close

తాజా వార్తలు

చేరండి... ఆర్థిక సైన్యంలో!

కెరియర్‌ గైడెన్స్‌ ఫిన్‌టెక్‌ నిపుణులు

అప్పట్లో బ్యాంకు అప్పు పుట్టాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు మూడే నిమిషాల్లో లోన్‌ ఇస్తారో.. ఇవ్వరో తేల్చేస్తున్నారు. కరెన్సీ కాగితం కనిపించకుండా అన్ని రకాల అమ్మకాలు, కొనుగోళ్లు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు, పెట్టుబడుల ప్రవాహాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థలో పెరిగిన ఆధునిక టెక్నాలజీ వినియోగం మహిమలు. అదే  ఫైనాన్షియల్‌ టెక్నాలజీ - ఫిన్‌టెక్‌. దీని వల్ల కొత్త కొత్త కొలువులు వస్తున్నాయి. వాటిని అందుకోవాలంటే కొన్ని కోర్సులు చేయాలి.

విద్యార్థుల నుంచి సంప్రదాయ విద్యను మించిన పరిజ్ఞానాన్ని సంస్థలు కోరుకుంటున్నాయి. రకరకాల నైపుణ్యాలు, సామర్థ్యాలనూ ఆశిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికరంగంలో ఈ డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా అభ్యర్థులను సిద్ధం చేసేందుకు విద్యాసంస్థలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. నియామకాల తర్వాత శిక్షణ ఇచ్చుకునే భారాన్ని కంపెనీలకు తగ్గించే విధంగా వాటిని రూపొందిస్తున్నాయి.

ప్రతి రంగం డిజిటలైజ్‌ అవుతోంది. కోర్‌ నుంచి సేవల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో అందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ల్లో ఇది మరింత వేగంగా సాగుతోంది. బ్యాంకులోకి అడుగు పెట్టకుండానే అన్ని రకాల లావాదేవీలు పూర్తవుతున్నాయి. మొబైల్‌ డిజిటల్‌ వ్యాలెట్‌గా మారిపోయింది. బిల్లు చెల్లింపు నుంచి అప్పులివ్వడం వరకూ అన్నీ ఆన్‌లైన్‌లో టెక్నాలజీ సాయంతో సులువుగా జరుగుతున్నాయి.

ఫిన్‌టెక్‌ అంటే?
ఆర్థిక వ్యవస్థకు సాంకేతికతను అనుసంధానం చేయడమే ఫిన్‌టెక్‌. ఫైనాన్స్‌, టెక్నాలజీలను కలిపి ఫిన్‌టెక్‌గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఆర్థిక సంబంధ సేవలను అందించడం, వస్తువులను వినియోగదారులకు చేర్చడంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో దీనికి ఆదరణ పెరుగుతోంది.  దీంతో రకరకాల ఉద్యోగాలు, అందుకు తగిన కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఇదో ఎమర్జింగ్‌ కెరియర్‌గా మారింది. డిజిటల్‌ కరెన్సీ, థిమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, క్రెడిట్‌ స్కోరింగ్‌, విద్యాసంబంధ లోన్లు వంటి ఎన్నో ఇందులో ఉన్నాయి. ఆర్థికపరమైన సలహాలకు ‘రోబో అడ్వైజ్‌’ అందుబాటులోకి రానుంది. ఇలాంటి పరిణామాల వల్ల ఏటా పదివేల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు వివిధ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఆన్‌లైన్‌లో మరికొన్ని  నేరుగా అందిస్తున్నాయి. కోర్సులో భాగంగా ఫైనాన్స్‌ సంబంధిత అంశాలతోపాటు తాజా టెక్నాలజీలు- బ్లాక్‌చెయిన్‌, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ల గురించీ నేర్పిస్తున్నాయి.

ఫిన్‌టెక్‌ ప్రోడిగ్రీ - ఇమార్టికస్‌ లర్నింగ్‌

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంటే ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఆ రంగంలో రెండేళ్లకు పైగా అనుభవమున్న ప్రొఫెషనల్స్‌, ఆర్థిక సంబంధ సంస్థలో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నవారు, ఆంత్రప్రెన్యూర్లకు ఈ ఆన్‌లైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. వ్యవధి 125 గంటలు. కోర్సులో అయిదు స్థాయులుంటాయి. అవి.. ఫిన్‌టెక్‌ ప్రైమర్‌, డీప్‌ డైవ్‌- బ్లాక్‌ చెయిన్‌, డీప్‌డైవ్‌- ఎనలిటిక్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ డైవ్‌- రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ఎక్స్‌పీరియెన్షియల్‌ లర్నింగ్‌, స్టార్ట్‌అప్స్‌ ప్రెజెంట్‌. వీటితోపాటు క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్టులు, కేస్‌స్టడీస్‌, పరిశ్రమ నిపుణులతో సందేహాల నివృత్తి అవకాశాలుంటాయి. కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికేషన్‌ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్‌సైట్‌ https://imarticus.org/ చూడవచ్చు.

ఎంబీఏ ఫిన్‌టెక్‌ -  ఐఐఎల్‌ఎం యూనివర్సిటీ

కోర్సులో భాగంగా ఇరవైకిపైగా కోర్‌ యూనిట్లను నేర్చుకుంటారు. పేమెంట్లు, మార్కెట్లు, డబ్బు, వినియోగదారుల అనుభవం వంటి ఎన్నో అంశాలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతోపాటు కొత్తవాటినీ తెలుసుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. ఆఫ్‌లైన్‌ కోర్సు. ఏదైనా విభాగంలో డిగ్రీ చేసినవారు అర్హులు. క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలుంటాయి. https://iilm.edu/

పీజీలు - బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్‌ లిమిటెడ్‌

సంస్థలో ఫిన్‌టెక్‌కు సంబంధించి మాస్టర్స్‌, పీజీ డిప్లొమా ఫుల్‌టైమ్‌ కోర్సులు ఉన్నాయి.  ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. కాలవ్యవధి మాస్టర్స్‌కి రెండేళ్లు. డిప్లొమాకి ఏడాది. సెమిస్టర్ల విధానం ఉంది. వీటిలో ప్రధానంగా అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎనలిటికల్‌ మెథడ్స్‌పై అవగాహన కలిగిస్తారు. తాజా టెక్నాలజీలు- బ్లాక్‌చెయిన్‌, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ వంటి మాడ్యూళ్లపైనా బోధన ఉంటుంది. ప్రయోగాత్మకంగా నేర్పిస్తారు. కేస్‌స్టడీలూ ఉంటాయి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. http://mumbaiuniversity.bsebti.com/

బ్యాచిలర్‌, పీజీ స్థాయుల్లో..!

ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ, స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఫైనాన్షియల్‌ అసెట్లపై కొనుగోలుదార్లు, అమ్మకందార్లు  కలిసి ట్రేడ్‌ చేయడానికి వీలు కల్పించేదే క్యాపిటల్‌ మార్కెట్‌. ఈ లావాదేవీలపై ఆసక్తి ఉండి ఫైనాన్షియల్‌ పరిశ్రమలో పనిచేయాలనుకునేవారు సంబంధిత డిగ్రీ పూర్తిచేసిన తర్వాత సాధారణంగా సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ఎంచుకుంటుంటారు. అలాకాకుండా నేరుగా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా డిగ్రీ, పీజీ చేస్తే మరిన్ని అవకాశాలను అందుకోవచ్చు. అలాంటి బ్యాచిలర్‌ కోర్సు, పీజీ స్థాయిలో ఎంబీఏ అందుబాటులో ఉన్నాయి. కాలవ్యవధి డిగ్రీకి మూడేళ్లు, పీజీకి రెండేళ్లు. ఆర్థిక సేవల పరిశ్రమల్లో చేయాలనుకునేవారికి ఇవి ఉత్తమ ఎంపికలు. ఈ కోర్సుల్లో టెక్నికల్‌ అనాలిసిస్‌, ఫండమెంటల్‌ అనాలిసిస్‌, డెరివేటివ్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌మెంట్‌ మొదలైన మాడ్యూళ్ల గురించి అభ్యర్థులు తెలుసుకుంటారు. డిగ్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్‌లో  కామర్స్‌ చదివుండాలి. పీజీ చేయాలంటే కామర్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేయాలి. ఈ బ్యాచిలర్‌ కోర్సు అందిస్తున్న పలు సంస్థలు ప్రత్యేక ప్రవేశపరీక్షలను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పీజీకి క్యాట్‌/ గ్జాట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* జైన్‌ యూనివర్సిటీ, బెంగళూరు
* బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
* బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్‌ లిమిటెడ్‌, ముంబయి
* ఐఐఎం- బెంగళూరు, అహ్మదాబాద్‌
* ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి
* శ్రీరామ్‌ మూర్తి స్మారక్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూలు, లఖ్‌నవూ
* నర్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబయి
* విశ్వవిశ్వానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌.

ఫిన్‌టెక్‌ ఫౌండేషన్‌ కోర్సు

ఫిన్‌టెక్‌ ఫౌండేషన్‌ కోర్సును ఈ సంస్థ ఆన్‌లైన్‌లో అందిస్తోంది. కాలవ్యవధి 8 గంటలు. వీడియో లెక్చర్లు ఉన్నాయి. నిపుణులతో మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్రడక్షన్‌ టు ఫిన్‌టెక్‌ వంటి ఉచిత కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. https://cfte.education/ ఇవే కాకుండా ఐఐఎం కలకత్తా అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ బ్లాక్‌ చెయిన్‌ను అందిస్తోంది. దీనికి ఏదైనా డిగ్రీ/ పీజీతోపాటు రెండేళ్ల అనుభవమున్నవారు అర్హులు. ఇంకా ఎడ్‌ఎక్స్‌, కోర్స్‌ ఎరా వంటి సంస్థలూ వివిధ ఫిన్‌టెక్‌ కోర్సులను అందిస్తున్నాయి.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.