close

తాజా వార్తలు

విధి ఆటలో ఓటమి

 బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన జాతీయ క్రీడాకారుడు నాగశివలక్ష్మీనారాయణ మృతి

 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రికి తెలియకుండా అంత్యక్రియలు

 
రోదిస్తున్న తల్లి అనంతలక్ష్మి

కాకినాడ(మసీదు సెంటర్‌), తాళ్లరేవు: అడ్డంకులను అధిగమించి క్రీడలు, చదువులో రాణిస్తున్న యువ తార రాలిపోయింది. చిరునవ్వుతో అపాయ్యతగా పలకరించే స్నేహితుడు దూరమయ్యాడు. అయ్యా ఆటకు వెళ్లి వచ్చావు.. కాసేపు నిద్రపోమ్మని చెబితే నలుగురు ఉన్నారని అక్కడ వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నావా అంటూ.. ఆ తల్లి రోదన పలువురిని కంటి తడి పెట్టించింది. బాణసంచా పేలుడులో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న కొడుకుకు అలుపెరగకుండా సేవలందించింది. అయినా బతికించుకోలేకపోయానని తెలిసి ఆమె అల్లాడి పోయింది. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని బాణసంచా తయారీ కేంద్రం వద్ద ఈ నెల 18న జరిగిన ప్రమాదంలో అదే గ్రామంలోని రామాలయంపేటకు చెందిన యర్రంనీడి నాగశివలక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందాడు. మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతుడి తల్లి అనంతలక్ష్మి, తమ్ముడు పవన్‌ కృష్ణమూర్తి గుండెలు పగిలేలా రోదించడంతో ఆ ప్రాంతమంతా దుఃఖ సంద్రమైంది. మృతుడు తండ్రి సత్యనారాయణ కూడా ఆ ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడి మృతి చెందిన విషయం ఆయనకు తెలియకుండా స్థానికులు జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద నాన్న యర్రంనీడి వెంకన్న ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

రూ.10 లక్షల పరిహారం

శివలక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ప్రకటించిందని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు.

ఉద్యోగ బాటలో..

నాగ శివ లక్ష్మీనారాయణ. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు నాగ అని పిలుస్తుంటారు. ఇంటర్‌ చదువుతున్న నాగ క్రీడలతోపాటు విద్యనూ రాణించేవాడు. నిరుపేద కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో జాతీయస్థాయి క్రీడల్లో రాణించాడు. 6.2 అడుగుల ఎత్తున్న ఆయన వాలీబాల్‌ కోర్టులో అడుగుపెడితే ప్రత్యర్థులు పరుగులు తీయాల్సిందే. పాఠశాల స్థాయి నుంచి వాలీబాల్‌, త్రోబాల్‌, సాప్ట్‌ బాల్‌, అథ్ల్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పతకాలు సాధించాడు. డిగ్రీ పూర్తి చేసి పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందు సాగుతున్న తరుణంలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ప్రమాద రూపంలో మృత్యువు బలిగొంది. జి.వేమవరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు నాగశివ లక్ష్మీనారాయణ చిత్ర పటానికి నివాళి అర్పించారు.

రాణించే సమయంలో దూరమయ్యాడు

ఏ ఆటైనా ఎంతో చాకచాక్యంతో ఆడతాడు. మూడేళ్లుగా వాలీబాల్‌, త్రోబాల్‌, సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ సాధిస్తున్నాడు. తన భవిష్యత్తుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆశించాను. క్రమశిక్షణతో మెలిగే క్రీడాకారుడికి ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. పాఠశాల, కళాశాలకు ఎన్నో పతకాలు తెచ్చి పెట్టాడు. అతని మరణం తీరని లోటు. - ఎస్‌.ఆర్‌.కె.వి. స్వామి, వాలీబాల్‌ కోచ్‌


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.