close

తాజా వార్తలు

‘రాజధాని సమస్య రైతులది మాత్రమే కాదు’

రాజధానిని మార్చే ధైర్యం మీకుందా?
ఒక్క వివాదం లేకుండా భూములు సేకరించాం
మీ నిర్వాకంతో పెట్టుబడిదారులు పారిపోయారు
నాకు సామాజిక వర్గం అంటగడతారా?
వైకాపా ప్రభుత్వంపై మండిపడిన చంద్రబాబు

అమరావతి: రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే అమరావతి పర్యటన చేపట్టినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం కుట్రలతో అమరావతి పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించామని చెప్పారు. పవిత్రమైన మట్టి నీళ్లతో రాజధాని ప్రాంతాన్ని నాడు పునీతం చేశామన్నారు. అమరావతి భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అని.. దాన్ని పూర్తి చేసేలా వైకాపా నేతలకు మంచి మనసు ఇవ్వాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు చెప్పారు. ఇది ఒక్క రాజధాని ప్రాంత రైతుల సమస్య మాత్రమే కాదని.. దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలన్నారు. రాజధాని ఏ ఒక్క మతానికో, కులానికో సంబంధించినది కాదని చెప్పారు. తనను నమ్మి రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు వివరించారు. రాజధానిని మార్చే ధైర్యం మీకుందా? అని ప్రశ్నించారు. అమరావతి జోలికి రావొద్దని.. రాజధానిని నిర్వీర్యం చేసి చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని వైకాపా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌ను ఏ కులం చూసి అభివృద్ధి చేశాం?

‘‘రాజధానిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పరిశీలించాం. కొన్ని భవనాలు 90 శాతం పూర్తయ్యాయి. ఐదేళ్లు ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన చేశాం. అమరావతి అభివృద్ధి జరగాలని ఎంతో కష్టపడ్డాం. రాబోయే వెయ్యేళ్ల వరకు రాజధాని ఉండాలని అనుకున్నాం. నాకు కులం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏ కులం చూసి అభివృద్ధి చేశాను? ఆనాడు నేను పడిన కష్టం.. చూపిన చొరవ జీవితాంతం నాకు తృప్తినిస్తుంది. సైబరాబాద్‌కు ఎన్నో కంపెనీలు వచ్చేలా కృషి చేశాం. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా హైదరాబాద్‌ అభివృద్ధి అంటే నేనే గుర్తొస్తాను. ఆ తృప్తికోసం వివిధ దేశాలు తిరిగాను. రాత్రింబవళ్లు కష్టపడ్డా. విజన్‌ 20-20తో అభివృద్ధి చేశాం’’ అని చెప్పారు.

మెజారిటీ ప్రజలు కోరుకున్న నగరం ‘అమరావతి’

జనాభా, రాకపోకలు, దూరం అన్నీ చూసి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మెజారిటీ ప్రజలు కోరుకున్న నగరం.. అమరావతి అని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం సుమారు 34వేల ఎకరాల సాగుభూములను రైతులు ఇచ్చారని.. ఒక్క వివాదం కూడా లేకుండా రైతుల నుంచి భూములు తీసుకున్నామన్నారు. అమరావతి నిర్మాణం కోసం తమ హయాంలో 9,060 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వివరించారు. ‘‘భూముల నుంచి వచ్చే ఆదాయం వల్లే మౌలిక వసతులు వస్తాయి. అమరావతి కోసం అద్భుతమైన ప్రణాళికలు వేశాం. రాజధానిలో రూ.2లక్షల కోట్ల సంపద సృష్టించిన ప్రభుత్వం మాది. అక్కడి జరిగిన పనుల వల్ల స్టీల్‌, సిమెంట్‌ ఇతర సామగ్రి వినియోగం పెరిగింది. తక్కువ వడ్డీతో రుణం ఇచ్చేందుకు అనేక బ్యాంకులు ముందుకొచ్చాయి. హ్యాపీనెస్ట్‌ వల్ల ప్రభుత్వానికి లాభం వచ్చింది. రాజధాని పనులతో జీఎస్టీ ఆదాయం పెరిగింది. భవిష్యత్తుల్లో ఆదాయం సమకూర్చే నగరంగా అమరావతి మారనుంది’’ అని చంద్రబాబు వివరించారు.

ముంపు ప్రాంతమంటూ ప్రచారమా?

రాజధాని ముంపు ప్రాంతమని ప్రచారం చేయడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. కుట్రలు పన్ని తనను ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి అక్కడి భూములు పనికిరావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ పటంలో అమరావతి పేరు లేకుంటే బాధ్యత లేదా? అని వైకాపాను  ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్నారని.. వారంతా ఏం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ప్రస్తావించడం వల్లే పటంలో అమరావతి పేరును గుర్తించారని చెప్పారు. 

బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు

‘‘శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ఇతర భవనాలను శ్మశానం అంటారా?ఏం చేసిందని ప్రజావేదికను కూల్చారు? హైకోర్టు వద్ద మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదు?అమరావతిని చంపే ప్రయత్నం దుష్ట ఆలోచన. మంత్రి బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నా ఇల్లు ముంచాలని లంక గ్రామాలను ముంచేశారు. ఒక సామాజిక వర్గానికే అంటూ నన్ను తప్పుపడతారా?కుటుంబం, బంధువులు, పార్టీ కోసమో నేను నగరాలు నిర్మించలేదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎక్కడ జరిగింది? రాజధాని కోసం మరో కమిటీ వేస్తారా? సింగపూర్‌ లాంటి దేశానికి కూడా అవినీతి అంటగడతారా? పారదర్శకత, విశ్వసనీయతలో సింగపూర్‌కు మంచిపేరుంది. మీ నిర్వాకంతో పెట్టుబడిదారులు అందరూ పారిపోయారు. మీకు వీలైతే మరిన్ని పెట్టుబడులు తీసుకురండి. అమరావతి అభివృద్ధి కాకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అనేక హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఖాళీ ఖజానాతో మీరేం చేస్తారు?రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించే సమయం ఆసన్నమైంది’’ అని చంద్రబాబు అన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.