close

తాజా వార్తలు

ప్రవేశానికి ప్రయోగిద్దాం..మూడు అస్త్రాలు!

విదేశీవిద్య

ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే యూనివర్సిటీలు, కోర్సులపై పరిశోధనలు చేస్తారు. టెస్ట్‌లు.. స్కోర్లపై ఆందోళన చెందుతుంటారు. ఫీజు, ఖర్చులు సమకూర్చుకోవడంలో సతమతమవుతుంటారు. కానీ అక్కడి విద్యాసంస్థలు మార్కులు, ఆర్థిక స్థోమతలే కాకుండా ఇంకొన్ని అంశాలనూ పరిశీలించి ప్రవేశం కల్పిస్తాయనే విషయాన్ని విస్మరిస్తారు. సీటు ఇచ్చేముందు వర్సిటీలు అభ్యర్థి ఆసక్తీ, వ్యక్తిత్వాలనూ అంచనా వేస్తున్నాయి. అందుకే వేలమందిలో ప్రత్యేకతను చాటుకొని ఎంపిక కావాలంటే తగిన అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అవే అడ్మిషన్‌ ఎస్సే, ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్‌లు.

 

విదేశీ విద్యలో మొదటి దశ ప్రీ-రిక్విజిట్‌ టెస్ట్‌లు, రెండోది అతి ముఖ్యమైన దరఖాస్తు ప్రక్రియ. దీనికి ముందు నుంచే సిద్ధం కావాలి. ఇందులో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌ (ఎల్‌ఓఆర్‌), అకడమిక్‌ ఎస్సే ప్రధానమైనవి. కావాల్సినన్ని మార్కులు, పరిజ్ఞానం, ఆర్థిక స్థోమతలకు తగిన రుజువులు సమర్పించినప్పటికీ అడ్మిషన్‌ కమిటీ అదనంగా మరికొన్నింటిని అడగడానికి కారణమేమిటి? అంటే.. విద్యార్థిలో ఉండే ప్రత్యేక లక్షణాలను తెలుసుకోడానికే అని చెప్పవచ్ఛు వాటి ద్వారా అభ్యర్థికి ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తు లక్ష్యాలు తదితరాలపై ఎంతవరకు స్పష్టత ఉందో గమనిస్తారు. పరిశోధన ఆసక్తి, ఎంచుకున్న విద్యాసంస్థపై అవగాహన మొదలైన వివరాలను పరిశీలించడం ద్వారా విద్యార్థిపై ఒక అంచనాకు వస్తారు.

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌

స్‌ఓపీ విద్యార్థి వ్యక్తిత్వానికి ముఖచిత్రం లాంటిది. అడ్మిషన్‌ కమిటీని మెప్పించడానికి తోడ్పడే సాధనం. అకడమిక్‌ రికార్డు, ఇతర పరీక్షల స్కోర్లు అభ్యర్థి చదివేతీరును మాత్రమే తెలియజేస్తాయి. వాటితోపాటు వ్యక్తిత్వం, ఇతర నైపుణ్యాల గురించి తెలుసుకోడానికి ఎస్‌ఓపీ వీలు కల్పిస్తుంది. ఒకరకంగా మిగతావారితో పోలిస్తే తాను ఎందుకు భిన్నమో తెలియజేసే అవకాశాన్ని అభ్యర్థికి అందిస్తుంది. ఎంపిక నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఏమేం ఉండాలి?: విద్యార్థి నేపథ్యం, లక్ష్యాలు (వృత్తిగతమైనవి).

● విద్య, వృత్తి వివరాలు (ఎంచుకున్న రంగంలో ఎంతవరకూ మెరుగో చెప్పవచ్ఛు) ● వ్యక్తిగత వివరాలు (దరఖాస్తులో వాటికి అదనంగా వివరాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని పరిష్కరించినతీరు, ప్రేరణ కలిగించే అంశాలు మొదలైనవి.) ● కోర్సు, విద్యాసంస్థను ఎంచుకోవడానికి కారణాలు.● విద్యాసంస్థ మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి? వంటివి ఉండాలి.

ఏం గమనిస్తారు?: విద్యార్థి రాత నైపుణ్యాలను పరిశీలిస్తారు. కాబట్టి, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. భాష సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మరీ ఎక్కువ పెద్ద పదాలను ఉపయోగించకూడదు.

● ప్రత్యేకతలు, భిన్న వ్యక్తిత్వాన్ని గమనిస్తారు. అందుకని విద్యార్థి లక్ష్యాలు, వాటిని చేరుకోడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నారో తెలియజేయాలి. ● టాలెంట్‌, గత అనుభవాలు, ఆసక్తుల ఆధారంగా యూనివర్సిటీకీ, డిపార్ట్‌మెంట్‌కూ ఎలా సాయపడగలుగుతారో చూస్తారు. దీని కోసం ఆటలు, సమాజసేవ, సొసైటీలు, క్లబ్బుల ద్వారా చేసిన కార్యక్రమాల వివరాలను పొందుపరచాలి. ● ఎంచుకున్న విశ్వవిద్యాలయానికి సంబంధించి అందిస్తున్న ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, సౌకర్యాలపై అవగాహన పెంచుకొని, అవి తన (విద్యార్థి) భవిష్యత్తుకు ఎలా సాయపడతాయో ఎస్‌ఓపీలో వివరించాలి. విశ్వవిద్యాలయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేశారనే భావన కలిగించాలి. ● ఫలానా కోర్సును ఎంచుకోవడానికి ప్రేరణ కలిగించిన అంశాలను చెప్పవచ్ఛు సాగతీత వద్ధు ఇబ్బంది కలిగించే వాక్యాలు ఉండకూడదు.

వేల దరఖాస్తుల్లో ప్రత్యేకంగా నిలవాలంటే కొన్ని ప్రాథమిక లక్షణాలను పాటించాలి. సంబంధిత కోర్సు, పద పరిమితి, ఫార్మాట్‌ మొదలైన వాటిపై శ్రద్ధపెట్టాలి.

అడ్మిషన్‌ ఎస్సేలు

ఎంబీఏ లేదా సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేస్తే కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్‌ ఎస్సే అడుగుతాయి. మరికొన్ని సంస్థలు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాయి. వాటి ఆధారంగా విశ్వవిద్యాలయ అంచనాలకు, కోర్సుకు తగినట్లుగా విద్యార్థి ఉన్నాడో లేదో చూస్తాయి. ఉదాహరణకు- ఎంబీఏకు దరఖాస్తు చేసుకుంటే.. విద్యార్థికి నాయకత్వ లక్షణాలు ఉండాలనీ; ఎంఐఎస్‌ ప్రోగ్రామ్‌కు సృజనాత్మకత, త్వరగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం అవసరమనీ భావిస్తాయి. వీటికి నిర్దిష్ట ఫార్మాట్‌ అంటూ ఏమీ ఉండదు. విశ్వవిద్యాలయాలే ప్రోగ్రామ్‌కు సంబంధించి పంపాల్సిన ఎస్సేల వివరాలను అందజేస్తాయి. సాధారణంగా పరిమిత పదాల్లో లక్ష్యాలు, నాయకత్వం, కెరియర్‌ పురోగతి, అపజయాలు మొదలైన వాటిపై రాయమంటాయి.

ఎలా ఉండాలి?: దరఖాస్తుకు వ్యాసం అదనపు విలువను చేకూర్చాలి. అందులో పరిచయం, వివరణ, ముగింపు తప్పనిసరి. విశ్వవిద్యాలయం షరతులను పాటించాలి. ఆన్‌లైన్‌లో సమర్పించే వీలు ఉన్నప్పటికీ విడిగా డాక్యుమెంట్‌లో ఎస్సే సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా సరిచూసుకున్న తర్వాతే సమర్పించాలి. పదాల సంఖ్య పెరిగితే హెడ్డింగ్‌ను వదిలేయవచ్ఛు బోల్డ్‌, ఇటాలిక్‌ వంటివి అవసరం లేదు. పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉంటే సరిపోతుంది. హ్యాష్‌టాగ్‌లు, ఎమోజీలు, సంక్షిప్త పదాలను వాడకపోవడం మంచిది.

లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌

విద్యార్థి ప్రవేశానికి కచ్చితంగా అర్హుడని చెబుతూ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఇది. కోర్సు, దేశంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థీ కనీసం 2-3 రెకమెండేషన్‌ ఆఫ్‌ లెటర్లను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని విద్యార్థికి ప్రొఫెషనల్‌గా బాగా తెలిసినవారు ఇవ్వచ్ఛు లేదా కోర్సుకు సంబంధించిన సబ్జెక్టును బోధించే వారైనా రెకమెండ్‌ చేయవచ్ఛు డిగ్రీ విద్యార్థులైతే టీచర్లు, ప్రొఫెసర్లు, కాలేజీ కౌన్సెలర్లు, ప్రిన్సిపల్‌లను ఎల్‌ఓఆర్‌ అడగవచ్ఛు ఎంఎస్‌ అభ్యర్థులైతే ప్రొఫెసర్లు, ఇంటర్న్‌షిప్‌ సూపర్‌వైజర్లు/ టీం లీడ్‌/ మేనేజర్‌ నుంచి తీసుకోవచ్ఛు పని అనుభవం ఉన్నవారు తప్పనిసరిగా ప్రొఫెషనల్స్‌ నుంచి తీసుకొని సబ్‌మిట్‌ చేయాలి. ఎంబీఏ, పీహెచ్‌డీ అభ్యర్థులకు అనుభవం లేకపోతే కళాశాల ప్రొఫెసర్లు, ప్రాజెక్ట్‌ గైడ్‌ల నుంచి ఎల్‌ఓఆర్‌ పొందవచ్ఛు

ఎస్‌ఓపీలో విద్యార్థి తన గురించి తాను చెప్పుకుంటే, తన గురించి ఇతరుల అభిప్రాయం ఎల్‌ఓఆర్‌లో తెలుస్తుంది. మంచి విద్యానేపథ్యం ఉన్నవారు ఇస్తే దీనికి విలువ ఎక్కువ.

ఎల్‌ఓఆర్‌లో ఏ అంశాలు?: నాయకత్వ, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు.

సామర్థ్యాలు, నిర్ణీత కాలంలో సాధించిన విజయాలు. విద్యార్థి/ ఎంప్లాయర్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు.

ఎలా ఉండాలి?: ● పేరాలుగా రాయాలి. విద్యాసంస్థ లేదా ప్రొఫెషనల్‌ సంస్థ లెటర్‌ హెడ్‌తో ఎల్‌ఓఆర్‌ సిద్ధం చేయాలి.

ఎస్‌ఓపీకి నకలులాగా ఉండకూడదు.

ఎల్‌ఓఆర్‌ ఇస్తున్న వారి సంక్షిప్త సమాచారం మొదటి పేరాలోనూ, వారి ఆధ్వర్యంలో విద్యార్థి పొందిన మార్కులు/ పనితీరును రెండో పేరాలో, ప్రాజెక్ట్‌ సంబంధిత అంశాలు, ఆ సమయంలో ప్రదర్శించిన నైపుణ్యాలు, రిస్క్‌ తీసుకోవడానికి ఎంతవరకూ ముందుంటాడు? పోటీతత్వం, టాలెంట్‌, నాయకత్వ లక్షణాలు వంటివి తర్వాతి పేరాల్లో ఉండాలి. తోటివారితో మెలిగే వైఖరి, ఎంచుకున్న కోర్సు అభ్యర్థి స్వభావానికి ఎలా సరిపోతుందో రాయాలి. అపజయాలు ఎదురైనప్పుడు వ్యవహరించే తీరునూ వివరించాలి. దరఖాస్తులో లేదా ఎస్‌ఓపీలో పొందుపరిచినవే కాకుండా విద్యార్థి వ్యక్తిత్వానికి సంబంధించి అదనపు విశేషాలు ఎల్‌ఓఆర్‌లో ఉండాలి. బాగా తెలిసినవాళ్ల నుంచి తీసుకోవడం మంచిది. విద్యార్థి స్వభావం, విజయాలను నామమాత్రంగా రాయకుండా సందర్భాలతో సహా చెప్పడం ప్రయోజనకరం. ఒకటికి మించి ఎల్‌ఓఆర్‌లు సమర్పిస్తున్నప్పుడు దేనికదే భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. పరిశీలకులపై బలమైన ముద్ర వేసే విధంగా ఉండాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.