close

తాజా వార్తలు

పొరల పొరల ఉల్లిని.. పోషకాల తల్లిని!

నా కథ

కొద్ది రోజులుగా.. ఎక్కడ చూసినా.. నేనే! టీవీ ఛానళ్లలోనూ..  పత్రికల్లోనూ.. నేనే! అంతెందుకు.. సామాజిక మాధ్యమాల్లోనూ నేనే! ఇలా ఎక్కడ చూసినా నేనే.. ఏ ఇంటికి వెళ్లినా.. నా ముచ్చట్లే! ఆఖరుకు పార్లమెంటులోనూ నా చర్చే.. అందుకే నా గురించి మీకు తెలియని విషయాలు  పంచుకుందామని ఇదిగో ఇలా వచ్చా..


‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ...

* నేను మధ్య ఆసియాలో పుట్టానని పలు పరిశోధనలు తేల్చాయి.
*
నన్ను మొట్టమొదట ఇరాన్‌, పశ్చిమ పాకిస్థాన్‌లో పెంచినట్లు మరి కొందరు చెబుతుంటారు.
*
నన్ను సాగుచేయడానికి ముందే మీ పూర్వీకులు అడవి ఉల్లిని విరివిగా ఆహారంగా వాడారు.
*
మొత్తానికి నన్ను 5000 సంవత్సరాల పూర్వం నుంచి పెంచుతున్నట్లు పరిశోధనలు తేల్చాయి.
*
ఈజిప్టులో అయితే ‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ పిరమిడ్లలో ఖననం చేశారు. అప్పట్లోనే మమ్మల్ని చాలా విలువైన వస్తువులుగా గుర్తించేవారు.
*
కొన్ని పిరమిడ్ల గోడలపైనా.. నా బొమ్మలు గీసి ఉన్నాయి.
*
అమెరికాలో నా మ్యూజియం కూడా ఒకటి ఉంది.. తెలుసా?


చరకసంహితలోనూ...

* భారతదేశ ప్రాచీన వైద్య గ్రంథం చరకసంహితలోనూ నా ప్రస్తావన ఉంది. అందులో నన్ను ఔషధంగా చెప్పారు. గుండె, కళ్లు, కీళ్లకు మేలు చేస్తానని నా గురించి రాశారు.
*
కేవలం మన దేశంలోనే కాదు... గ్రీసులోనూ ఔషధంగా వాడేవారు. ముఖ్యంగా ప్రాచీన ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు తమ శరీర పటుత్వం కోసం పెద్దమొత్తంలో నన్ను ఆహారంగా తీసుకునేవారు.
*
రసంగా చేసుకుని తాగేవారు. శరీరాలకూ రాసుకునే వారు.
*
నన్ను ఆహారంగా తీసుకుంటే.. కంటిచూపును మెరుగుపరుస్తానని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. నోటి అల్సర్లు, పుండ్ల నివారణ, పంటినొప్పికి మందుగా వాడేవారు. కుక్కకాటుకూ విరుగుడుగా ఉపయోగించేవారు.
*
ప్రాచీన యూరప్‌లోనూ నన్ను ఔషధంగా వాడేవారు. తలనొప్పి నివారణ, పాముకాటుకు విరుగుడు, జుట్టు రాలడాన్ని అరికట్టడానికీ ఉపయోగించేవారు.
*
అందుకేనేమో.. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత మీ దగ్గర ఎక్కువగా వాడుతుంటారు!


పోషకాల నిధి...

* నా శాస్త్రీయనామం ఆలియమ్‌ సీపా.
*
నాలో ‘సి’ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది.
*
పీచుపదార్థం (ఫైబర్‌), ఫోలిక్‌యాసిడ్‌, కాల్షియం, ఐరన్‌, ప్రొటీన్లూ ఉంటాయి.
*
తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. కొవ్వు(ఫ్యాట్‌) అసలే ఉండదు.
*
నాలో సల్ఫర్‌ (గంధకం) కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నన్ను కోసేటప్పుడు మీకు కన్నీళ్లు వస్తాయి.


బ్యాక్టీరియాను ఆకర్షిస్తాను...

* నేను చూడటానికి మాములుగానే కనిపిస్తాను. పొరలు పొరలుగా ఉంటాను. సాధారణంగా 30 రోజులకు మించి నిల్వ ఉండను.
*
కానీ నా గురించి మీకో విషయం తెలుసా?! నాలో ఉండే కొన్ని రసాయనాలు బ్యాక్టీరియాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. తర్వాత అవి నా ఘాటుకు చనిపోతాయి. బ్యాక్టీరియా పరిమితికి మించి పెరిగితే మాత్రం నా ఆటకట్టుతుంది.
*
అందుకే అప్పుడు నల్లగా మారి పాడైపోతాను.
*
పొడిగా, చల్లగా, చీకటిగా ఉండే, గాలి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో నన్ను నిల్వ చేస్తుండాలి.
*
నా పొట్టును మీరు ఎందుకూ పనికిరాదు అని పడేస్తుంటారు కానీ.. దాన్ని కొన్ని దేశాల్లో సహజ సిద్ధమైన రంగుల తయారీకి వాడుతుంటారు. వీటిని వస్త్ర పరిశ్రమలో అద్దకం కోసం ఉపయోగిస్తుంటారు.
*
మీకు ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి మాత్రమే తెలుసు.. నిజానికి నాలో మూడో రకమూ ఉంది. అదే పసుపు ఉల్లి.
*
నన్ను పెంచడానికి విత్తనాలుగా ఉల్లిపాయలు, గింజలనూ వాడవచ్చు.


మీ ఇంట్లోనూ పెంచుకోవచ్చు!

* ‘ఉల్లి ధరలు పెరిగాయ్‌.. పెరిగాయ్‌..’ ఎక్కడ చూసినా.. ఇదే వినిపిస్తోంది కదా! మీ ఇంటి పెరట్లో... లేదా చిన్న కుండీలోనైనా నన్ను ఎంచక్కా పెంచేయొచ్చు.
*
అన్ని రకాల నేలల్లోనూ నేను పెరుగుతాను.
*
మరీ ఎక్కువ కాకుండా.. కొద్దికొద్దిగా నీరు అందిస్తే చాలు నేను ఎంచక్కా పెరిగేస్తా.
*
ఓ సారి నన్ను పెంచేందుకు మీరూ ప్రయత్నించి చూడండి.

సరే ఉంటా మరి..!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.