close

తాజా వార్తలు

ఐఓటీదే...అంగ‘రంగ’ వైభోగం!

భిన్నరంగాల్లోకి దూసుకొస్తున్న టెక్నాలజీ
రాబోయే 3-5  ఏళ్లలో కొలువుల జోరు

ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారం... మేలైన సేద్యం... మెరుగైన నీటి సరఫరా...! ఇంకా విద్య, వైద్యం.. నిర్మాణం.. రవాణా.. విద్యుత్తు... ఇలా సకల రంగాల్లోకీ చొచ్చుకువస్తూ నాణ్యమైన, వేేగవంతమైన సేవలనందిస్తోంది- ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌! సాంకేతిక విప్లవమిది. భవిష్యత్తు అంతా ఈ ఐఓటీదే. వచ్చే 3-5 ఏళ్లలో భారీ మార్పులు దీన్ని ప్రమేయంతో చోటు చేసుకోబోతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలకు ఇందులో ఆస్కారముంది. వాటిని ముందుగా అందిపుచ్చుకోవడంపై యువత దృష్టి సారించాలి. సంబంధిత కోర్సులు చేసి, నైపుణ్యాలు పెంచుకుంటే ఇక తిరుగే ఉండదు!

అంతకంతకూ పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, అనలిటిక్స్‌ కారణంగా ఐఓటీ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. అనుసంధానమై ఉన్న ఎన్నో సెన్సార్లు, పరికరాల మధ్య సమాచారం నిరంతరంగా ప్రవహించే వ్యవస్థగా ఐఓటీని చెప్పుకోవచ్చు.  ఇది మానవ ప్రమేయం లేకుండా జరిగే అంశం.
ఈ డిజిటల్‌ యుగంలో ఏ ప్రభుత్వానికైనా ఇది అవసరమే. ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికీ, పౌరసేవలను మెరుగుపరచడానికీ, భద్రమైన సమాజాన్ని నిర్మించడానికీ, పర్యావరణాన్ని కాపాడుకోవడానికీ, నగర నిర్వహణకూ.. ఇలా ఎన్నో అంశాలకు ఐఓటీ సహకరిస్తుంది. ఎలాగంటే.. కెమేరాలు, వాతావరణ, పర్యావరణ సెన్సార్లు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, పార్కింగ్‌ జోన్లు, వీడియో సర్వేలన్స్‌ సేవలు తదితర వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని ఐఓటీ క్రోడీకరిస్తుంది. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి వీలవుతుంది.
భారత్‌లో 2020 కల్లా 15 బిలియన్‌ డాలర్ల మేర ఐఓటీ పరిశ్రమను సృష్టించడం ఐఓటీ భారత్‌ విధానపు ముఖ్యోద్దేశం. దీనివల్ల 2020 కల్లా ప్రస్తుతం అనుసంధానమైవున్న 20 కోట్ల పరికరాలు కాస్తా 270 కోట్లకు చేరుతాయి. ఐఓటీ వినియోగం వల్ల దేశంలోని ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకురావొచ్చు.

* ప్రజా సేవలను మరింత మెరుగ్గా అందించవచ్చు * కాలుష్య స్థాయులను తగ్గించవచ్చు. * ప్రజలకు భద్రతను మెరుగుపరచవచ్చు.  * ఆరోగ్య సంరక్షణను అందుబాటు ధరల్లోకి తీసుకురావొచ్చు. * ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు.
ఉద్యోగావకాశాలు..
ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో,  ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో ఐఓటీ వినియోగంలో ఉంది. ఈ సాంకేతికత ఇంకా వృద్ధి చెందే దశలోనే ఉన్నందున దీనిలో కెరియర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. మార్కెట్లో వివిధ హోదాల్లో దీనిలో ఉద్యోగాలకు ఆస్కారముంది.
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇంటర్నెట్‌ వంటి వాటి కలబోత అయిన ఐఓటీలో ప్రవేశించాలంటే.. సాంకేతికతపై లోతైన పరిజ్ఞానం, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ పరిజ్ఞానం తప్పనిసరి.

ఈ టెక్నాలజీలో అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగాలు...

* జూనియన్‌ ఐఓటీ  ఇంజినీర్‌ నీ ఐఓటీ సపోర్ట్‌ ఇంజినీర్‌
* ఐఓటీ  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నీ అసోసియేట్‌ ఐఓటీ ఇంజినీర్‌
* ఐఓటీ  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్మినిస్ట్రేటర్‌ నీ ఐఓటీ  సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ నీ ఐఓటీ అప్లికేషన్‌ డెవలపర్‌ నీ ఐఓటీ© ప్రొడక్ట్‌ మేనేజర్‌
* ఐఓటీ సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌ నీ ఐఓటీ రిసెర్చి డెవలపర్‌
* ఎఫ్‌పీ అండ్‌ ఏ ఐఓటీ సర్వీస్‌ మేనేజర్‌
తెలుగు రాష్ట్రాల్లో ఐఓటీ..
భారత్‌లో 120కి పైగా ఐఓటీ  కంపెనీలు ఉన్నాయి. పెద్ద స్థాయి ప్రాజెక్టులను అమలు చేసి ఐఓటీ విప్లవంతో కీలక దేశంగా ఎదగడానికి ఈ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం గట్టిగానే అవసరం ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఐఓటీ , హార్డ్‌వేర్‌ తయారీని రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేయడానికి, ప్రోత్సహించడానికి ఐఓటీ  విధానాన్ని ప్రకటించాయి. ఐఓటీ తెలంగాణ విధానం ప్రకారం.. వచ్చే అయిదేళ్లలో 50,000 మందికి నేరుగా ఉద్యోగాలను కల్పించాలి. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఐఓటీ  విధానం ప్రకారం.. కనీసం 50,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా.. ఉద్యోగ కల్పన చేయాలి.

ఏ రంగాల్లో భవిష్యత్తు?
సమాజానికవసరమైన వివిధ రంగాలు ఐఓటీని విస్తృతంగా, బహుముఖంగా ఉపయోగించుకునే అవకాశాలు పుష్కలం.
నిర్మాణ, విద్యుత్‌ రంగాలు: ప్రభుత్వ రంగ నిర్మాణాలు, సదుపాయాలు లేదా భారీ మౌలిక వసతులను ఐఓటీ ఆధారిత సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏసీ, విద్యుత్‌ వినియోగ స్థాయిలను గమనించవచ్చు. ఎవరూ లేని గదుల్లో ఏసీ/ బల్బుల వినియోగాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్‌ గ్రిడ్‌, స్మార్ట్‌ మీటర్‌ సొల్యూషన్‌లలోనూ ఐఓటీ ఆధారిత వ్యవస్థలను వినియోగించుకోవచ్చు.
విద్య: విద్య నాణ్యత, వృత్తి నైపుణ్యాభివృద్ధి, సదుపాయాల నిర్వహణ వంటి వాటిని ఐఓటీ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. ఇంకా..

* ఒక్కో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.
* ఉపాధ్యాయులకు శక్తిమంతమైన విద్యా అంశాలను సులువుగా అందజేయవచ్చు. ః విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరమయ్యే సదుపాయాల ద్వారా సమాచార సేకరణతో మరింత ముందుకు వెళ్లవచ్చు.
తయారీ: తయారీ రంగంలో స్మార్ట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు. ఉత్పత్తి ప్రక్రియల్లో ఆటోమేషన్‌ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. భద్రతను పెంచవచ్చు.

* ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) అప్లికేషన్లను వైఫై ద్వారా అనుసంధానించి ఎప్పటికప్పుడు ఉత్పాదకతను పర్యవేక్షించవచ్చు. * స్మార్ట్‌ టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా తయారీ ప్రక్రియలైన కొలవడం, డ్రిల్లింగ్‌, బిగించడం వంటి వాటిని నిర్వహించవచ్చు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. * వివిధ వైద్య సామగ్రి పరికరాలను సుదూరాల నుంచి కూడా పర్యవేక్షించవచ్చు. * ఇంజిన్లలో సెన్సార్లను ఏర్పాటు చేయడం ద్వారా ముందస్తుగా మరమ్మతులను గుర్తించవచ్చు.
రవాణా: ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌.. తదితర రవాణా వ్యవస్థల్లో ఐఓటీని చక్కగా వినియోగించుకోవచ్చు. సమాచార, నియంత్రణ, డేటా పంపిణీ వంటి వాటిని మెరుగుపరచవచ్చు. వీధి కెమెరాలు, కదలికలను పసిగట్టే సెన్సార్లు, గస్తీ అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి ట్రాఫిక్‌ ధోరణులను పసిగట్టవచ్చు. వాస్తవ సమయ ట్రాఫిక్‌ సెన్సార్ల సమాచారం ద్వారా ప్రయాణికులు రద్దీ తక్కువుండే మార్గాలను ఎంచుకోవచ్చు. ఇంకా..

* ఐఓటీ  సెన్సార్లను వినియోగించి.. నౌకల సమాచారాన్ని రాబట్టుకోవచ్చు. * ట్రాఫిక్‌, పార్కింగ్‌ గురించి జీఎపీఎస్‌ ఆధారిత సమాచారాన్ని పొందొచ్చు. * విమానాశ్రయాల్లో ఆర్‌ఎఫ్‌ఐడీ టాగ్స్‌ ద్వారా అన్ని బ్యాగేజీ కార్టులు, గ్రౌండ్‌ మోటరైజ్డ్‌ సామగ్రిని పర్యవేక్షించవచ్చు. * సరకు రవాణా విషయంలో సరకు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఉష్ణోగ్రత ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు.
ఆరోగ్య సంరక్షణ: సులభతర పద్ధతిలో రోగులను రోజు మొత్తం గమనించవచ్చు. రోగుల పరిస్థితిని ఐఓటీ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించవచ్చు. ఈ పర్యవేక్షక వ్యవస్థలో రోగి సమాచారాన్ని సెన్సార్ల ద్వారా రాబట్టి, దానిని విశ్లేషిస్తారు. క్లౌడ్‌లో నిల్వ చేస్తారు. దీనిని డాక్టర్లు తమ విశ్లేషణకూ, సమీక్షకూ ఉపయోగించుకోవచ్చు. ఇంకా..

* క్లినికల్‌ పరీక్షల సొల్యూషన్లకు ఐఓటీని ఉపయోగించుకోవచ్చు.
* నాడి, హృదయ స్పందనలను సెన్సార్ల ద్వారా తెలుసుకోవచ్చు.
* దీర్ఘకాల రోగులను సెన్సార్‌ ఆధారపరికరాల ద్వారా పరిశీలించవచ్చు.

స్మార్ట్‌గా..

నగరాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దటానికి ఐఓటీని వినియోగించవచ్చు. జనాభా వృద్ధి, మ్యాపింగ్‌, నీటి సరఫరా,  రవాణా ధోరణులు, ఆహార సరఫరా, సామాజిక సేవలు, భూవినియోగం తదితరాంశాలను పరీక్షించి.. సరళీకరించవచ్చు. నగరాల్లో రవాణా, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రధాన సేవల అమలును పరిశీలించవచ్చు. చెత్త నిర్వహణ, అత్యవసర సేవలను పర్యవేక్షించవచ్చు. మోటార్‌ వాహనాల పరీక్షలు, అనుమతులు, లైసెన్సింగ్‌లను పూర్తి చేయవచ్చు.

ఎక్కడ చదవొచ్చంటే..

ఐఓటీని చాలా సంస్థలు డిగ్రీలో పాఠ్యాంశంగా, పీజీలో ప్రధాన అంశంగా బోధిస్తున్నాయి. స్వల్పకాలిక కోర్సులూ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇంజినీరింగ్‌ వారే కాకుండా సైన్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా నేర్చుకునే అవకాశం ఉంది.
* బిట్స్‌ పిలానీ ఐఓటీలో 11 నెలల పీజీ ప్రోగ్రాం అందిస్తోంది.
* జయపురలోని భారతీయ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఐఓటీలో ఎమ్‌.ఓక్‌ కోర్సును ప్రవేశపెట్టింది.
* డీఐటీ యూనివర్సిటీ ఐబీఎంతో కలిసి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఐఓటీ స్పెషలైజేషన్‌ను అందిస్తోంది.
* కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో 24 వారాల కోర్సు ‘పీజీ డిప్లొమా ఇన్‌ ఐఓటీ అండ్‌ ఏఐ ఫర్‌ ఇండస్ట్రీ 4.0’ ఉంది.
* మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో కలిసి ఐఐటీ కాన్పూర్‌  ఐఓటీ, ఏఐ, రోబోటిక్స్‌ అంశాలపై పరిజ్ఞానం, అనుభవం పెంచే కోర్సులను అందిస్తోంది.  
* ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నాలుగేళ్ల బీటెక్‌ (సీఎస్‌ఈ)లో ఐఓటీని స్పెషలైజేషన్‌గా అందిస్తోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో రెండేళ్ల ఎంటెక్‌ కోర్సు కూడా ఇక్కడుంది.
* ఔరంగాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ సంస్థ ఐఓటీలో ఏడాది వ్యవధి ఉండే ఫుల్‌టైమ్‌ పీజీ డిప్లొమాను అందిస్తోంది.  
* హైదరాబాద్‌, బెంగళూరుల్లో శిక్షణ సంస్థలున్న ఐఎస్‌ఎం యూనివర్సిటీలో ‘మాస్టర్‌ ఇన్‌ ఐఓటీ అండ్‌ పైథాన్‌ ప్రోగ్రామ్‌’ ఉంది. 2.5 నెలల వ్యవధి ఉండే ఈ కోర్సులో క్లాస్‌రూమ్‌, ఆన్‌లైన్‌ శిక్షణ ఉంటాయి. ప్రోగ్రామింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం, ఐఓటీ కెరియర్‌పై ఇష్టం ఉన్నవారెవరైనా చేరటానికి అర్హులు.
* టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సీఐయూలో ఎం.ఎస్‌. ఇన్‌ డేటా అనలిటిక్స్‌ అండ్‌ ఐఓటీ ఉంది. కాల వ్యవధి రెండేళ్లు.  
* టీఐఎంటీఎస్‌ అనే ఆన్‌లైన్‌ ట్రెయినింగ్‌-కన్సల్టింగ్‌ సంస్థ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యమున్నవారికి ఐఓటీపై కోర్సును అందిస్తోంది. వ్యవధి 45 రోజులు.  
* కోలబెరా టాక్ట్‌, ఫ్రుగల్‌ లాబ్స్‌, నెక్సియాట్‌ వంటి ప్రైవేటు శిక్షణ సంస్థలూ ఉన్నాయి.

కెరియర్‌ నిర్మించుకోవాలంటే...

1 ఎలక్ట్రానిక్స్‌ బేసిక్స్‌ నేర్చుకోవాలి: రిసిస్టర్‌, కెపాసిటర్‌, ఎల్‌ఈడీ, ట్రాన్సిస్టర్‌, పీడబ్ల్యూఎం, ఏడీసీ, సోల్డరింగ్‌, కరెంట్‌, వోల్టేజి, మల్టీమీటర్‌ మొదలైనవాటిపై అవగాహన ఉండాలి.

2 ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌ పరిజ్ఞానం: ఐఓటీ బోర్డులపై పనిచేయాలంటే ఎంబెడెడ్‌ సి, పైథాన్‌ నేర్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జేఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
3 ఐఓటీ సెన్సార్ల ఉపయోగాల అవగాహన: అల్ట్రాసోనిక్‌ సెన్సార్‌, ప్రెషర్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ హ్యుమిడిటీ సెన్సార్‌, వాటర్‌ ఫ్లో సెన్సార్‌ మొదలైనవాటి వినియోగం నేర్చుకోవాలి.
4 ఐఓటీ ప్రోటాకాల్స్‌పై పట్టు: బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై, జిగ్‌బీ, వైర్డ్‌, వైర్‌లెస్‌ సెన్సర్‌ నెట్‌వర్క్స్‌, మాసివ్‌ ఐఓటీ, మొబైల్‌ కమ్యూనికేషన్‌ ప్రోటాకాల్‌- జీఎస్‌ఎం, సీడీఎంఏ, ఎల్‌టీఈ, జీపీఆర్‌ఎస్‌ అర్థం చేసుకోవాలి.

వాహన, వ్యవసాయ, రిటైల్‌ రంగాల్లో ఐఓటీ వినియోగ వివరాలు...www.eenadupratibha.net

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.