close

తాజా వార్తలు

‘మీరు ప్రతిభావంతులు.. ఉద్యోగం ఇప్పిస్తాం’

నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్‌ నేరస్థులు
రూ.లక్షలు దండుకుని మొహం చాటేస్తున్న వైనం
ఈనాడు, హైదరాబాద్‌

‘మీరు ప్రతిభావంతులు.. ఉద్యోగం ఇప్పిస్తాం’

కొలువులు సాధించాలన్న నిరుద్యోగుల ఆశలను సైబర్‌ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. బహుళజాతి సంస్థలు.. ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ ప్రైవేటు వెబ్‌సైట్లలో నిరుద్యోగ యువతీ యువకులు వారి అర్హతలను నమోదు చేయగానే.. సైబర్‌ నేరస్థులు రంగంలోకి దిగుతున్నారు. ఉద్యోగార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించి వారికి నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. ‘మీరు చాలా ప్రతిభావంతులు. మీకున్న అర్హతలను పలు కంపెనీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు పరిశీలించాయ్‌. మీకు ఇష్టమైన కంపెనీలో చేరండి’ అంటూ చెబుతున్నారు. దిల్లీ.. నోయిడా కేంద్రాలుగా ఈ సైబర్‌ నేరాలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్‌ చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. నగదు జమ చేయాలని కోరితే.. ఒక్క రూపాయి జమ చేయవద్దని, నిందితుల చరవాణి నంబర్లను తమకు ఇవ్వాలంటూ సూచించారు.

  రూ.13.07లక్షలు స్వాహా
షైన్‌ డాట్‌కాంలో అర్హతలను నమోదు చేసిన ఒక యువతి నుంచి దిల్లీకి చెందిన సైబర్‌ నేరస్థులు ఆమెను ఏడాది పొడవునా నమ్మించి మోసం చేశారు. వేర్వేరు కారణాలు.. కంపెనీ అవసరాల పేరుతో బాధితురాలి నుంచి రూ.13.07లక్షలు స్వాహా చేశారు. సైబర్‌ నేరస్థులు తమను మోసం చేశారని చివరలో గ్రహించిన యువతి బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తాన్‌బజార్‌లో నివాసం ఉంటున్న యువతి 2017 డిసెంబరులో తన విద్యార్హతలను నమోదు చేసింది. 2018 జనవరిలో దిల్లీ నుంచి కుమార్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీ విద్యార్హతలను పలు కంపెనీలకు పంపించామని, అకౌంట్స్‌ మేనేజర్‌ ఉద్యోగం ఇస్తామని మూడు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పాడు. మూడు కంపెనీల్లో ఒక కంపెనీని ఎంపిక చేసుకోవాలని, ఉద్యోగం ఇప్పించినందుకు తమకు రూ.1.5లక్షలు ఇవ్వాలని సూచించాడు. కుమార్‌ చెప్పిన మాటలను నమ్మిన యువతి రూ.1.5లక్షల నగదును అతడు సూచించిన ఖాతాలో జమచేసింది. అప్పట్నుంచి కుమార్‌, దినకర్‌, సుస్మిత కలసి దశలవారీగా బాధితురాలి నుంచి నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ జమచేయించుకున్నారు. ఉద్యోగం ఎప్పుడు ఇప్పిస్తున్నారని బాధితురాలు గట్టిగా నిలదీయగా... ‘సిరాజ్‌, రేణు’ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ గతనెలలో చెప్పారు. నియామక పత్రం ఇస్తాం రూ.70వేలు ఇవ్వండి అంటూ కోరారు. డిసెంబరు నెలాఖరులో ఆమె రూ.70వేల నగదు బదిలీ చేసింది. ఇక అప్పట్నుంచి నిందితులు ఆమెకు ఫోన్‌ చేయలేదు. ఆమె ఫోన్‌ చేస్తే ముగ్గురి ఫోన్లు పనిచేయలేదు.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన..
ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకంలో స్వచ్ఛంద కార్యకర్తగా ఉద్యోగం ఇప్పిస్తామంటూ దిల్లీలో నివాసం ఉంటున్న సైబర్‌ నేరస్థులు కరణ్‌, రాజేష్‌, రాకేష్‌లు హుమయూన్‌ నగర్‌కు చెందిన ఒక యువతిని మోసం చేసి రూ.1.69లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. కరణ్‌, రాజేష్‌ పదిహేను రోజుల క్రితం ఆమెకు ఫోన్‌ చేసి.. తాము కేంద్ర ఆరోగ్యశాఖ అనుబంధ సంస్థలకు ఒప్పంద ప్రాతిపదికన మెట్రో నగరాల్లో స్వచ్ఛంద కార్యకర్తలను సమకూర్చుతున్నామని ఆమెకు చెప్పారు. హైదరాబాద్‌లో స్వచ్ఛంద కార్యకర్తగా విధులు నిర్వహిస్తే నెలకు గౌరవ పారితోషికం కింద రూ.50వేలు ఇస్తామని వివరించారు. ఇందుకు తమ సంస్థలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, రెండు నెలల పారితోషికం ధరావతుగా చెల్లించాలని వివరించారు. కరణ్‌, రాజేష్‌ మాటలను నమ్మిన యువతి.. వారు సూచించిన విధంగా రూ.1.10లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసింది. రెండోరోజుల తర్వాత ఫోన్‌ చేసి ఇంకా రూ.59వేలు చెల్లించాలన్నారు. ఆమె అదేరోజు రూ.59వేలు నగదు బదిలీ చేసింది. జన్‌ ఆరోగ్య పథకం కార్యకర్తగా ఎప్పటి నుంచి విధులు నిర్వహించాలని బాధితురాలు రెండు రోజుల క్రితం ఫోన్‌ చేయగా.. స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన ఆమె మంగళవారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.