close

తాజా వార్తలు

ప్రపంచాన్ని చుట్టేసి రండి!

కెరియర్‌ గైడెన్స్‌ - మర్చంట్‌ నేవీ

మొన్న ఉల్లి ధరలు ఉట్టికెక్కాయి.. నిన్న కొంత దిగొచ్చాయి.. ఎలా? విదేశాల నుంచి దిగుమతి కావడంతో కాస్తంత ధరలు తగ్గాయి. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు? ఒక్క ఉల్లిపాయలే కాదు.. లక్షల టన్నుల్లో సరుకుల రవాణా ఒక దేశం నుంచి మరో దేశానికి రోజూ జరుగుతూనే ఉంటుంది. పప్పులు, ఉప్పులు.. దినుసులు, దుంపలు మొదలు.. వీట్‌, మీట్‌, కెఎఫ్‌సీ లెగ్‌ పీసులు సహా.. కార్లు, కూరగాయలు, రంగులు, రసాయనాలతోపాటు.. అన్నీ ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. వేలమంది ఉద్యోగులు ఈ బాధ్యతలను నిర్వహిస్తుంటారు. అధిక వేతనాలతోపాటు ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశాలను అందుకోవాలంటే మర్చంట్‌ నేవీ కోర్సులు చేయాలి.

ప్రపంచ వర్తకం మొత్తం నౌకా రవాణా పరిశ్రమపైనే ఆధారపడి నడుస్తోంది. 90 శాతానికి పైగా సరుకుల రవాణా జలమార్గం ద్వారా జరుగుతోంది. ఈ విభాగానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 53 వేలకు పైగా మర్చంట్‌ షిప్పులు సేవలను అందిస్తున్నాయి. ఇవి లక్షల టన్నుల బరువులను దేశాలకు, ఖండాలకు సునాయాసంగా చేరవేస్తున్నాయి. ఇందుకోసం సుశిక్షితులైన సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ రంగంలో ఉద్యోగాలు పొందాలంటే కొన్ని కోర్సులు చేయాలి. వీటికి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలతో మర్చంట్‌ నేవీలో రకరకాల కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి.వీటిని పూర్తి చేసిన వెంటనే ఆకర్షణీయ వేతనాలు, సౌకర్యాలతో అవకాశాలను సొంతం చేసుకోవచ్ఛు సంపాదనపై పన్నులు ఉండకపోవడం అదనపు సౌకర్యం. విధుల్లో భాగంగా ప్రపంచాన్నీ చుట్టిరావచ్ఛు.

మూడు విభాగాల్లో..!

నౌకలకు సంబంధించి డెక్‌, ఇంజిన్‌, రాటింగ్‌ అని మూడు విభాగాలుంటాయి. కెప్టెన్‌ పర్యవేక్షణలో నౌక నడుస్తుంది. ఇతడు డెక్‌ విభాగానికి చెందుతాడు. తర్వాత చీఫ్‌ ఆఫీసర్‌, సెకండ్‌ ఆఫీసర్‌, థర్డ్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఇంజిన్‌ విభాగంలో చీఫ్‌ ఇంజినీర్‌, సెకండ్‌ ఇంజినీర్‌, థర్డ్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా అంతా సహాయక సిబ్బంది. వారు రాటింగ్‌ విభాగం కిందికి వస్తారు. నౌక సవ్యంగా ముందుకు వెళ్లడానికి ఈ మూడు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. ఓడ సరైన మార్గంలో వెళ్లే విధంగా డెక్‌ ఆఫీసర్లు చూసుకుంటారు. ఇంజిన్‌ విభాగాన్ని ఇంజినీర్లు పర్యవేక్షిస్తారు. రాటింగ్‌ సిబ్బంది మిగతా సహకార బాధ్యతలు చేపడతారు. పెద్ద నౌకల్లో వెయ్యి మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ప్రైవేటు సంస్థలతోపాటు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి.

కోర్సులు.. ఉద్యోగాలు

* బీఎస్సీ: మారిటైమ్‌ సైన్స్‌, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌, నాటికల్‌ సైన్స్‌

* బీటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, ఓషన్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్‌

* బీబీఏ: షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ రిటైల్‌ అండ్‌ ఈ-కామర్స్‌

* ఎంబీఏ: పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌

* ఎల్‌ఎల్‌బీ: మారిటైమ్‌ లా

* ఎమ్మెస్సీ: కమర్షియల్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌

* డిప్లొమా: నాటికల్‌ సైన్స్‌

* పీజీ డిప్లొమా: మెరైన్‌ ఇంజినీరింగ్‌

ఏ సంస్థలో చదువుకున్నప్పటికీ కోర్సు పూర్తయిన తర్వాత షిప్‌లో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ అందుతుంది. తక్కువ విద్యార్హతతో చేరినప్పటికీ ప్రారంభంలోనే రూ.40,000 నుంచి రూ. 50,000 వేతనం లభిస్తుంది. శిక్షణ అనంతరం రూ.90,000కు పైగా వేతనం పొందవచ్ఛు ఇంజినీర్లు ప్రారంభంలో రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు, రెండుమూడేళ్ల తర్వాత రూ.లక్షన్నరకు పైగా జీతం అందుకుంటారు. థర్డ్‌ ఆఫీసర్‌గా చేరినవాళ్లు కెప్టెన్‌ హోదా పొందడానికి 11 ఏళ్లు పడుతుంది.

నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, హార్బర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చేసినవారూ మర్చంట్‌ నేవీలో సేవలు అందించవచ్ఛు

(వివిధ కోర్సులు, అర్హతలు, విధుల్లో చేరిన తర్వాత నిర్వహించే బాధ్యతల వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు)

అందిస్తున్న సంస్థలు

భారత ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మెరైన్‌ షిప్పింగ్‌ ఆధ్వర్యంలో దేశంలో వివిధ సంస్థలు మెరైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. సంస్థలు, కోర్సుల వివరాలకు https://www.dgshipping.gov.in/ , www.imu.edu.in చూడవచ్ఛు కొన్ని సంస్థలు జేఈఈ ర్యాంకుతో బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటున్నాయి. ఇతర సంస్థలు పదో తరగతి విద్యార్హతతో సాధారణ ఉద్యోగాల (రాటింగ్‌)కు సంబంధించిన కోర్సులు అందిస్తున్నాయి.

ఎంబీఏ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఇండియన్‌ మారిటైం వర్సిటీ 2008 నవంబరు 14న కేంద్రప్రభుత్వ నౌకాయాన శాఖ ఆధ్వర్యంలో చెన్నై ప్రధాన కేంద్రంగా ప్రారంభమైంది. కోచి, కోల్‌కత, ముంబయి, నవీ ముంబయి, విశాఖపట్నాల్లో క్యాంపస్‌లున్నాయి. వీటిలో మారిటైం స్టడీస్‌, ట్రెయినింగ్‌ రిసెర్చ్‌, ఓషనోగ్రఫీ, మారిటైం హిస్టరీ, మారిటైం లా, మారిటైం సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టేషన్‌, డేంజరస్‌ కార్గో, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఎంబీఏ, డీఎన్‌ఎస్‌ (డిప్లొమా ఇన్‌ నాటికల్‌ సైన్స్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. కోర్సు అందుబాటులో ఉన్న అన్ని క్యాంపస్‌లకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

* ఎంబీఏ: ● పోర్టు అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌. ● ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌. వీటి కాలవ్యవధి రెండేళ్లు.

* డీఎన్‌ఎస్‌: డిప్లొమా ఇన్‌ నాటికల్‌ సైన్స్‌. వ్యవధి ఏడాది.

* అర్హత: ఎంబీఏ కోర్సులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ, 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీల్లో ఇంగ్లిషులో50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.

డీఎన్‌ఎస్‌కు ఎంపీసీలో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బీఎస్సీ (ఎంపీసీ) లేదా ఫిజిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ 60 శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. లేదా ఐఐటీలు/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో బీఈ/బీటెక్‌ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. వాటితోపాటు అభ్యర్థులు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీల్లో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.

వచ్చే ఏడాది ప్రవేశపరీక్ష

ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష రాయాలి. దేశవ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలున్నాయి. అవి- బెంగళూరు, భోపాల్‌, చెన్నై, కోచి, గువాహటి, హైదరాబాద్‌, జయపుర, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, పాట్నా.

ఎంబీఏ ప్రవేశ పరీక్షలో 120 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

డీఎన్‌ఎస్‌ ప్రవేశ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ (ఇంటర్‌ స్థాయి)ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కులు లేవు.

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, డీఎన్‌ఎస్‌ కోర్సులకు జనవరి 4, 2020న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఫీజు చెల్లించేందుకు,ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోడానికి గడువు: 13-12-2019.

- న్యూస్‌టుడే, సబ్బవరం, విశాఖపట్నం జిల్లా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.