close

తాజా వార్తలు

హుజూర్‌నగర్‌లో కేసీఆర్‌ వరాల వర్షం

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని ప్రకటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ రాష్ట్రసమితి శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ...‘‘ఎన్నో నీలాపనిందలన్నీ విశ్లేషించి హుజూర్‌నగర్‌లో తీర్పు ఇచ్చారు. మీరందించిన విజయం మరింత అంకితభావంతో పనిచేసేందుకు ఉత్సాహాన్నిచ్చింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని 134 గ్రామ పంచాయతీలకు రూ.20లక్షలు చొప్పున, ఏడు మండల కేంద్రాలకు రూ.30లక్షలు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నా. రేపో ఎల్లుండో జీవో విడుదల చేస్తాం. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటికీ రూ.15కోట్లు మంజూరు చేస్తున్నా. ఎమ్మెల్యే సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్‌నగర్‌ మంచి పట్టణంగా అభివృద్ధి చెందాలి. ప్రజల కోరిక మేరకు.. హుజూర్‌నగర్‌లో గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాల, బంజారా భవన్‌, రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తాం. కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ ఆసుపత్రి కూడా మంజూరు చేయిస్తాం. పాలిటెక్నిక్‌ కళాశాల, కోర్టు కావాలని అడుగుతున్నారు అవి  కూడా మంజూరు చేస్తాం. హుజూర్‌నగర్‌కు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎక్కువ మంజూరు చేయిస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

సాగర్‌ ఆయకట్టును కాపాడుకోవాలి
‘‘నాగార్జున సాగర్‌ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. రైతులతో కలిసి ఈప్రాంతంలో పర్యటించి అన్ని ఇబ్బందులు తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న  దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ ఖర్చులను ఇకపై ప్రభుత్వమే భరిస్తుంది. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించాం.  అనేక లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నాం. అందులో భాగంగానే కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. తెలంగాణలోని కోటి 20లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. గోదావరి నీళ్లతో  నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ పునీతం కావాలి. ఖమ్మంలో సీతారాం ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలి. దీంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’’ అని కేసీఆర్‌  తెలిపారు. 
సభలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, తెరాస నేతలు పాల్గొన్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.