close

తాజా వార్తలు

అరుదైన ఘనతల వేదిక ఈడెన్‌ గార్డెన్స్‌

త్వరలో చారిత్రక ‘గులాబి’ టెస్టుకు ఆతిథ్యం

 ఈడెన్‌ గార్డెన్స్‌.. ఈ పేరు వింటే కొందరు క్రికెటర్లు పులకించిపోతారు. ఉత్సాహంతో పోటెత్తే అభిమానుల అరుపులు, కేరింతలను స్మరించుకుంటారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకైతే భారత క్రికెట్‌ గతిని మార్చిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ అసాధారణ ‘281 ఇన్నింగ్స్‌’ సాక్షాత్కరిస్తుంది. ఉపఖండంలో ‘క్రికెట్‌ మక్కా’ అని కొందరంటే బైబిల్‌లోని ‘గార్డెన్‌ ఆఫ్ ఈడెన్‌’ (స్వర్గం)గా మరికొందరు భావిస్తారు. ఎన్నో అరుదైన ఘనతలు, అద్వితీయ సమరాలకు వేదికైన ఈడెన్‌ మరికొన్ని రోజుల్లోనే చారిత్రక ‘డే/నైట్‌ టెస్టు’కు ఆతిథ్యమిస్తున్న సందర్భంగా దాని విశేషాలు మీ కోసం..


ఈడెన్‌ గార్డెన్‌ దేశంలోనే అతిపెద్ద స్టేడియం. 80వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించొచ్చు. 2011లో నవీకరించక ముందు సీటింగ్‌ సామర్థ్యం లక్ష. మెల్‌బోర్న్‌ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమిది. ఈడెనే మనదేశంలో పురాతన క్రికెట్‌ స్టేడియం. 1841లో డిజైన్‌ చేసి 1864కు నిర్మాణం పూర్తిచేశారు. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ అక్లాండ్‌ ఈడెన్‌.. అతడి సోదరి ఇమిలీ ఈడెన్‌ గుర్తుగా ‘ఈడెన్ గార్డెన్స్‌’ అని నామకరణం చేశారు.


కలకత్తా జమీందార్‌ రాజచంద్ర దాస్‌ మూడో కుమార్తెను ఓ భయంకరమైన వ్యాధి నుంచి రక్షించినందుకు ఆక్లాండ్‌కు హుగ్లీ నది తీరంలోని అతిపెద్ద ఉద్యానవనాన్ని ఆయన బహూకరించారు. మార్‌ బగాన్‌గా ఉన్న పేరును ఈడెన్‌ గార్డెన్‌గా మార్చారు. ఆ ఉద్యానవనంలో బాబూఘాట్‌, ఫోర్ట్‌ విలియమ్‌ మధ్యలో క్రికెట్‌ మైదానాన్ని నిర్మించారు.  


1934లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఇక్కడ తొలి టెస్టు జరిగింది. 1987లో దాయాదులు భారత్‌, పాక్‌ తొలి వన్డేలో తలపడ్డాయి. 2011లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టీ20 నిర్వహించారు. హీరోకప్‌ సెమీస్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా తొలి డే/నైట్‌ మ్యాచ్‌ ఆడాయి. అంతర్జాతీయ నిషేధం నుంచి బయటపడ్డాక సఫారీలు తొలి టెస్టు ఆడింది ఇక్కడే కావడం గమనార్హం. 2016లో ఒకే రోజు రెండు ప్రపంచకప్‌ ఫైనళ్లకు ఆతిథ్యమిచ్చి ఈడెన్‌ అరుదైన రికార్డు సాధించింది.


1987 ప్రపంచకప్‌ ముందు ఈ మైదానం సీటింగ్‌ సామర్థ్యం 40వేలు మాత్రమే. ఆ తర్వాత 94వేలకు పెంచారు. అయితే 6 సార్లు లక్ష మందికి పైగా వీక్షకులు హాజరైనట్టు రికార్డులు నమోదయ్యాయి. సరికొత్త ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియానికి మెరుగులు దిద్దాలని ఐసీసీ సూచించడంతో 2011 ప్రపంచకప్‌ ముందు నవీకరించారు. అప్పట్నుంచి సీటింగ్‌ సామర్థ్యం 68 వేలుగా ఉంది.


భారత క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, పంకజ్‌ రాయ్‌, క్రికెట్‌ పాలకులు బీఎన్‌ దత్‌ (బీసీసీఐ అధ్యక్షుడు 1988-90), జగ్‌మోహన్‌ దాల్మియా (బీసీసీఐ అధ్యక్షుడు 2001-04, 2013, 2015, ఐసీసీ అధ్యక్షుడు 1997-2000) పేర్లతో ఇక్కడ స్టాండ్లు ఉన్నాయి. నాలుగు స్టాండ్లకు సైనికుల పేర్లు పెట్టి గౌరవించారు. కల్నల్‌ నీలకంఠన్‌ జయచంద్రన్‌ నాయర్‌ (అశోక చక్ర), హవిల్దార్‌ హంగ్‌పన్‌ దాదా (అశోక చక్ర), లెప్టినెంట్‌ కల్నల్‌ ధన్‌సింగ్‌ థాప (పరమ్‌వీర్‌ చక్ర), సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌ సహ్నన్‌ (పరమ్‌వీర్‌ చక్ర) స్టాండ్లు ఇక్కడ కొలువుదీరాయి.


నవీకరణ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో 2011, ఫిబ్రవరి 27న నిర్వహించాల్సిన భారత్‌, ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ను చిన్నస్వామికి తరలించారు. ఆ తర్వాత మార్చ్‌ 15, 18, 20న మూడు మ్యాచ్‌లు జరిగాయి. అందులో కెన్యా×జింబాబ్వే మ్యాచ్‌కు అతితక్కువగా 15 టికెట్లు మాత్రమే అమ్ముడైపోయాయి.


ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ వా ఈడెన్‌ను ఉపఖండంలోని మక్కాగా అభివర్ణించాడు. లార్డ్స్‌ తర్వాత అత్యుత్తమైందని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నాడు. 2000-01 బోర్డర్‌-గావస్కర్‌ టోర్నీలో ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు ఈడెన్‌లో అభిమానులు బిగ్గరగా అరిచిన అరుపులు, కేరింతలను తాను మరెక్కడా వినలేదని గంగూలీ పేర్కొన్నాడు.


ఈడెన్‌ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో 15 క్రికెట్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వేదికైంది. పురుషుల వన్డే 6, టీ20 5, మహిళల వన్డే ప్రపంచకప్‌ 2, టీ20 1 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ 4 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ నిర్వహించడం అరుదైన ఘనత. 1987 వన్డే, 2016 టీ20, 1997 మహిళల వన్డే, 2016 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనళ్లకు ఈడెన్‌ ఆతిథ్యమిచ్చింది.


దాదా బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడైన తర్వాత 2016లో ఈడెన్‌లో గంట ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి గంట మోగించిన తర్వాతే ఆట మొదలు పెడుతున్నారు. తొలిసారి ఆ గంటను మోగించిన వ్యక్తిగా కపిల్‌దేవ్‌ రికార్డులకెక్కాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య 2016లో ఈ టెస్టు జరిగింది.


1996లో పురుషుల వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌కు ఈడెన్‌ వేదికైంది. శ్రీలంకతో పోరులో భారత్‌ పేలవ ప్రదర్శన చేయడంతో అభిమానులు నీళ్ల సీసాలు విసిరి గోల చేయడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేసి శ్రీలంకను విజేతగా ప్రకటించారు.


సచిన్‌ తెందూల్కర్‌ 199వ టెస్టుకు ఈడెన్‌ వేదిక. ఈ మైదానం 150వ వార్షికోత్సవం రోజున శ్రీలంకపై రోహిత్‌ శర్మ (264; 173 బంతుల్లో) వన్డే క్రికెట్లోనే అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేశాడు. 2016 ఏప్రిల్‌ 3న ఇదే వేదికలో జరిగిన పురుషుల, మహిళల టీ20 ఫైనళ్లలో వెస్టిండీస్‌ జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించింది.


ఈడెన్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు కూడా జరిగాయి. 1980 ఆగస్టు 16న డెర్బీ లీగ్‌లో ఈస్ట్‌ బంగాల్‌, మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌లో తొక్కిసలాట జరిగి 16 మంది అభిమానులు మృతిచెందారు. 1984లో నెహ్రూకప్‌ జరిగింది. అర్జెంటీనా, పొలాండ్‌, చైనా, రొమేనియా అండర్‌-21, వాసాస్‌ బుడాపెస్ట్‌తో భారత ఫుట్‌బాల్‌ జట్టు తలపడింది. 1977లో న్యూయార్క్‌ కాస్మోస్‌తో మోహన్‌ బగాన్‌ తలపడ్డ మ్యాచ్‌లో ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు పీలే కాస్మోస్‌ తరఫున ఆడాడు. ఆ మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది.


ఈ మైదానంలో చేతన్‌ చౌహాన్‌, కపిల్‌దేవ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీశారు. 1991లో శ్రీలంకతో వన్డేలో కపిల్‌, 2017లో ఆసీస్‌తో వన్డేలో కుల్‌దీప్‌ వరుసగా మూడు వికెట్ల ఘనత అందుకున్నారు. 2000/01లో ఆస్ట్రేలియాతో టెస్టులో భజ్జీ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో తొలి హ్యాట్రిక్‌ తీసిన భారత బౌలర్‌ అతడే.


1946లో ఫామ్‌లో ఉన్న ముస్తాక్‌ అలీని ఆస్ట్రేలియా సర్వీసెస్‌ XIతో అనధికార మ్యాచ్‌ నుంచి తప్పిస్తే అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ‘నో ముస్తాక్‌, నో టెస్టు’ అని నినాదాలు చేయడంతో సెలక్టర్లు ముస్తాక్‌ను తిరిగి తీసుకొచ్చారు. మళ్లీ 2005లో దక్షిణాఫ్రికాపై వన్డేలో గంగూలీని గ్రెగ్‌ ఛాపెల్‌ తప్పించడంతో అభిమానులు భారీఎత్తున జట్టును ఎగతాళి చేశారు. గంగూలీ నినాదాలతో హోరెత్తించారు. ఛాపెల్‌ వారికి మధ్యవేలు చూపించాడు!


బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో ఫాలోఆన్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ 281 పరుగులు సాధించాడు. ద్రవిడ్‌ 180 చేశాడు. వీరిద్దరూ 376 పరుగుల భాగస్వామ్యం అందించి అరుదైన రికార్డు నెలకొల్పారు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆసీస్‌ ఫాలోఆన్‌లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ను టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అతిగొప్ప మ్యాచ్‌గా వర్ణిస్తారు. భారత జట్టులో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని అందించిన విజయమిది.


ఈడెన్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది వీవీఎస్‌ లక్ష్మణ్‌ (1,217), రాహుల్‌ ద్రవిడ్‌ (9,62), సచిన్‌ (8,72). సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు తీసింది హర్భజన్‌ సింగ్‌ (46), అనిల్‌ కుంబ్లే (40), బిషన్‌ సింగ్‌ బేడీ (29). వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఇక్కడ ఐదుసార్లు శతకాలు బాదారు. 2019 ఏప్రిల్‌ 28న ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అత్యధిక స్కోరు (232/2) నమోదు చేసింది. హార్దిక్‌ పాండ్య (91; 34 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబయి 198/7తో నిలిచింది.


ఇలాంటి ఎన్నో ఘనతలకు వేదికైన ఈడెన్‌ తొలిసారి డే/నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తోంది. నవంబర్‌ 22న భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు తొలిసారి గులాబి బంతితో ఇక్కడ చారిత్రక టెస్టులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా హాజరవుతున్నారు. కోల్‌కతాకే చెందిన సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన అతికొద్ది సమయంలోనే గులాబి టెస్టుకు మార్గం సుగమం చేయడం గమనార్హం.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.