close

తాజా వార్తలు

ఉపాధ్యాయుడి కంట్లో కారం కొట్టిన సహచరుడు

చేగుంట మండలం రెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో ఘటన

చేగుంట, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే రౌడీల్లా మారి కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల ఎదుటే బాహాబాహీకి దిగడంతో పాటు ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మరో ఉపాధ్యాయుడి కంట్లో కారం కొట్టాడు. 8వ తరగతి విద్యార్థుల మార్కుల జాబితాను అడిగిన మరో ఉపాధ్యాయుడిపై ఇద్దరి మధ్య గొడవ నెలకొంది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా... పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పనిచేస్తున్న దేవరుషిపై భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీనివాసమూర్తి కంట్లో కారం చల్లి గాయపర్చాడు. వెంటనే సహ ఉపాధ్యాయులు అతన్ని చేగుంటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శనివారం ఈ ఇద్దరి ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దేవరుషి ఎనిమిదో తరగతికి క్లాస్‌టీచర్‌. శనివారం ఆయన శ్రీనివాస మూర్తిని విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన మార్కులు ఇవ్వాలని అడిగాడు. దీంతో శ్రీనివాస మూర్తి ఆయన పట్ల దుసుసుగా వ్యవహరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా శ్రీనివాసమూర్తికి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న శ్రీనివాసమూర్తి సోమవారం ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇంట్లో నుంచి కారం వెంట తెచ్చుకున్నాడు. ప్రార్థన అయిన తర్వాత దేవరుషి కార్యాలయంలోకి వెళ్లి రిజిస్టర్‌లో సంతకం పెడుతున్న క్రమంలో శ్రీనివాస మూర్తి జేబులో నుంచి కారం తీసి అతని కంట్లో చల్లాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు గుర్తించి గాయపడ్డ దేవరుషిని ఆస్పత్రికి తరలించారు. తనపై శనివారం దాడి చేసినందునే కారం చల్లినట్లు శ్రీనివాసమూర్తి తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయ సంఘం నాయకులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని శ్రీనివాసమూర్తి చర్యను తప్పుపట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థినులు మాట్లాడుతూ.. శ్రీనివాసమూర్తి సారు మాకు మాత్రమే పాఠాలు చెప్పేందుకు ముందుకొస్తాడని, బాలురను మాత్రం దూరంగా ఉంచుతాడని ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం మూడు పాఠాలు మాత్రమే చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు దేవయ్య మాట్లాడుతూ.. శ్రీనివాసమూర్తి సహ ఉపాధ్యాయుల పట్ల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడని తెలిపారు. అతను విద్యార్థులకు చదువు కూడా సరిగా చెప్పడం లేదన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న శ్రీనివాసమూర్తిని విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది ఉపాధ్యాయులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్‌కు ఉపాధ్యాయులంతా ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.