close

తాజా వార్తలు

తవ్వితే...నవజాత శిశువుల మృతదేహాలు!


కాలువలో పొక్లెయిన్‌తో పూడిక తీస్తున్న దృశ్యం

బాలానగర్‌, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో నవజాత శిశువుల మృతకళేబరాలు కనిపించడం సంచలనం రేపింది.. మండల కేంద్రంలోని తహశీల్దారు కార్యాలయానికి వెళ్లే దారిలోగల కల్వర్టులో దాదాపు 6 నెలలుగా పూడిక తీయలేదు. దీంతో చెత్తాచెదారం, ముళ్లచెట్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. వీటిని పొక్లెయిన్‌తో తొలగిస్తుండగా సుమారు 10 వరకు నవజాత శిశువుల మృతకళేబరాలు, తెగిపడిన అవయవాలు కనిపించాయి. పూడిక తీయడంతో మురుగు నీరు ఉధ్ధృతంగా రాగా అవి దిగువకు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు విస్తుపోయారు. బాలానగర్‌ చుట్టుపక్కల తండాలు అధికం. స్థానికంగా స్కానింగ్‌ కేంద్రాలు లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లి స్కానింగ్‌ చేయించుకుని ఆడ శిశువు అని తెలియగానే బాలానగర్‌లోని ప్రాథమిక చికిత్స కేంద్రాల్లోని పీఎంపీలను ఆశ్రయించి గర్భస్రావాలు చేయించుకున్న సంఘటనలపై గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతోపాటు ప్రేమ వ్యవహారాల్లో మోసపోయిన యువతులు కూడా వీరిని ఆశ్రయిస్తే గర్భస్రావాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి పది నవజాత శిశువుల మృతకళేబరాలు కనిపించడంతో కొందరు పీఎంపీల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రాథమిక చికిత్స చేయాల్సినవారు తెలిసీ తెలియని వైద్యం చేస్తున్నారని, నిబంధనలు అతిక్రమించి గర్భస్రావాలకు కూడా పాల్పడుతున్నారని సంఘటన స్థలంలో చర్చ జరిగింది. మురుగు కాల్వలో నవజాత శిశువుల మృతకళేబరాలు కనిపించిన విషయమై మండల వైద్యాధికారి డా|| తులసిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రాథమిక చికిత్స కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు తమ అధీనంలో ఉండవని అన్నారు. విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కాలువలో నవజాత శిశువుల మృత కళేబరాలతోపాటు మెడికల్‌ దుకాణాలకు సంబంధించిన చెత్త, ఆస్పత్రులకు సంబంధించిన వ్యర్థాలు ఉన్నాయని బాలానగర్‌ ఎంపీడీవో మొగులప్ప చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చెత్తను కాలువలో వేయడంపై స్థానిక పీఎంపీలు, మెడికల్‌ షాప్‌లు, ప్రైవేటు వైద్యులకు నోటీసులు ఇస్తామని తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.