close

తాజా వార్తలు

ఎమ్మెల్యే కార్యాలయంలో చోరీ.. ఇంటి దొంగల పనే?

పోలీసుల అదుపులో చిరుద్యోగి

గత కొంతకాలంగా చేతివాటం

ఈనాడు-గుంటూరు: జిల్లాలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో నగదు చోరీ వెనక ఇంటి దొంగలే కీలకపాత్ర పోషించారు. పైకి తెలియనట్లు నటించారు. ఈ వ్యవహారంపై సోమవారం రాత్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మంగళవారం కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రూ.10లక్షల వరకు నగదు చోరీకి గురైందని పోలీసులు తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పోవడం అంటే నమ్మశక్యంగా లేదని, తొలుత వారు ఇంటి దొంగలపైనే నిఘా పెట్టి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టడంతో కేసు విచారణ కొలిక్కివచ్చిందని పోలీసు వర్గాల సమాచారం. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు ఈ నగదు నొక్కేసినట్లు గుర్తించారు. నియోజకవర్గ కేంద్రం మంగళగిరిలో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయం నుంచే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పేదలు సాయం కోరుతూ నిత్యం కార్యాలయానికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే కొంత నగదు కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారని తెలిసింది. ఈ నగదు పూర్తిగా కార్యాలయ ఉద్యోగుల పర్యవేక్షణలోనే ఉంటుంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారు ఖర్చు చేస్తారు. ఈ నగదు వినియోగానికి సంబంధించిన ఖాతా పూర్తిగా ఉద్యోగుల అధీనంలోనే ఉంటుందని తెలుసుకున్న పోలీసులు వారిని పిలిచి మాట్లాడారు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఉద్యోగులపై అనుమానం రావడంతో వారిని గట్టిగా నిలదీయటంతో ఓ చిరుద్యోగి నగదు నొక్కేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో నగదు చోరీ అంటూ ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మంగళగిరి పట్టణ పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ మోసానికి తెగబడింది ఎవరో పోలీసులు నిగ్గుతేల్చారు. కార్యాలయంలో మాయమైన నగదు ఒక్కరోజు పోలేదని, గత కొంతకాలంగా ఖాతాలో నగదు తగ్గుతూ వచ్చినట్లు గుర్తించారు. ఈ మొత్తానికి చిరుద్యోగితో పాటు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.