close

తాజా వార్తలు

‘మనీ మేక్స్‌ మనీ’ పేరుతో భారీ సైబర్‌ మోసం 

 

ఏపీ రాజధాని ప్రాంతంలో రూ.13 కోట్లకు టోకరా 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  వేలాదిగా బాధితులు 

ఈనాడు - విజయవాడ

‘మనీ మేక్స్‌ మనీ’ పేరుతో భారీ సైబర్‌ మోసం 

ఊరించే ఆఫర్‌ను ఎర వేశాడు. అధిక వడ్డీ ఆశ చూపాడు. అంతే జనం అతని గురించి ఇతర విషయాలు ఏమీ ఆలోచించకుండానే పొలోమంటూ ఎగబడి డబ్బులు కట్టారు. మరి కొందరు భారీగా పెట్టుబడి పెట్టారు. ఇంకొందరు ఉన్న డబ్బుకు తోడు అప్పులు చేసి మరీ కట్టారు. తీరా చూస్తే బోర్డు తిప్పేసి వేలాది మందిని రూ.కోట్లలో ముంచి పరారయ్యాడు. అతని ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విశేషాలపై ఈనాడు ప్రత్యేక కథనం.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కొనగంటి వంశీకృష్ణ(28) ఐటీఐ చదివాడు. గత ఏడాది జూన్‌లో ‘మనీ మేక్స్‌ మనీ’ పేరుతో ఓ బ్లాగ్‌ రూపొందించాడు. తర్వాత ఇదే పేరుతో యూ ట్యూబ్‌లో ఛానల్‌ ప్రారంభించాడు. ఎక్కడా తన ఫొటో కానీ, వివరాలు కానీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

రెట్టింపు ఆశచూపి ఎరవేసి.. తన వద్ద డబ్బు పెట్టుబడి పెడితే.. దానిని రెట్టింపు చేసి ఇస్తానని ఛానల్‌ ద్వారా ప్రచారం చేశాడు. ఎక్కువ మందిని ఆకట్టుకోవడానికి ప్రత్యేక పథకాలు ప్రకటించాడు. 
పథకాలు ఇలా: 90 రోజుల పథకం ఒకటి. దీనిలో రూ. 5 వేల నుంచి రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెడితే 90 రోజుల్లో రెట్టింపు ఇస్తానని నమ్మబలికాడు. రూ. 5 వేలు డిపాజిట్‌ చేస్తే, రోజుకు రూ. 100ల చొప్పున 90 రోజుల్లో రూ. 9వేలు ఇచ్చాడు. చెల్లింపుల కోసం బ్యాంకు ఖాతాలు, ఫోన్‌పే, పేటీఎంలో ఖాతాలు తెరిచాడు. వాటి ద్వారా పెట్టుబడులు స్వీకరించాడు.

బోనస్‌ కూడా: ఎక్కువ మందిని చేర్చుకునేందుకు రెఫరెన్స్‌ బోనస్‌ కూడా ప్రకటించాడు. అప్పటికే చేరిన వ్యక్తి మరొకరిని పరిచయం చేస్తే రూ.500లు చెల్లించాడు. దీంతో ఒక్కసారిగా మదుపర్లు పెరిగిపోయారు. డబ్బు టంఛనుగా చెల్లిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. 2018, నవంబరులో 45 రోజుల పథకాన్ని ప్రకటించాడు. పెట్టిన పెట్టుబడిని కేవలం 45 రోజుల్లోనే ఇస్తానని నమ్మించాడు. దీంతో అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బును అతడి ఖాతాల్లో వేశారు.

చాప చుట్టేశాడు: అతనికి ఒకేసారి భారీగా అంటే రూ.13 కోట్లు వచ్చి పడ్డాయి. దీనితో డిసెంబరు 19న చాపచుట్టేశాడు. తొలుత.. బ్లాగ్‌ను మూశాడు. అనంతరం యూ ట్యూబ్‌ ఛానల్‌ను కూడా మూసి కనిపించకుండా పోయాడు. 
ఎందరో బాధితులు: వంశీ కృష్ణ చేతిలో మోసపోయిన వారు ఆంధ్రతో పాటు, తెలంగాణ, కర్ణాటకలోనూ ఉన్నారు. దాదాపు 2 వేల మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిపై ఇప్పటికే హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలోని కృష్ణలంక స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

మాయమాటలు చెప్పి.. ప్రారంభంలో చాలా మంది వంశీకృష్ణ గురించి వివరాలు అడిగితే తాను నిజాయతీ పరుడినని, వచ్చిన పెట్టుబడులను షేర్‌ మార్కెట్లు, ఫారెక్స్‌ ట్రేడింగ్‌, తదితర మార్గాలలో పెట్టనున్నట్లు నమ్మించాడు. వచ్చిన లాభాలతో అందరికీ డబ్బు చెల్లిస్తున్నట్లు చెప్పేవాడు. తనకు అమెరికా చెందిన ఓ ఆర్థికవేత్త సలహాలు ఇస్తుంటాడని నమ్మబలికాడు. దీంతో అందరూ గుడ్డిగా విశ్వసించారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యువకులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, బాధితుల జాబితాలో ఉన్నారు. ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి.

బాధితుల్లో కొందరు: విజయవాడకు చెందిన పోలీసు శాఖలోని ఓ ఉద్యోగి రూ. 6.65లక్షలు చెల్లించగా.. ఆయనకు రూ. 60 వేలు మాత్రమే వెనక్కి వచ్చాయి. తొలుత రూ.5 వేలు చెల్లించాడు. సక్రమంగా డబ్బు వేస్తుండడంతో నవంబరులో.. రూ. 10 వేలు, రూ. 50 వేలు, డిసెంబరులో రూ. 1.60 లక్షలు, రూ. 60 వేలు, రూ. లక్ష, రూ. లక్ష, రూ. 70వేలు, రూ. 50వేలు, రూ. 30 వేలు,.. ఇలా పలు దఫాలు డబ్బులు డిపాజిట్‌ చేశాడు. తన వద్దనున్న నగదుకు తోడు రూ.2ల వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. తీరా మోసపోయానని గ్రహించి కృష్ణలంక స్టేషనులో ఫిర్యాదు చేశాడు.

పెనమలూరు స్టేషను పరిధిలోని ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి రూ. 4.50 లక్షలు చెల్లించాడు. ఈ యువకుడు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా తన వద్ద ఉన్న పొదుపు సొమ్ము కొంత, అప్పు చేసి మరికొంత పెట్టుబడిగా పెట్టాడు. నిండా మునిగిపోవడంతో ఏమి చేయాలో తోచక లబోదిబోమంటున్నాడు.

నిశితంగా శోధన.. విజయవాడలో కేసు నమోదు కావడంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వంశీకృష్ణ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. దీని కోసం కృష్ణలంక పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు దఫాలు నిందితుడి సొంతూరు నంద్యాలకు వెళ్లి వచ్చారు. అతడి తల్లిదండ్రులను విచారణ కోసం నగరానికి తీసుకొచ్చారు. కొన్నాళ్ల నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లాడో తెలియదని వారు చెప్పారు. వారిని ఎంత విచారించినా వివరాలు వెల్లడించడం లేదు. తమ కుమారుడు బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలలో ఉద్యోగం చేస్తున్నట్లు మాత్రమే తమకు చెప్పేవాడని, అంతకు మించి తెలియదని అన్నారు. నిందితుడికి చెందిన ఫోన్‌ రెండు ఫోన్‌ నెంబర్లు పనిచేయడం లేదు. అతడి కాల్‌డేటా పరిశీలించగా.. మూడు నెంబర్లకు ఎక్కువ కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఆ నెంబర్లు కూడా పనిచేయడం లేదు.

బ్యాంకు ఖాతాల గుర్తింపు: నిందితుడి బ్యాంకు ఖాతాలపై పోలీసులు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని ఎస్‌ బ్యాంకులో రూ. 33 లక్షలు, నంద్యాలలోని ఆంధ్రా బ్యాంకులో రూ. 10 లక్షలు, ఇదే పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంకులో రూ. 2.50 లక్షలు ఉన్నట్లు గుర్తించి ఆ ఖాతాలను స్తంభింపజేశారు. వంశీకృష్ణ సిమ్‌లు వాడిన మొబైల్‌ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను తీసుకున్నారు. దాదాపు 15 సెల్‌ఫోన్లను మార్చినట్లు గుర్తించారు. అతడి ఫేస్‌బుక్‌లోని ఖాతాలో ఫొటో దొరికింది. దీని ద్వారానే వివరాలు సేకరిస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.