close

తాజా వార్తలు

వెయిటేజి మరవొద్ధు..ఏ ప్రశ్నా వదలొద్దు!

ఇంటర్‌ ప్రిపరేషన్‌ వ్యూహం

మంచిస్కోరుకు నిపుణుల సూచనలు

విద్యార్థి భావి జీవితంలో ఇంటర్మీడియట్‌ విద్య కీలకపాత్రను పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ అంశాలపై ఎలా దృష్టి పెట్టాలి? ఏ మెలకువలు పాటించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటర్‌ బోధనలో దశాబ్దాల అనుభవమున్న నిపుణులు ఆ మెలకువలను అందిస్తున్నారు. వీటిని శ్రద్ధగా పాటిస్తూ సన్నద్ధమైతే .. అత్యధిక స్కోరు మీ సొంతమవుతుంది!

ఇంటర్‌ పరీక్షల్లో గరిష్ఠ మార్కులు తెచ్చుకోవటానికి ప్రణాళికాబద్ధమైన కృషి అవసరం. పాఠ్యపుస్తకాల్లోని అంశాల అవగాహన, గత ప్రశ్నపత్రాల పరిశీలన వల్ల ప్రశ్నలు అడిగే విధానంపై, మెరుగ్గా రాయాల్సిన తీరుపై స్పష్టత వస్తుంది. చదివిన అంశాల పునశ్చరణ చాలా ప్రధానం. కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి పెట్టి మిగతావి నిర్లక్ష్యం చేయటం ఏ మాత్రం సరికాదు. అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కని దస్తూరి అవసరం. కొట్టివేతలు లేకుండా అర్థమయ్యేలా రాయటం ముఖ్యం. ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చేందుకు ప్రయత్నించాలి.

భౌతిక శాస్త్రం

ఇంటర్‌ విద్యార్థులు జనవరి చివరికి భౌతికశాస్త్ర సన్నద్ధత పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో పునశ్చరణ సాగించేలా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. గడిచిన నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను అవగతం చేసుకుని జాగ్రత్తగా చదివితే మంచి మార్కులు సాధించవచ్ఛు దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేసేటప్పుడు వాటికి అనుగుణంగా ఉండే లెక్కలు, సూత్రాలను చూసుకోవాలి. లెక్కలను సాధించే ప్రక్రియలో ఫార్ములా, ప్రమాణాలను ఉపయోగించడంలో జాగ్రత్తవహించాలి.

మొదటి సంవత్సరం: దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం పని, శక్తి, సామర్థ్యం, డోలనాలు, ఉష్ణగతిక శాస్త్రాలను బాగా చదవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమతలంలో చలనం, గమన నియమాలు, భ్రమణ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్థ ఉష్ణ ధర్మాలను చదవాలి. పాఠ్యాంశం వెనక ఉన్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలనూ చదువుకోవాలి.

రెండో సంవత్సరం: దీర్ఘ సమాధాన ప్రశ్నలకు తరంగాలు, ప్రవాహ విద్యుత్‌, కేంద్రకాలను బాగా చదవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కిరణ దృశా శాస్త్రం, తరంగ దృశా శాస్త్రం, విద్యుత్‌ ఆవేశాలు, క్షేత్రాలు, కెపాసిటర్స్‌, చలించే ఆవేశాలు- అయస్కాంతత్వం, పరమాణువులు, అర్ధవాహక ఎలక్ట్రానిక్స్‌ను చదవాలి. ఈ పాఠ్యాంశాలు పోటీపరీక్షలకూ ఉపయోగపడతాయి. పాఠ్యాంశం వెనకున్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలూ చదవాలి.

- ఎస్‌. ఇర్షాద్‌ హుశేన్‌

గణితం

ణితశాస్త్ర గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కాన్సెప్చువల్‌ ప్రశ్నలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీటిని అభ్యాసం చేయడం మర్చిపోవద్ధు ఏదైనా ఒక అధ్యాయాన్ని సాధన చేసేముందు దాని బేసిక్స్‌, కాన్సెప్టులు, ఫార్ములాలను చదివి, ఆపై తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలన్నింటినీ సాధించాలి.. ఉదాహరణ లెక్కలు, సాధన లెక్కలు అన్నింటినీ చేయాలి.

పేపర్‌-1ఎ: దీనిలో మాత్రికలు (మాట్రిక్స్‌), సదిశలు (వెక్టార్స్‌) నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశముంది. ఈ అధ్యాయాల్లోని అన్ని రకాల ప్రశ్నలు- దీర్ఘ, స్వల్ప, అతి స్వల్ప సమాధాన లెక్కలపై పట్టు వచ్చేవరకూ సాధన చేయాలి. వీటితోపాటు త్రికోణమితి (ట్రిగనామెట్రి)లోని పరివర్తనాలు, త్రిభుజ ధర్మాలు, బీజగణితంలోని ప్రమేయాలు, గణితానుగమన సిద్ధాంతం నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిపై దృష్టి పెట్టాలి.

పేపర్‌-1బి: ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలుంటాయి. మొదటిది నిరూపక జ్యామితి (2డి, 3డి) రెండోది అవకలన గణితం. దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన ప్రశ్నలను అడిగే అవకాశమున్న ప్రతి అధ్యాయాన్నీ క్షుణ్ణంగా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకు నిరూపక జ్యామితిలోని సరళరేఖలు, సరళరేఖా యుగ్మాలు, దిక్‌ కొసైన్లు, దిక్‌ సంఖ్యలు, అవకలన గణితంలోని అవకలజాలు, అవకలన అనువర్తనాలపై ముందుగా పట్టు సాధించాలి.

పేపర్‌-2ఎ: పోటీపరీక్షల్లో 2ఎలోని పాఠ్యాంశాలకు ప్రాముఖ్యం ఎక్కువ. సంకీర్ణ సంఖ్యలు, డీమావియర్‌ సిద్ధాంతం, వర్గ సమాసాలు, సమీకరణ వాదన, ద్విపద సిద్ధాంతం, ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యతలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలి. వీటి అనువర్తనాలు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి సాయపడతాయి.

పేపర్‌-2బి: ప్రధానంగా రెండు అంశాలుంటాయి. 1. నిరూపక జ్యామితి 2. కలన గణితం. నిరూపక జ్యామితిలోని వృత్తాలు, వృత్తసరణి పూర్తిగా సిద్ధాంతపరమైనవి. వీటిని పూర్తిగా అధ్యయనం చేస్తే తర్వాత వచ్చే శాంకవాలు (కానిక్స్‌) అధ్యాయాల్లో ఎక్కువ శ్రమ ఉండదు. పరావలయం, దీర్ఘవృత్తం, అతి పరావలయం అనే 3 అధ్యాయాలున్నాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరావలయం నుంచి ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న తప్పకుండా వస్తోంది. దీర్ఘవృత్తం నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా చూసుకోవాలి.

నోట్‌: ప్రతి సమాధానానికి సంబంధించిన రఫ్‌ వర్క్‌, బొమ్మలను తప్పకుండా సమాధానానికి పక్కనే సూచించాలి.

- ఎం. మహేందర్‌రెడ్డి, గోగుల ముక్కంటిరెడ్డి

రసాయన శాస్త్రం

ఒక పాఠం చదివేటప్పుడే అందులోని పటాలు, సూత్రాలు, రసాయన సమీకరణాలను కాగితంపై రాసుకోవాలి. నాలుగు మార్కుల ప్రశ్నల్లో కొన్నిసార్లు రెండు మార్కుల ప్రశ్నలు జత చేసి అడుగుతారు. వాటికి సంబంధించిన పటాలు, సూత్రాలు, సమీకరణాలు, ఉదాహరణలు రాయాలి.

మొదటి సంవత్సరం: సంకరీకరణం వివరించే సమయంలో ఎలక్ట్రాన్‌ విన్యాసం, అణువుల నిర్మాణాలను వివరించేటప్పుడు పటాలు, అణువుల పటాల్లో బంధకోణం, బంధ పొడవు, అణువు ఆకృతి లాంటివి పేర్కొనడం మంచిది. 8 మార్కుల ప్రశ్నలకు పరమాణు నిర్మాణం (అటామిక్‌ స్ట్రక్చర్‌), మూలకాల వర్గీకరణ- ఆవర్తన ధర్మాలు (క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ పీిరియాడిసిటీ ఇన్‌ ప్రాపర్టీస్‌)పై ఎక్కువ దృష్టిపెట్టాలి. 4 మార్కుల ప్రశ్నలకు పదార్థ స్థితులు (స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌), స్టాయికియోమెట్రీ, ఉష్ణగతిక శాస్త్రం, రసాయన సమతాస్థితి (కెమికల్‌ అండ్‌ అయానిక్‌ ఈక్విలిబ్రియమ్‌), పి-బ్లాక్‌ మూలకాలపై దృష్టిపెట్టాలి. రసాయన బంధం (కెమికల్‌ బాండింగ్‌) ఎంతో ముఖ్యం. 8, 4 మార్కుల ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఎక్కువ.

రెండో సంవత్సరం: 8 మార్కుల ప్రశ్నలు- కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి ఒక్కొక్కటి చొప్పున అడుగుతున్నారు. అందులోని కర్బన రసాయన శాస్త్రం (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) లో 8 మార్కుల ప్రశ్నలను (2+2+2+2), (4+2+2), (4+4గా) రెండు లేదా ఎక్కువ ప్రశ్నలను కలిపి అడుగుతున్నారు. వాటిలో నేమ్డ్‌ రియాక్షన్స్‌, యాసిడ్‌ అండ్‌ బేసిక్‌ నేచర్‌పై దృష్టిపెట్టాలి. అకర్బన రసాయన శాస్త్రం (ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ)లో ఎక్కువగా తయారీ విధానాలు, రసాయన ధర్మాలు లేదా పేరుతో కూడిన చర్యలు (నేమ్డ్‌ ప్రాసెస్‌)పై దృష్టిపెట్టాలి. పైవన్నీ పటాలతో కూడిన సమాధానాలు కాబట్టి, వాటికి కూడా మార్కులు కేటాయిస్తారు.

భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్‌ కెమిస్ట్రీ)లో విద్యుత్‌ రసాయన శాస్త్రం, రసాయన గతిశాస్త్రాలపై దృష్టిపెట్టాలి. ఇందులో (4+4 విధానంలో) రెండు నాలుగు మార్కుల ప్రశ్నలను జోడించి 8 మార్కుల ప్రశ్నగా అడుగుతున్నారు. 4 మార్కుల ప్రశ్నలకు జీవాణువులు, పాలిమర్లు, ఘనస్థితి, ద్రావణాలు, ఉపరితల రసాయన శాస్త్రం, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలపై దృష్టిపెట్టాలి.

- ఆనంద్‌ కుమార్‌ .పి

బోటనీ

వెయిటేజి అనుసరిస్తూ బోటనీలో సంబంధిత చాప్టర్లు పూర్తి చేసుకోవాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే ముఖ్యమైన యూనిట్లను డయాగ్రమ్స్‌ వేస్తూ చదివితే జవాబులు మర్చిపోయే ప్రమాదం ఉండదు. బయాలజీలో ఈ డయాగ్రమ్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వచ్చాయంటే జవాబులు దాదాపుగా వచ్చినట్టే. డయాగ్రమ్స్‌ వేసేటప్పుడు భాగాలు గుర్తించటం చాలా ముఖ్యం. అందుకే కలర్‌ పెన్సిల్స్‌ ఉపయోగిస్తూ డయాగ్రమ్స్‌ వేసి, లేబులింగ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేయాలి.

మొదటి సంవత్సరం: మార్ఫాలజీ, అనాటమీ, రిప్రొడక్షన్‌లలో ఒక్కో దీర్ఘ సమాధాన ప్రశ్న చొప్పున వచ్చే అవకాశముంది. ఏ ప్రశ్ననూ వదలకూడదు. ఈ చాప్టర్లలో అన్ని ప్రశ్నలకూ తయారవ్వాలి. చాలా చిన్న చాప్టరైన ఎకాలజీలో ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. దీనిలో 6 మార్కులు, సెల్‌ బయాలజీ బయో మాలిక్యూల్స్‌లో 12 మార్కులు సులువుగా తెచ్చుకోవచ్ఛు

రెండో సంవత్సరం: ఫిజియాలజీలో ఫొటోసింథసిస్‌/రెస్పిరేషన్‌, బయాటెక్నాలజీ, హ్యూమన్‌ వెల్ఫేర్‌ చాప్టర్లు బాగా సిద్ధం కావాలి. వీటిలో ఒక్కోటి చొప్పున దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. జవాబులు రాసేటప్పుడు సంబంధిత ఫ్లో చార్టులు వేయాలి. స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు జాగ్రత్తగా సిద్ధం కావాలి.

- మయూరి

జువాలజీ

మొదటి సంవత్సరమైనా, రెండో సంవత్సరమైనా ఒక్కో చాప్టర్‌కు ఎంత వెయిటేజి ఉందో చూసుకోవాలి. ఆ ప్రకారం పఠన ప్రణాళిక వేసుకోవాలి. మొదట దీర్ఘ సమాధాన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీటిని బాగా చదివితే వాటిలోనే చాలావరకూ స్వల్ప సమాధాన; అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు మిళితమై ఉండటమే కాకుండా, చదివేటప్పుడు అవి తేలిగ్గా ఉంటాయి.

మొదటి సంవత్సరం- ప్రశ్నల్లో ముఖ్యమైనవి...

● స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్‌ నుంచి సిమెట్రీ, సీలోమ్‌, ఎపిథీలియం, కనెక్టివ్‌ టిష్యూ, బ్లడ్‌. ● పెరిప్లానెటా అమెరికానా (కాక్రోచ్‌) చాప్టర్‌ నుంచి డైజిస్టివ్‌ సిస్టమ్‌, రెస్పిరేటరీ సిస్టమ్‌, సర్క్యులేటరీ సిస్టమ్‌, మేల్‌-ఫిమేల్‌ రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌ ● హ్యూమన్‌ హెల్త్‌ అండ్‌ డిసీజెస్‌ చాప్టర్‌ నుంచి ప్లాస్మోడియం (ఇన్‌ మ్యాన్‌ అండ్‌ మస్కిటో), ఎంటమీబా, ఆస్కారిస్‌, ఉకరేరియా లైఫ్‌ సైకిల్స్‌. ● ఇకాలజీ చాప్టర్‌ నుంచి ఫ్లో ఆఫ్‌ ఎనర్జీ, టెంపరేచర్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, లైట్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, టైప్స్‌ ఆఫ్‌ ఎకోసిస్టమ్‌

రెండో సంవత్సరం- ప్రశ్నల్లో ముఖ్యమైనవి...

బాడీ ఫ్లూయిడ్స్‌ అండ్‌ సర్క్యులేషన్‌ నుంచి స్ట్రక్చర్‌ ఆఫ్‌ హార్ట్‌, ఫంక్షన్స్‌ ఆఫ్‌ హార్ట్‌ ● ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్‌ అండ్‌ దెయిర్‌ ఎలిమినేషన్‌ నుంచి స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఎక్స్‌క్రిటరీ సిస్టమ్‌, యూరిన్‌ ఫార్మేషన్‌ మెకానిజం ● రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌ నుంచి మేల్‌-ఫిమేల్‌ రిప్రొడక్టివ్‌ సిస్టమ్స్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ● జెనెటిక్స్‌ నుంచి మల్టిపుల్‌ ఎలీల్స్‌, క్రిస్‌క్రాస్‌ ఇన్‌హెరిటెన్స్‌, జెనెటిక్‌ డిజార్డర్స్‌, సెక్స్‌ డిటర్మినేషన్‌.

- సవిత

(పదోతరగతి, ఇంటర్మీడియట్‌లకు సంబంధించి మరిన్ని సబ్జెక్టుల ప్రిపరేషన్‌ విధానాలు, పూర్తి వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.