close

తాజా వార్తలు

10కి పదిప్లాను ఇదీ!

టెన్త్‌100 రోజుల ప్రణాళిక

ఏ చిన్న కొలువు కావాలన్నా కనీస అర్హత పదో తరగతి. అందుకే తొమ్మిదో తరగతి వరకు ఎన్ని మార్కులు వచ్చాయని అంతగా పట్టించుకోని తల్లిదండ్రులు టెన్త్‌కి వచ్చేసరికి మార్కులు, గ్రేడ్ల గురించి శ్రద్ధ తీసుకుంటారు. పాఠశాల విద్యలో అత్యంత కీలకంగా భావించే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇక మిగిలింది గరిష్ఠంగా నాలుగు నెలలే. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈనెలాఖరుకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు డిసెంబరు నెలాఖరుతో పాఠ్య ప్రణాళికను పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకున్నాయి.

దో తరగతిలో 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటే...సీసీఈ విధానంలో ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులకు అంతర్గత పరీక్షలు, 80 మార్కులకు చివరి పరీక్ష నిర్వహిస్తారు. హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 40 మార్కులకు ఉంటుంది. కొత్త విధానంలో పాఠం వెనక ఉండే ప్రశ్నలు, ఉదాహరణలు, మాదిరి ప్రశ్నలు అడిగే అవకాశాలు చాలా తక్కువ. ఫలానా ప్రశ్న వస్తుందని నిర్దిష్టంగా చెప్పలేరు. ప్రశ్న అడిగే విధానంలోనే మార్పు, చేర్పులుంటాయి. అందుకే ప్రశ్నలను అర్థ.ం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్నలను విశ్లేషిస్తూ జవాబులను రాయాలి.

గణితమంటే బెంబేలు వద్దు

సాధారణంగా గణితంపై పట్టు సాధించినవారు మిగిలిన సబ్జెక్టుల్లోనూ ముందుంటారు. ఆలోచనాశైలి, విశ్లేషణ, పరిశీలన, ఏకాగ్రత దృక్పథాలే అందుకు కారణం. ప్రాథమిక అంశాలు, మూలాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి.

పాఠ్య ప్రణాళిక (పేపర్‌-1, 2), ప్రశ్నపత్రశైలి, మార్కుల కేటాయింపు, సెక్షన్లు, చాయిస్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి.

ప్రతి అధ్యాయంలో ఉండే బేసిక్‌ నమూనా సమస్యలను సాధించాలి. వాటి స్థానాల్లో వేరే సంఖ్యలను ప్రతిక్షేపిస్తూ స్వయంగా సాధించే ప్రయత్నం చేయాలి.

vఅన్ని గణిత ఫార్ములా (సూత్రాలు)లను ప్రత్యేకంగా గుర్తిస్తూ వాటిపై పట్టు సాధించాలి.

గ్రాఫ్‌లను కచ్చితంగా స్కేలు ప్రకారం గీసే సామర్థ్యాలను కలిగి ఉండాలి. ● నిర్మాణాలపై పూర్తి పట్టు అవసరం.

సమితులు, వాస్తవ సంఖ్యలు, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రం మొదలైనవి చాలా సులువైన అధ్యాయాలు. అన్ని అధ్యాయాల్లో ముఖ్యాంశాలను ప్రత్యేకంగా రాసుకొని స్వయంగా సమస్యలను సాధించే తత్వాన్ని కలిగి ఉంటే 100కి 100 మార్కులు తెచ్చుకోవచ్ఛు

- ఎం.ప్రభుదయాల్‌

‘భౌతిక రసాయన’ స్కోరు

భౌతిక, రసాయన శాస్త్రంలో మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ప్రతి పాఠానికి సంబంధించి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని మాదిరి ప్రశ్నలు తయారు చేసుకోవాలి. నూరుశాతం మార్కులు ఆశించేవారు అన్ని పాఠాలూ క్షుణ్నంగా చదవాలి. ప్రతి భావనపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రతి భావనను విశ్లేషణాత్మకంగా చదవాలి. సాధ్యమైనన్ని నమూనా పరీక్షలు రాయాలి.

విద్యా ప్రమాణం-6 (నిజ జీవిత వినియోగం) నుంచి 4 మార్కులకు ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. దీనికి ముఖ్యమైన అధ్యాయాలు ఆమ్లాలు-క్షారాలు-లవణాలు, కాంతికి సంబంధించిన పాఠాలు, కార్బన్‌ దాని సమ్మేళనాలు మొదలైనవి.

విద్యా ప్రమాణం-5 (పటాలు) నుంచి 4 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. దీంట్లో అసంపూర్తి బొమ్మలు పూర్తి చేయడం, పటం ద్వారా విషయాన్ని వివరించడం, తప్పుగా ఇచ్చిన బొమ్మను సరిచేసి గీయటం వంటి ప్రశ్నలుంటాయి.

విద్యా ప్రమాణం-4 (సమాచారం) నుంచి ఆరు మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో కొంత సమాచారాన్ని పటం లేదా పట్టిక రూపంలో ఇచ్చి దానికనుగుణంగా ప్రశ్నలు అడుగుతారు.

విద్యా ప్రమాణం-3 (ప్రయోగాలకు సంబంధించి) నుంచి 6 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో ప్రయోగాల ఉద్దేశాలు, కావాల్సిన పరికరాలు, ఫలితాలు, ప్రయోగ విధానాలు, ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ప్రశ్నలు అడుగుతారు.

విద్యా ప్రమాణం-2 (పరికల్పనలకు సంబంధించి) నుంచి 4 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. దీంట్లో ప్రయోగంలో చరాలు మార్చడం వల్ల ఏమి జరుగుతుంది? కొన్ని దృగ్విషయాలు కనుక్కోకపోతే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి వంటివి అడుగుతారు.

- ఎం.నాగరాజ శేఖర్‌

జీవశాస్త్రం: ప్రశ్నలను అర్థ్ధం చేసుకుంటేనే...

జీవశాస్త్రం పరీక్షలో చాలామంది విద్యార్థులు సరిగా ప్రశ్నను అర్థం చేసుకోకుండా జవాబు రాస్తుంటారు. దాంతో మార్కులు కోల్పోతారు. ఉదాహరణకు వేర్లు నీటిని ఎలా శోషిస్తాయి? అనే నాలుగు మార్కుల ప్రశ్న వస్తే మూలకేశాల ద్వారా, ద్రవాభిసరణ పద్ధతిలో మూలకేశ కణాలు, దారుకణాల సహకారంతో జరుగుతుందని రాస్తూ...వేరు నిలువుకోత పటం వేసి వివరించాలి. అలా కాకుండా కుండీి మొక్క ప్రయోగం రాస్తే మార్కులు కోల్పోతారు.

జీవశాస్త్రంలోని అధిక పాఠ్యాంశాలు మానవ దేహ నిర్మాణం, విధులను తెలియజేసేవిగా ఉంటాయి. వీటిని తులనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చదివి అర్థం చేసుకోకపోతే ఒక ప్రశ్నకు మరో జవాబు రాసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఎడిమా, యురేమియ, బోలస్‌, కైమ, శ్వాసక్రియ, కిరణజన్య సంయోగ క్రియ సమీకరణాలు. ఇలాంటివి అనేకం. వీటి భేదాలు, పోలికలు తెలిసి ఉండాలి. వీటిపై ప్రశ్నలు తప్పక వస్తాయి.

అన్ని పాఠ్యాంశాల్లో విషయ అవగాహన స్పష్టంగా ఉంటే మిగిలిన 6 విద్యా ప్రమాణాలపై వచ్చే ప్రశ్నలను సులువుగా సాధించవచ్ఛు

అడిగిన దగ్గర బొమ్మ వేసి భాగాలు గుర్తించడంతోపాటు అడగకపోయినా కొన్ని ప్రశ్నలకు వేగంగా, అందంగా బొమ్మలు వేసే నైపుణ్యం పెంపొందించుకోవాలి.

న్యూరాన్‌, నెఫ్రాన్‌, హృదయం, మెదడు, వివిధ ప్రయోగాల బొమ్మలు బాగా సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందొచ్ఛు

ఫ్లో చార్టులు, ఏక, ద్వి ప్రసరణ వలయాలు సాధన చేస్తే మంచిది.

విటమిన్లు, ఆల్కలాయిడ్లు, ఏక సంకరణ, ద్వి సంకరణ పట్టీలను అధ్యయనం చేయాలి.

ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల్లోనే సమాధానం రాయాలి. అప్పుడు సమయం మిగులుతుంది. మిగిలిన ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోదు.

ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానంగా ఎ, బి, సి, డిలలో ఏదో ఒకదాన్నే..ఒక్కసారే రాయాలి.

- నర్రా రామారావు

తెలుగు: అక్షర దోషాలు ఉండొద్దు

తెలుగులోని మొదటి పేపర్‌లో స్వీయ రచనకు సంబంధించిన ప్రశ్నల కోసం పాఠంలోని విషయాన్ని మొత్తం చదివి మైండ్‌ మ్యాప్‌ రూపొందించుకోవాలి.

పాఠంలోని ఒక్కో పేరాలో ఒక్కో కీలక భావనను తయారు చేసుకొని జవాబులు పాయింట్ల రూపంలో రాయాలి.

రామాయణంలో కాండాలు, పాత్రల స్వభావాలను బాగా అవగాహన చేసుకోవాలి.

ప్రశ్న స్వభావాన్ని బాగా అర్థం చేసుకొని రాయాలి. ఉదాహరణకు వివరించండి, విశ్లేషించండి, సమర్థించండి, కారణాలు తెలపండి అనే వాటి మధ్య భేదాలు తెలుసుకొని జవాబు రాయాలి.

అక్షర దోషాలు లేకుండా మహా ప్రాణ అక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలను అభ్యాసం చేయాలి.

ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రారంభం, వివరణ, ముగింపు ఉండేలా రాయాలి. వాక్య నిర్మాణం సరిగ్గా ఉండాలి.

పేపర్‌-2లో అవగాహన- ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చాలా సులభంగా రాయవచ్ఛు అపరిచిత గద్యం రామాయణం నుంచి పేరా ఇస్తారు. కాబట్టి ఉపవాచకం మొత్తం ఒకసారి చదవాలి. అదేవిధంగా అపరిచిత గద్యం, అపరిచిత పద్యం కూడా సీ గ్రేడ్‌ పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది.

నినాదాలు, సూక్తుల్లో ప్రాస పదాలు ఉండేలా రాయాలి.సంభాషణలు, ఏకపాత్రాభినయం గురించి ఉత్తమ పురుష కథనంలో రాయాలి.

పేపర్‌- 1, 2లలో మొత్తం 20 మార్కుల బిట్‌ పేపర్‌లో 2 మార్కుల సొంత వాక్యాలు, పదజాలానికి, వ్యాకరణ అంశాలకు సంబంధించిన 18 మార్కుల బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలుంటాయి. కొంచెం ఆలోచిస్తే జవాబు గుర్తించడం సులువే.

- సంధ్యారాణి

సాంఘికశాస్త్రం: అధిక మార్కుల సాధనకు అవకాశం

సాంఘికశాస్త్రం సబ్జెక్టులో మంచి జీపీఏ సాధించడం సులువే. ఇది బాగా మార్కులు వచ్చే సబ్జెక్టు. చరిత్ర, భూగోళశాస్త్రాలను విభజించి చదవడం, పట్టు సాధించడం, శీర్షికలను గుర్తుపెట్టుకోవడం, పాత ప్రశ్నపత్రాల తీరును గమనించడం తప్పనిసరిగా చేయాలి. చరిత్రకు సంబంధించి పునశ్చరణ నోట్సు తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. పేపర్‌-1, 2లలో పటాలకు 8 మార్కులుంటాయి. అన్నింటినీ సాధన చేయాలి. పాఠంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పేరాగ్రాఫ్‌లను అర్ధం చేసుకొని వ్యాఖ్యానించడం నేర్చుకోవాలి. ఒక మార్కు ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి పేపర్‌లో 40 మార్కుల్లో 16 మార్కులకు విషయ అవగాహనపై ప్రశ్నలు ఇస్తున్నారు. ప్రిపరేషన్‌లోనే విశ్లేషించడం, వివరించడం, కారణాలు, సంబంధాలు ఉదాహరించడం వంటి అంశాలను గుర్తించి చదవాలి. తెలంగాణ, భారతదేశం పటాలను గీయడం తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాఠాల్లో వచ్చిన రాజధానులు, రాజ్యాలు, ముఖ్యమైన ప్రాంతాలు మొదలైన వాటిని భారతదేశం, ప్రపంచ పటాల్లో గుర్తించడాన్ని నేర్చుకోవటం చాలా ముఖ్యం. దానివల్ల 12 మార్కులు కచ్చితంగా వస్తాయి.

- ఏనుగు ప్రభాకర్‌రావు

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు-హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.