close

తాజా వార్తలు

మందు లేని విందు కోసం..

దావత్‌ వితౌట్‌ దారు

జరసోచో పుట్టిన రోజు చేసుకున్నా..ప్రమోషన్‌ వచ్చినా..ప్రాజెక్టు ముగిసినా..సందర్భం ఏదైనా పార్టీ..పార్టీ అంటే.. మందు..తాగడం.. ఊగడం.. అక్కడితో ఆగక..బైకో, కారో వేసుకుని రోడ్లపైకి రావడం..ఫలితం.. యాక్సిడెంట్‌లు చేస్తూ  నిండు ప్రాణాల్ని బలిగొనడం..ఈ విష సంస్కృతికి ‘నో’ చెప్పేందుకు ఓ ఉద్యమం మొదలయ్యింది..వారిది ఒక్కటే నినాదం..‘మందు లేని విందు’
* చల్లని సాయంత్రం కూతురితో బయటికి వచ్చారు తల్లిదండ్రులు. షాపింగ్‌ అని భార్య.. నో.. రెస్టారెంట్‌ అని కూతురు. తండ్రి ఓటెప్పుడూ ఆడ బిడ్డకేగా. ముగ్గురూ నవ్వుతూ.. మాట్లాడుకుంటూ కారులో వెళ్తున్నారు. ఇంతలో మరో కారు మెరుపు వేగంతో వచ్చి ఢీ కొట్టింది. అంతే.. అప్పటి వరకూ ఎంతో హాయిగా ఉన్న ఆ ముగ్గురి అందమైన ప్రపంచం రోడ్డు మీదే ఛిద్రమైంది. క్షణాల్లో చిన్నారి ఊపిరి ఆగిపోయింది. తల్లిదండ్రుల గుండె పగిలింది. దీనంతటికీ కారణం నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మద్యం మత్తు. విచక్షణ కోల్పోయి కిక్కెక్కిన డ్రైవింగ్‌కి ఓ కుటుంబం భవిష్యత్తు చీకటైపోయింది.
- మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదం ఇది. చిన్నారి పేరు రమ్య.

ఈ సంఘటన చాలా మందిని చలించేలా చేసింది. ఎక్కువ శాతం మంది ఓ నిట్టూర్పు విడిచి మర్చిపోతారు. కానీ, కొందరే ఏదైనా చేయాలని సంకల్పించుకుంటారు. అలా ఒక్కడిగా సంకల్పించుకుని ఓ సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు చెగొండి చంద్రశేఖర్‌ (చెగొ). రాబోయే తరాన్ని మద్యం మహమ్మారి నుంచి కాపాడడమే ఉద్యమ లక్ష్యం. ‘జిందగీ ఇమేజెస్‌’ అనే పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి యువతని ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నాడు.
కొద్దిక్షణాల మత్తు.. నూరేళ్ల జీవితాన్ని చిత్తు చేస్తోంది.. మిత్రులు బలవంతం చేశారనో.. కార్యక్రమాల్లో అందరి ముందూ చులకనవ్వొద్దనో మొదలయ్యే అలవాటు పెనుభూతమై బంగారు భవితను నాశనం చేస్తోంది.. మత్తులో మనుషులమని మరిచిపోయేంతలా చేస్తోంది.  విచక్షణ మరచి చేస్తున్న పనులు వేల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, గొడవలు, అల్లర్లు వీటన్నింటి వెనుక మద్యానిదే ప్రధాన పాత్ర. మనం బాగానే ఉన్నా అవతలి వ్యక్తులతోనైనా మనకు ప్రమాదం జరగొచ్చు. అందుకే మందు మహమ్మారిని దూరం చేయాలనుకున్నారు జిందగీ ఇమేజెస్‌ సభ్యులు. గత జులై నెలలో నగరంలో రమ్య సంస్మరణ దినాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. మద్యంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.  

మార్పు కోసం ముందడుగు..
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చెగొండి చంద్రశేఖర్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ముందునుంచే సామాజిక కార్యక్రమాలపై ఉన్న ఆసక్తితో 2013లో ‘జిందగీ ఇమేజెస్‌’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. వీలైనంత ఎక్కువ మందికి విషయాన్ని చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించేవారు.. వివిధ ప్రాంతాల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పల్లె నాగరికతపై చర్చింకునేవారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో మిగతా సభ్యులతో పంచుకునేవారు. పెరిగిన గ్రూప్‌ సభ్యుల ద్వారా ఏదైనా సమస్యపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్న ఆలోచనకొచ్చారు చెగో. అప్పటికే అన్ని సమస్యలను గ్రూప్‌లో చర్చకు తెచ్చేవారు. వీటన్నింటి వెనుకున్న ప్రధాన కారణం మద్యమని గుర్తించారు. దీన్ని దూరం చేయగలిగితే సగటు పేదోడికి మంచిచేసినట్టేనని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ‘దావత్‌ వితౌట్‌ దారు’ (మందు లేని విందు) ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనికి గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరి మద్దతూ లభించడంతో ప్రచారం మొదలుపెట్టారు.
కొత్త తరానికి.. సరికొత్త ప్రచారాలు..
ఉద్యమాన్ని కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం చేయకుండా బయట కూడా ప్రచారం చేయడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఎందరి కుటుంబాలనో మద్యం బుగ్గిపాలు చేసింది. రాబోయే తరాలనైనా అటు మళ్లకుండా కాపాడగలిగితేనే మార్పు మొదలవుతుందని భావించారు. అందులో భాగంగానే మందులేని విందుపై కొత్త పాటలు రాసి ఆల్బమ్‌లు విడుదల చేస్తున్నారు. ఆకట్టుకునే డైలాగులతో కుర్రకారుకు మందులేని విందును పరిచయం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా మెమేలు తయారుచేస్తున్నారు. ఉద్యమం ప్రారంభంలో వందల్లో ఉన్న సభ్యులు ఇప్పుడు రెండు లక్షల ముప్పై వేలకు చేరుకున్నారు. ఈ ఉద్యమ ప్రభావంతో ఎంతోమంది మద్యానికి దూరమయ్యారు. తెలంగాణలో దాదాపు ఇరవై గ్రామాల్లో పూర్తి మద్యపాన నిషేద ప్రతిజ్ఞ చేశారు. అందుకు కట్టుబడి ఉన్నారు. దీనికి మద్దతు తెలిపేందుకు కొందరు ప్రముఖులూ ప్రచారాలకు ముందుకొస్తున్నారు.


వారి మనసు మళ్లేలా చూడాలి..
 - చెగొండి చంద్రశేఖర్‌

‘మద్యం మానేద్దాం.. మద్యం వ్యాప్తికి సహకరించను’ అంటూ ప్రతిజ్ఞ చేసే సంస్కృతి అందరిలో రావాలి. ముఖ్యంగా యువతలో. సందర్భం ఏదైనా స్నేహితులు, బంధువులకు సమయం కేటాయించకుండా మందు తాగుతూ దాంట్లోనే కిక్‌ వెతుక్కుంటున్నారు. ‘దారు లేని దావతే ఇస్తా.. దారు లేని దావత్‌ అయితేనే వస్తా.’ అనే నినాదాలతో వెళ్తున్నాం. బార్‌లు, రెస్టారెంట్లకు బదులు పార్కు, లైబ్రరీ, సాహిత్య సమావేశాల వైపు యువతను మళ్లేలా చూడాలి. పండగంటే మద్యం తాగుడే అనుకునే పరిస్థితి మారాలి.

- అభిసాయి ఇట్టా, ఈనాడు-డిజిటల్‌, హైదరాబాద్‌


 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.