
తాజా వార్తలు
ఆదిలాబాద్ నేరవిభాగం, న్యూస్‌టుడే: కలహాల కాపురాన్ని చక్కదిద్ది అక్కాబావలిద్దరినీ సంతోషంగా జీవించమని నచ్చచెప్పడమే తప్పయిపోయింది. ఏడాది కిందట జరిగిన గొడవలను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి తన బావమరిదిని అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో కలకలం సృష్టించింది. అక్కతో సహా మేన కోడలు, అల్లుడికి కొత్త దుస్తులు తీసుకొచ్చిన బావమరిదిని తేనీరు తాగుదామని బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసు జీపు చప్పుడు విని బయటకు వచ్చిన ఆ ఇల్లాలికి చనిపోయింది తన తమ్ముడే అన్న పిడుగులాంటి వార్త నిశ్చేష్టురాలిని చేసింది. ‘నేనింక రాఖీ ఎవరికి కట్టాలి..? నా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి?’ అంటూ ఆ మహిళ రోదించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కలిచివేసేలా చేసింది. మృతుడి బంధువులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కాలనీలో ఓసావార్ సంతోష్ - మమత దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ స్థానికంగా ఓ జిన్నింగ్ మిల్లులో కూలీ పని చేస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితం వీరిద్దరి వివాహం జరగగా... వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు రావడంతో నిత్యం కలహాల కాపురంగా సంసారం గడిచేది. ప్రతిరోజు గొడవలు జరుగుతుండడంతో పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు, పెద్దలతో పంచాయితీలు జరిగేవి. దీంతో విసుగు చెందిన మమత గత సంవత్సరం కిందట తన తల్లిదండ్రులు తగడపల్లి నర్సమ్మ - దత్తు, ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందే తమ్ముడు మనోజ్(27)లు ఉండే మహారాష్ట్రలోని దహెల్లికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో తాను మారిపోయానని, ఇకపై గొడవలు పెట్టుకోనని సంతోష్ భార్యాపిల్లలను ఇంటికి తీసుకువచ్చి జీవిస్తున్నాడు. ఏడాది క్రితం జరిగిన గొడవల్లో తన బావమరిది అక్కాబావలిద్దరినీ కలిసి ఉండమని చెప్పడం సంతోష్‌కు నచ్చలేదు. అంతేకాకుండా..అక్క మమత యోగక్షేమాలను తెలుసుకుందామని ప్రతిరోజు మనోజ్ ఫోన్ చేయడం కూడా సంతోష్‌కు రుచించలేదు. గురువారం పని నిమిత్తం స్నేహితుడు సంజీవ్‌తో కలిసి మనోజ్ పట్టణానికి వచ్చాడు. అక్క, పిల్లలకు కొత్త బట్టలు తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చిన మనోజ్‌ను బావ సంతోష్...తేనీరు తాగుదామని బయటికి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒకసారి పొడిచే ప్రయత్నం చేయగా...పారిపోదామని ప్రయత్నించిన మనోజ్‌ను పరిగెత్తించి మరీ గొంతుకోసి హత్య చేశాడు. ఘటన స్థలంలో పెద్దఎత్తున స్థానికులు గుమిగూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు సురేష్, పోతారం శ్రీనివాస్ లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
