close

తాజా వార్తలు

ఏ తిండితో మనసు నిండుతుంది?

శరీరం మాట మనసు వింటుంది. మనసు మాట శరీరం వింటుంది. ఈ రెండూ తిండి మాట వింటాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనమేంటన్నది మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది! ఎలాంటి ఆహారం తింటే అలాగే తయారవుతాం. దీన్ని మార్చుకుంటే మనసునూ మార్చుకోవచ్ఛు తరచూ మానసిక స్థితి (మూడ్‌) మారిపోతుండే వారికిది మరింత ముఖ్యం.

పరీక్షల ముందు ఒత్తిడి కావొచ్చు, వాటిలో ఉత్తీర్ణులమయ్యామనే సంతోషం కావొచ్ఛు ఇచ్చిన పని సమయానికి పూర్తి చేస్తామో లేదోననే ఆందోళన కావొచ్చు, అందరికన్నా ముందే పూర్తిచేసి శెభాష్‌ అనిపించుకున్నామన్న ఆనందం కావొచ్ఛు పిల్లలకు కోరుకున్న ఉద్యోగం దొరకలేదనే బాధ కావొచ్చు, అనూహ్యంగా మంచి జీతంతో గొప్ప అవకాశం వచ్చిందని పొంగిపోవడం కావొచ్ఛు అందరమూ ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లమే. తలచినట్టుగా జరగనప్పుడు విచారం, బాధ కలగడం.. కోరుకున్నట్టుగా జరిగినప్పుడు ఎగిరి గంతేయడం సహజమే. కొద్దిరోజుల్లో ఇవన్నీ సర్దుకుంటాయి. తిరిగి రోజులు గాడిలో పడతాయి. కానీ కొందరిలో ఆందోళన, విచారం, బాధ వంటివి సద్దుమణగకుండా అలాగే ఉండిపోతుంటాయి. మరికొందరు ఉత్సాహం పరవళ్లలో మునిగిపోయి అతిగానూ ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడో ఒకసారైతే ఫర్వాలేదు గానీ మానసిక స్థితి ఉన్నట్టుండి మారిపోవడం (మూడ్‌ స్వింగ్స్‌) తరచూ ఎదురవుతుంటే, ఎక్కువకాలం కొనసాగుతూ వస్తుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇది రోజువారీ జీవితాన్నీ దెబ్బతీసే ప్రమాదముంది. ఉదాహరణకు- అతి ఉత్సాహంతో దుబారా ఖర్చులు చేయొచ్ఛు ఇతరుల మాటలను పట్టించుకోకపోవచ్ఛు కొన్నిసార్లు మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం వంటి దురలవాట్లకూ లొంగిపోవచ్చు లేదా బాధలో ఉంటే ఒంటరిగా ఉండిపోవచ్ఛు పని మీద ఇష్టం లేకపోవచ్ఛు ప్రాణస్నేహితులను కలవడానికీ వెనకాడొచ్ఛు నిద్ర పట్టక ఇబ్బందులకు గురికావొచ్ఛు పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే ఆహారం మీద కాస్త దృష్టి పెట్టడం మంచిది. ఎందుకంటే కొన్నిరకాల పోషకాలు కుంగుబాటు లక్షణాలను తగ్గించి హుషారు, ఉత్సాహం ఇనుమడించేలా చేస్తాయి మరి.●

ఆహారమే ఔషధం!

మానసిక సమస్యలతో బాధపడేవారిలో ఆహార అలవాట్లూ మారిపోతుంటాయి. కొందరు భోజనం మానేస్తుంటారు. మరికొందరు ఆకలి వేయక సతమతమవుతుంటారు. ఇంకొందరు మిఠాయిలు, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువెక్కువగా తినేస్తుంటారు. ఇవి పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. కాబట్టి మానసిక స్థితిని మెరుగుపరచే ఆహారం మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం మంచిది. ●

తేలికగా తీసుకోవద్దు

తరచూ మూడ్‌ మారిపోవడాన్ని తేలికగా తీసుకోవద్ధు కొన్నిసార్లు దీనికి తీవ్ర మానసిక సమస్యలూ మూలం కావొచ్ఛు అప్పుడే హుషారు, అంతలోనే నిరాశకు గురిచేసే బైపోలార్‌ డిజార్డర్‌, తీవ్ర కుంగుబాటు (మేజర్‌ డిప్రెషన్‌), వ్యక్తిత్వ సమస్యలు, ఏకాగ్రతను దెబ్బతీసే అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) వంటి మానసిక సమస్యలు దీనికి ఆజ్యం పోయొచ్ఛు యుక్తవయసు అమ్మాయిల్లో, యువతుల్లో, గర్భిణుల్లో, నెలసరి నిలిచినవారిలో హార్మోన్ల మధ్య వ్యత్యాసాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ఇవీ మూడ్‌ మారిపోవడానికి దారితీయొచ్ఛు మాదక ద్రవ్యాలు, మద్యం, పొగ వంటి వ్యసనాలూ కొందరిని విచిత్ర మానసిక స్థితిలోకి నెట్టొచ్ఛు ఇలాంటి ధోరణి గలవారికి ఒత్తిడి, అనూహ్య మార్పులు ఎదురైనప్పుడు.. నిద్ర తీరుతెన్నులు మారినప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది కూడా. ●

అక్రోట్లు: ఇవి ఒకవైపు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూనే మరోవైపు నిరాశ, నిస్పృహలు తగ్గుముఖం పట్టడానికీ తోడ్పడతాయి. వీటిలో ఆల్ఫాలినోలిక్‌ ఆమ్లం మెండుగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పనుల మీద ఆసక్తిని పెంచుతుంది. సహనాన్ని కోల్పోనీయకుండా మనసు, మాట నియంత్రణలో ఉండటానికి దోహదం చేస్తుంది.

గుడ్లు: హుషారును పుట్టించడానికి, ప్రవర్తన అదుపులో ఉండటానికి తోడ్పడే సెరటోనిన్‌ రసాయనం మెదడులో ఉత్పత్తి కావడానికి ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం అవసరం. ఇది గుడ్లతో లభిస్తుంది. వీటిలో మాంసకృత్తులు, విటమిన్‌-డి కూడా ఎక్కువే. మెదడులో నాడీ రసాయనాల ఉత్పత్తికి తోడ్పడే కోలిన్‌ సైతం వీటితో అందుతుంది.

చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. బాదం, పిస్తా వంటి గింజపప్పులతో పాటు చేపల్లోనూ ఇవి దండిగా ఉంటాయి. చేపలు ఎక్కువగా తినే ప్రాంతాల్లో కుంగుబాటు తక్కువని అధ్యయనాలూ చెబుతున్నాయి. చేపల్లో రైబోఫ్లావిన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, మెగ్నీషియం, అయోడిన్‌, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలూ ఉంటాయి. ఇవన్నీ మూడ్‌ (మానసిక స్థితి) మెరుగుపడటానికి దోహదం చేసేవే.

జీవనశైలినీ మార్చుకోవాలి

మూడ్‌ మారిపోతుండటం తీవ్రమైనప్పుడు మందులు, మానసిక చికిత్సలు అవసరమే అయినా అంతకన్నా ముందు జీవనశైలిని మార్చుకోవడం ముఖ్యం.●

రోజూ ఎప్పుడేం పనులు చేస్తున్నామో ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు తింటున్నాం? ఎప్పుడు నిద్రపోతున్నాం? అనేవి రాసుకుంటే ఎక్కడ గాడి తప్పుతున్నామో తెలిసిపోతుంది. తేలికగా సరిదిద్దుకోవచ్ఛు●

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మెదడులో మన మూడ్‌ను నియంత్రించే రసాయనాలు ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది.●

బొమ్మలు గీయడం, పాటలు పాడటం, కుట్లు అల్లికల వంటి వ్యాపకాలను అలవరచుకుంటే మేలు. ఇవి మనలోని భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడతాయి. ఆందోళన, బాధ తగ్గుతాయి. సంతోషం ఇనుమడిస్తుంది.●

యోగా, ధ్యానం లాంటివి సాధన చేయడం మంచిది. ఇవి ఒత్తిడి తగ్గడానికి, మనసు కుదురుగా ఉండటానికి తోడ్పడతాయి.

వీలైనప్పుడల్లా స్నేహితులు, బంధువులతో కలిసి గడపటం అలవాటు చేసుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.