close

తాజా వార్తలు

రాకెట్‌ సైంటిస్టుగారాణించాలంటే..!

కెరియర్‌ గైడెన్స్‌: స్పేస్‌ సైన్స్‌

విక్రమ్‌ ల్యాండర్‌ చందమామను చేరే క్షణంలో... అఖిల భారతావని సహా ప్రపంచం మొత్తం అనంత విశ్వంలోకి తీక్షణంగా దృష్టిసారించింది. ఆఖరి దశలో అది విఫలమైనా.. అప్పటిదాకా ప్రయోగాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మన శాస్త్రవేత్తల శ్రమను పొగడ్తలతో ముంచెత్తారు. నాసా వంటి ప్రముఖ సంస్థలూ ఇస్రో ప్రయత్నాన్ని ప్రశంసించాయి. దేశం కీర్తిని అంతరిక్షానికి చేర్చిన అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే.. స్పేస్‌ సైంటిస్టులుగా చేరాలంటే.. రోదసి రహస్యాలపై ఆసక్తి ఉండాలి. అందుకు తగిన కోర్సులు చేయాలి.

నంత విశ్వం రహస్యాలను ఛేదించడంతోపాటు, అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశాన్ని అంతరిక్ష రంగం కల్పిస్తోంది. అందులోకి ప్రవేశించాలంటే ఏం చదవాలి? స్పేస్‌ సైంటిస్టు, స్పేస్‌ ఇంజినీర్‌, రాకెట్‌ సైంటిస్టులుగా ఎదగాలంటే ఏం చేయాలి? తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తగిన ప్రణాళికతో ముందుకు సాగాలి.

మన చంద్రయాన్‌- 2 ప్రయోగంతో ప్రపంచ దేశాల మధ్య అంతరిక్ష రేసు మొదలైంది. అమెరికాతోపాటు చైనా, జపాన్‌, ఇజ్రాయెల్‌, ఇంకా కొన్ని దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలైన స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజన్‌ వంటివి గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఈ రంగానికి ఉన్న భవిష్యత్తునూ, నిపుణుల అవసరాన్నీ సూచిస్తున్నాయి.

అంతరిక్ష రంగంలో సాంకేతికపరంగా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నవాటిలో కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్‌) సర్వీస్‌ రంగం ఒకటి. శాటిలైట్ల ద్వారా అందించే డైరెక్ట్‌ బ్రాడ్‌కాస్ట్‌, డిజిటల్‌ ఆడియో రేడియో అండ్‌ ఇంటర్నెట్‌ సేవలు ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకీ ప్రాధాన్యం ఎక్కువే. భూ సంబంధిత సమాచార విశ్లేషణకూ, భూమి నుంచి శాటిలైట్లను నిర్ణీత ప్రదేశానికి పంపడానికీ, వాటి నియంత్రణకూ ఐటీ ఉపయోగపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా స్పేస్‌ రంగానికి నిపుణుల అవసరం ఉంది. ముఖ్యంగా నైపుణ్యమున్న యువత కొరత ఎక్కువుంది. ఇటీవల స్పేస్‌లోకి పంపుతున్న అంతరిక్ష నౌకల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇస్రో వంటి సంస్థలకు పనిభారం పెరుగుతోంది. దీంతో ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి ఒప్పంద విధానంలో విద్యార్థులను తీసుకుంటున్నాయి. అంతరిక్ష పరిశోధన, పని అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి.

పదో తరగతి నుంచే ప్రారంభం

స్పేస్‌ సైంటిస్ట్‌ కావాలంటే పదోతరగతి నుంచే ప్లానింగ్‌ ప్రారంభం కావాలి. ఇంజినీరింగ్‌ వైపు వెళ్లాలా, సైన్స్‌ వైపు సాగాలా అనేది అప్పుడే నిర్ణయించుకొని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఇంజినీరింగ్‌: ఇంజినీరింగ్‌ వైపు వెళ్లాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను సబ్జెక్టులుగా చదివుండాలి. డిగ్రీ స్థాయిలో బీటెక్‌/ బీఈ తీసుకోవాలి. స్పేస్‌ టెక్నాలజీలో అన్ని విభాగాలకూ అవకాశం ఉన్నప్పటికీ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యర్థులకు డిమాండ్‌ ఎక్కువ. రిఫ్రఫిజిరేషన్‌, ఏర్‌ కండిషనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మొదలైన విభాగాలవారికీ అవకాశాలుంటాయి. వీటిల్లో ఏదో ఒకదానిలో మాస్టర్స్‌ డిగ్రీ ముఖ్యంగా స్పేస్‌ సైన్స్‌మీద దృష్టిపెట్టే విధంగా ఉన్నదాన్ని తీసుకుంటే స్పేస్‌ సైంటిస్టు కావచ్ఛు.

సైన్స్‌ డిగ్రీ: ఇంటర్‌లో ఎంపీసీ చదివుండాలి. మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌లతో డిగ్రీ చేయాలి. పీజీ స్థాయిలో ఆస్ట్రానమీ/ ఆస్ట్రోఫిజిక్స్‌ సంబంధిత కోర్సులు పూర్తిచేయాలి.

ఈ రెండు విభాగాలవారూ తమ అర్హతలకు డాక్టరేట్‌ను జోడించుకోగలిగితే మరింత ఉపయోగకరం. స్పేస్‌ సైన్స్‌కు సంబంధించి ఎన్నో ప్రముఖ సంస్థలు అనేక రిసెర్చ్‌ ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి.

మార్గాలేమిటంటే..!

అంతరిక్ష రంగంలోకి ప్రవేశించడానికి ఉన్న మార్గాల్లో ఒకటి సైన్స్‌, రెండోది ఇంజినీరింగ్‌. ఒక స్పేస్‌ సైంటిస్ట్‌ విశ్వాన్ని సంబంధిత పరికరాలు లేదా భూమి మీద ఉండే భారీ టెలిస్కోపులను ఉపయోగించి చూస్తారు. ఈ పరికరాలు, టెలిస్కోపులతోపాటు స్పేస్‌ షిప్‌ (వ్యోమ నౌక)లను తయారు చేసేది స్పేస్‌ ఇంజినీర్‌. ఈ రెండు విభాగాల్లో ఒకే విధమైన అంశాలుంటాయి. ఎందుకంటే సైంటిస్టుకు ప్రస్తుత సాంకేతికత పరిధులు తెలియాలి. ఇంజినీర్‌కు బలమైన విజ్ఞానశాస్త్ర నేపథ్యం ఉండాలి. అప్పుడే అంతరిక్ష అధ్యయనానికి అవసరమైన పరికరాలను విజయవంతంగా తయారు చేయగలుగుతారు.

సాధారణంగా స్పేస్‌ సైన్స్‌ను ఎంచుకున్నవారు రిసెర్చ్‌ ల్యాబొరేటరీలు, విశ్వవిద్యాలయాలు, సంబంధిత ఏజెన్సీల్లో ఉద్యోగులుగా చేరుతుంటారు. వీరు ఆస్ట్రానమర్లు లేదా ఆస్ట్రోఫిజిసిస్టులుగా కెరియర్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువ. స్పేస్‌ ఇంజినీర్లు ప్రారంభంలో ఇండస్ట్రియల్‌ కంపెనీలు, కన్సల్టెన్సీలు లేదా ఇస్రో, నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) వంటి ప్రసిద్ధ స్పేస్‌ ఏజెన్సీల్లో చేరతారు.

ఏ సంస్థల్లో ఏ కోర్సులు?

స్పేస్‌ కెరియర్‌కు ప్రధానంగా అవసరమైన ఇంజినీరింగ్‌ డిగ్రీని ఐఐటీలు అందిస్తున్నాయి. వీటిలో కొన్ని సుప్రసిద్ధ సంస్థలు ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని ఆఫర్‌ చేస్తున్నాయి. అవేకాకుండా మరికొన్ని ప్రముఖ సంస్థలూ అవసరమైన డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, తిరువనంతపురం: ఇందులో బీటెక్‌, డ్యూయల్‌ డిగ్రీ, ఎంటెక్‌ కోర్సులు ఉన్నాయి. బీటెక్‌ విద్యార్థులకు జేఈఈ స్కోరు, పీజీ కోర్సులకు గేట్‌, జెస్ట్‌, యూజీసీ నెట్‌ల స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సాధారణంగా అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఏప్రిల్‌, మేల్లో విడుదలవుతాయి.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు: ఈ సంస్థలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌, ఎంటెక్‌, ఎం.డిజైన్‌, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్‌ కోర్సుకు ఐఐటీ, జేఈఈ, నీట్‌ ద్వారా; ఎంటెక్‌/ ఎండిజైన్‌కు గేట్‌, క్యాట్‌, జీమ్యాట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి జామ్‌, జెస్ట్‌ స్కోరు ఉండాలి. పీహెచ్‌డీకి నెట్‌, గేట్‌ స్కోర్ల ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, బెంగళూరు: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ స్కోరు, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం: బీఎస్‌-ఎంఎస్‌, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్‌ డిగ్రీకి కేవీపీవై ఫెలోషిప్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోరు ఆధారంగా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు జామ్‌/ ఎన్‌బీహెచ్‌ఎం/ జెస్ట్‌ స్కోరుతోపాటు ఇంటర్వ్యూ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తారు.

ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, పుణె: ఐయూసీఏఏ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఉంది. ఈ సంస్థ నిర్వహించే నేషనల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఐఎన్‌ఏటీ), జెస్ట్‌, యూజీసీ నెట్‌ ఆధారంగా సీటు లభిస్తుంది.

● నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రానమీ, పుణె: ఈ సంస్థ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ అందిస్తోంది. జెస్ట్‌, ఐఎన్‌ఏటీ, టీఐఎఫ్‌ఆర్‌ ఎంట్రన్స్‌ టెస్టుల ఆధారంగా ప్రవేశం పొందవచ్ఛు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, భువనేశ్వర్‌: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ- పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులు ఇందులో ఉన్నాయి. నెస్ట్‌, నెట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.

ఏ విద్యా నేపథ్యం అవసరం?

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) కోర్సుల వారికి స్పేస్‌ సైన్స్‌ మంచి అవకాశం. ఈ అభ్యర్థులకు ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ లేదా ఇంజినీరింగ్‌ల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. స్పేస్‌ క్రాఫ్ట్‌, రాకెట్‌ సైన్సుపై ఆసక్తి అవసరం. రాకెట్‌ సైన్స్‌ ఈ విభాగాల చుట్టూనే తిరుగుతుంది. రాకెట్‌ను తయారు చేయడం దగ్గర్నుంచి, అది మోసుకెళ్లే శాటిలైట్లను విజయవంతంగా స్పేస్‌లో ప్రవేశపెట్టడం వరకు వీటితోనే ముడిపడి ఉంటాయి. ఏరోస్పేస్‌, కంప్యూటర్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మ్యాథమేటికల్‌, ఫిజికల్‌ సైన్స్‌ తదితర ఇంజినీరింగ్‌ విభాగాల విద్యార్థులకు ఇదో ఛాలెంజింగ్‌ కెరియర్‌.

ఇందుకు అకడమిక్‌ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం, సానుకూల దృక్పథం వంటి లక్షణాలుండాలి. డిగ్రీ కోర్సు విద్యార్థికి నిర్ణీత దిశానిర్దేశం చేస్తుంది. అదనంగా అవసరమైన అంశాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయగలిగిన ఆసక్తి అభ్యర్థులకు ఉండాలి. ఎందుకంటే.. అంతరిక్షంలోని కొన్ని అంశాల పరిశీలనకు కావాల్సిన పరికరాలను ఆస్ట్రోఫిజిసిస్ట్‌లు ప్రవేశపెడుతుంటారు. స్పేస్‌ క్రాఫ్ట్‌లోని ఈ పరికరాలు నక్షత్రాలు, పాలపుంత, ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌, ఎక్స్‌రే, గామా కిరణాల వంటి వాటిని గుర్తిస్తాయి. వీటిిని భూ వాతావరణంలో పరిశీలించడం కష్టం. ఇలాంటి అధ్యయనాల్లో క్లైమటాలజీ, అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌, మెటియోరాలజీ, జియోఫిజిక్స్‌, ఎకాలజీ, ఓషనోగ్రఫీ.. తదితర ఎన్నో అంశాలపై పరిజ్ఞానం అవసరం. అందుకే అభ్యర్థులకు విద్యాసంబంధ విషయాలతోపాటు ఇతర విభాగాలపైనా తగిన అవగాహన ఉండాలి.

ఇస్రో/ నాసా మీ లక్ష్యమైతే?

విద్యార్థి దశలోనే ఇస్రో, నాసాల్లో ఇంటర్న్‌షిప్‌ల కోసం ప్రయత్నించవచ్ఛు కొన్నిసార్లు ఈ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో స్పేస్‌ రిసెర్చ్‌కు సంబంధించి పోటీలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా రాకెట్లు, శాటిలైట్లకు సంబంధించి ప్రాజెక్టులు చేయమని కోరతాయి. విద్యార్థి స్కూలు/ కళాశాల ద్వారా వీటిలో పాల్గొనవచ్ఛు మెప్పించినవారికి రివార్డులతోపాటు ఉద్యోగావకాశాలు దక్కే వీలుంటుంది.

ఇస్రో ఏటా వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తుంది. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గేట్‌ స్కోరుతో ఉద్యోగాలు ఇవ్వరు. ఒక్కోసారి ఇస్రోనే నేరుగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంటుంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.