close

తాజా వార్తలు

అమ్మపై బెంగ.. ఉపాధ్యాయుడి బలన్మరణం

అక్టోబరు 30న ఉద్యోగంలో చేరిక

న్యూస్‌టుడే కంగ్టి, జగదేవపూర్‌: చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. నాటి నుంచి తల్లి అన్నీ తానై చదివించింది... కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని తపించింది. తల్లి ఆశలకు అనుగుణంగా ఇటీవల నిర్వహించిన టీఆర్‌టీ పరీక్షలో ఉద్యోగం సాధించాడు. గత నెల 30న ఉద్యోగంలో చేరాడు. గ్రామంలోనే గది తీసుకుని తోటి కొత్త ఉపాధ్యాయులతో కలిసి ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. అయితే తల్లికి దూరంగా ఉన్నానని ఆవేదన చెందాడు. తనను కష్టపడి చదివించిన అమ్మను దగ్గరుండి చూసుకోలేకపోతున్నానంటూ తనలో తనే మదనపడ్డాడు. చివరకు తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రఫీక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం తీగూల్‌కు చెందిన ఎల్లం నవీన్‌(23) తండ్రి ఎల్లయ్య 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి తల్లి బాలమ్మ కూలి పనులు చేస్తూ నవీన్‌ను, అతని సోదరి వరాలును చదివించింది. పేదరికంతో పడుతున్న బాధలు చూసి కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో నవీన్‌ కష్టపడి చదివాడు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీఆర్‌టీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. కంగ్టి మండలం పర్తుతండాలోని ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ వచ్చింది. విధుల్లో చేరి, స్థానికంగా నివాసం ఉంటున్నాడు. మండలంలోని ఇతర గ్రామాల్లో ఇటీవల కొత్తగా చేరిన ఇద్దరు ఉపాధ్యాయులు ఆయన గదిలో చేరారు. సోమవారం యథావిధిగా అందరూ విధులకు వెళ్లారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గదికి వచ్చిన నవీన్‌ లోపల నుంచి గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధులు ముగించుకుని సాయంత్రం తిరిగి వచ్చిన తోటి ఉపాధ్యాయులు తలుపులు తెరవాలని ఎంతగా కేకలు వేసినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో కంగ్టి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై వచ్చి గది తలుపులు పగులగొట్టి చూసేసరికి నవీన్‌ విగతజీవిగా కనిపించాడు. అమ్మపై బెంగతో చనిపోతున్నట్లు రాసిన ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘తనను కష్టపడి చదివించిన అమ్మకు దగ్గరుండి సేవచేయలేకపోతున్నానని, అమ్మకు దూరం అయినందున చనిపోతున్న’ట్లు లేఖలో ఉందని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని నారాయణఖేడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి వచ్చి ఫిర్యాదు ఇచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.