close

తాజా వార్తలు

తాళాలు క్షేమం.. ఆభరణాలు మాయం!

 ఆంధ్రాబ్యాంకులో మాయాజాలం
 చోరీ జరిగిందని తీరిగ్గా పోలీసులకు సమాచారం
 సీసీ కెమెరా సర్వర్‌ చోరీ, కంప్యూటర్ల తీగలు ధ్వంసం
 పోలీసుల అదుపులో మేనేజరు పురుషోత్తం 

యాదమరి, న్యూస్‌టుడే( చిత్తూరు): బ్యాంకులోని లాకర్‌ తాళాలు వేసినట్లే ఉన్నాయి. కానీ అందులోని బంగారు అభరణాలు మాత్రం మాయం అయ్యాయి. యాదమరి మండలపరిధిలో మోర్థానపల్లి వద్దనున్న అమరరాజా పరిశ్రమ ఆవరణలోని ఆంధ్రాబ్యాంకులో రూ.3.45కోట్ల విలువైన 17కిలోల బంగారు అభరణాలు, రూ.2.66 లక్షల నగదు మాయం అయింది. బ్యాంకు తలుపులకు వేెసిన తాళాలు, బ్యాంకులోపల లాకర్‌ తాళాలు వేసినట్లే ఉన్నాయి. బ్యాంకు లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించి సర్వర్‌ బాక్సు మాత్రం కనిపించలేదు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌ రెడ్డి, యాదమరి పోలీసుల కథనం మేరకు వివరాలు.... బ్యాంకులో చోరీ జరిగిందనే సమాచారంతో యాదమరి పోలీసులు, క్లూస్‌ టీం సభ్యులు మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు. ఘటనపై పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తాయి. బ్యాంకు తలుపులు, బ్యాంకు లోపల ఉన్న లాకర్‌ తాళాలు యథావిధిగా ఉన్నాయి. కేవలం సీసీ కెమెరా సర్వర్‌ బాక్సు కనిపించలేదు. కంప్యూటర్లు పనిచేయలేదు. పోలీసులు అనుమానంతో లాకర్‌ను బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌ వద్దనున్న మూడు తాళపుచెవులను ఉపయోగించి లాకర్‌ను తెరిచారు. అందులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులు జాగిలాలను రప్పించారు. లాకర్, మిగిలి ఉన్న కొద్దిపాటి నగదును వాసన చూసిన జాగిలాలు హైవేపై చిత్తూరు వరకు కొంతదూరం వచ్చి ఆగిపోయాయి. పోలీసులు మేనేజరు, క్యాషియర్, సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఉదయం నుంచి ఏం జరిగిందో రాబట్టారు. ఇంటిదొంగలపై అనుమానాలు బలపడడంతో.. మేనేజర్‌ పురుషోత్తం, క్యాషియర్‌ నారాయణను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ అనుమానాలే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
*దుండగులుచోరీకి పాల్పడితే బ్యాంకు తాళాలు పగులగొట్టడం, లాకర్‌ను ధ్వంసం చేయడం చేయాలి. కానీ ఇక్కడ బ్యాంకులో తాళాలతో సహా వస్తువులన్నీ యథాతథంగా ఉన్నాయి. 
*శుక్రవారం బ్యాంకు పనివేళలు ముగిశాక తాళం వేసిన సిబ్బంది మళ్లీ సోమవారం ఉదయం సెక్యూరిటీ సమక్షంలోనే తెరిచారు. శనివారం సెలవు రోజైనా బ్యాంకు మేనేజర్‌ బ్యాంకుకు వచ్చి విధులు నిర్వహించారని సెక్యూరిటీ పోలీసులకు వివరించారు. 
*ఉదయం బ్యాంకు తాళాలు తెరిచినప్పుడు తమకు ఎలాంటి అనుమానం తలెత్తలేదని, తాళాలన్నీ వేసినట్లే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు మేనేజరు వచ్చిన వెంటనే సీసీ కెమెరా సర్వర్‌ కనిపించలేదని చెప్పడం గమనార్హం. 
*సాధారణంగా సీసీ కెమెరా కేబుల్, సర్వర్‌ను దెబ్బతీయాలని చూస్తే సంబంధిత పోలీసు స్టేషన్, బ్రాంచి మేనేజర్‌కు అప్రమత్తత సందేశం వస్తుంది. బ్యాంకులో ఏర్పాటు చేసిన అలారమ్‌ మోగుతుంది. కానీ సర్వర్‌ను ఎత్తుకెళ్లినా ఎలాంటి సందేశాలు రాకపోవడం, అలారమ్‌ మోగకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. 
*అలరాన్నిపగటి సమయం (బ్యాంకు పనివేళల్లో మాత్రం) సైలంట్‌ మోడ్‌లో పెడతారు. అంటే నగల చోరీ సమయంలో అలారాన్ని సైలెంట్‌ మోడ్‌లో పెట్టి సర్వర్‌ను తొలగించారన్నది పోలీసుల అనుమానంగా ఉంది.
*రెండో శనివారం సెలవైనప్పటికీ.. మేనేజర్‌ పురుషోత్తం బ్యాంకుకు వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం శనివారమే జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. జోనల్‌ మేనేజర్‌ మురళీకృష్ణరావు, చీఫ్‌ మేనేజర్లు పంతులు, వర్మలు మొత్తం వ్యవహారంపై ఉద్యోగులను, సిబ్బందిపై అంతర్గత విచారణ ప్రారంభించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
 బ్యాంకులో నగదు, బంగారు ఆభరణాల చోరీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారన్నారు. తాళాలు సక్రమంగా ఉండడం, రక్షణ వ్యవస్థ పనిచేయకపోవడం, సీసీ కెమెరాల సర్వర్‌ మాయం కావడం, ఉద్యోగుల వివరణలు అనుమానాస్పదంగా ఉండటంపై విచారణ చేస్తున్నామన్నారు. కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఎంత నగదు, బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నాయనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.