాయుడు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు కూడా పాల్గొంటున్నారు. మత్స్యశాఖ, గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు. బుధవారం రాత్రి వరకూ ఆచూకీి లభ్యం కాలేదు. గురువారం ఉదయానికి వీరి జాడ తెలియకుంటే ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద కూడా గాలింపు చర్యలు చేపడతామని వివరించారు.

స్వగ్రామంలో విషాద ఛాయలు : ఆటో నడుపుకొని జీవనం సాగించే రామాంజనేయులు, కుటుంబం మొత్తం నీటి ఉద్ధృతికి కొట్టుకుని పోవడంతో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురితో మంచిగా ఉంటూ, అందరినీ ఆప్యాయంగా పలకరించే కుటుంబం కనిపించకపోవడంతో గ్రామస్థులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.