close

తాజా వార్తలు

పెంపకంలోతేడాలెందుకు?

కట్టుబాట్లు... క్రమశిక్షణ... అన్నీ అమ్మాయిలకేనా? పద్ధతి... ప్రవర్తనా నియమావళి... అబ్బాయిలకు అవసరం లేదా?    విలువలు వారికీ చెప్పాల్సిన పనిలేదా! ఉంది... అబ్బాయిలకూ ఆంక్షలుండాలి. స్త్రీలను గౌరవించే సంస్కారం నేర్పించాలి. మహిళలతో మర్యాదగా ఎలా మసులుకోవాలో చెప్పాలి. పద్ధతి కలిగిన పురుషులను ప్రపంచానికందిచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే!

బ్బాయిలతో ఆటలేంటీ... నువ్వు ఆడపిల్లవని మర్చిపోతున్నావా... జాగ్రత్తగా ఉండాలని తెలియదా... మగవాళ్లతో ఆచీతూచీ మాట్లాడాలి కదా...’ ఇలా అమ్మాయికి చిన్నప్పటినుంచీ బోలెడు ఆంక్షలు పెడతాం. అబ్బాయికి మాత్రం అలాంటివి తక్కువే. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. వీటికితోడు పెంపకం తాలూకు మరికొన్ని లోపాలు అబ్బాయిలు తామేదో ప్రత్యేకమనే భావనను వారిలో కలిగిస్తాయి. ఇవన్నీ పెద్దయ్యాక బయటపడతాయి. ఆడపిల్లల్ని ఆటపట్టించడం మొదలు అత్యాచారాలవరకూ దారితీస్తాయి. మరేంటి పరిష్కారం అంటారా... అబ్బాయిల్ని మొక్కగానే మార్చే ప్రయత్నం ప్రతి కుటుంబంలో జరగాలి.

గౌరవించడం నేర్పాలి... ఇంట్లో అబ్బాయి, అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరినీ సమానంగా చూస్తున్నామనుకుంటాం కానీ...అన్నిసార్లు అది జరగదు. సమానంగా చూడటం అంటే... బొమ్మలు కొనివ్వడం, చదువు చెప్పించడం, దుస్తులు ఇప్పించడం మాత్రమే కాదు. ఇద్దరిమధ్యా చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడు... ఒకరినే అనకూడదు. చూసీచూడనట్లు వదిలేయకూడదు. ఇద్దరినీ తిట్టండి... దండించండి. అంతేతప్ప అమ్మాయిని మాత్రమే ‘నువ్వెందుకు గొడవపడ్డావు’ అని అనడంలో అర్థంలేదు. అప్పుడే ఏం చేసినా ఇంట్లోవాళ్లు సమర్థిస్తారనే అభిప్రాయానికి వచ్చేస్తారు మగపిల్లలు. వాళ్ల తగాదాల్లో భాగంగా... చెల్లి లేదా అక్కపై చేయి చేసుకుంటే అది తప్పని చెప్పాలి. అంతేతప్ప వాళ్లే కొట్టుకుంటారు, వాళ్లే కలుస్తారని వదిలేస్తే తామేదో బలవంతులమనే భావన అబ్బాయిలకు కలుగుతుంది. 

పనుల్లోనూ సమానత్వం... అమ్మాయి పెరిగేకొద్దీ ఇల్లు ఊడవడం, భోజనాలబల్లను సర్దడం, కూరగాయలు తరగడం... ఇలా చిన్నచిన్న పనులు చెబుతాం. అమ్మాయిలకే ఎందుకు... వాళ్లతో సమానంగా పిల్లాడినీ ఇంటిపనుల్లో భాగం చేసి చూడండి. దీనివల్ల రెండు లాభాలుంటాయి. ఒకటి వాళ్లకీ పనులు వస్తాయి. పెద్దయ్యాక చదువు, ఉద్యోగం కోసం బయట ఉండాల్సి వస్తే... ఇతరులపై ఆధారపడకుండా ఉంటారు.   తామూ అమ్మాయిలతో సమానమనే భావనా వాళ్లకు వస్తుంది. ఆడపిల్లల సమస్యల్ని అర్థంచేసుకుంటారు. గౌరవభావమూ పెరుగుతుంది.

తరగతిలో వివక్ష ఎందుకు... ప్రతిభకు వివక్ష ఉండదు. ముఖ్యంగా చదువు, ఆటపాటలు, సృజన విషయంలో పిల్లలిద్దరూ సమానమే. చాలామంది తల్లిదండ్రులు దాన్ని ఒప్పుకోరు. ఉదాహరణకు తరగతిలో ఎవరైనా అమ్మాయి క్లాస్‌ ఫస్ట్‌ వస్తే... ‘సిగ్గులేదా ఆడపిల్ల ఫస్ట్‌ వచ్చింది. అబ్బాయివి అయ్యుండి తెచ్చుకోలేకపోయావు..’ అనేస్తారు. ఇదే మిగిలిన అంశాలకూ వర్తిస్తుంది. దాంతో ఆడపిల్లలతో మాట్లాడుతున్నా... మనసులో మాత్రం వాళ్లేదో తక్కువనే భావనను పెంచుకుంటారు. అలా కాకుండా... ‘నువ్వెందుకు సాధించలేకపోయావు... ఎక్కడ పొరపాటు చేస్తున్నావు’ వంటి ప్రశ్నలు వేసి చూడండి. వ్యక్తిగా ఎదుగుతారు.

క్రమశిక్షణ అవసరం... అబ్బాయి పెరిగేకొద్దీ స్వేచ్ఛ పెరుగుతుంది. స్నేహితులతో బయటకు వెళ్లడం, పార్టీలు, ఫోన్లు, బైకులు.. ఇలా ఎన్నో ఉంటాయి. వాళ్లను చూసీ చూడనట్లు వదిలేయడం, ఎప్పుడో ఒకప్పుడు మందలించడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. వీటన్నింటితో ఆడపిల్లల్ని వేధించడం మొదలు అత్యాచారాల వరకూ వెళ్తారు. దీన్ని మొదట్లోనే కట్టడి చేయాలంటే వాళ్లకు చిన్నప్పటినుంచీ క్రమశిక్షణ అలవాటు కావాలి. అమ్మాయిల్లానే కొన్ని నియమాలు పెట్టాలి. సమయానికి ఇంటికి రావడం, ఏవైనా అడిగినా అవసరం అనుకుంటేనే కొనివ్వడం వంటివి తప్పనిసరి. వాళ్ల స్నేహితుల గురించీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ప్రవర్తనలో సమస్య కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా హెచ్చరించేందుకు ప్రయత్నించాలి.

అమ్మాయికి ధైర్యం చెబుదాం...

సమస్య ఎదురుగా ఉంటే ఆందోళనకు గురికాకుండా... ఆదిపరాశక్తిలా మారేలా అమ్మాయిని పెంచాలి. ఎదురుగా ఎన్ని అడ్డంకులున్నా...
మానసికంగా స్థిరంగా ఉండి... సమస్యకు పరిష్కారం ఆలోచించేలా తయారు చేయాలి.  

* చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎదురయ్యే సమస్యల్లో మీరు కల్పించుకోకండి. పాఠశాలల్లో ఏదైనా గొడవ జరిగినా, ఎవరైనా ఏడిపించినా వాళ్లే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. ఉపాధ్యాయులకు ధైర్యంగా ఫిర్యాదు చేసేలా చూడండి.
* కొందరు చిన్నారులు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు.  తోడుగా రమ్మని మారాం చేస్తుంటారు. అయినా పంపించండి. అలవాటైతే వారి భయం పటాపంచలవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

- డాక్టర్‌ షణ్ముఖి, మానసిక నిపుణురాలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.