close

తాజా వార్తలు

ఇల్లు కొనాలా? ఫండ్ల బాట పట్టండి..

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. ఇదొక్కటే కాదు.. ఆస్తులను కూడబెట్టుకునేందుకూ ఫండ్లలో పెట్టుబడులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా జీవితంలోనే అతి పెద్ద పెట్టుబడి, ఓ కలగా భావించే సొంతిల్లు కోసం. సరైన ప్రణాళిక, ఏ పథకంలో మదుపు చేయాలన్న విషయంలో స్పష్టత ఉంటే చాలు. పెద్ద లక్ష్యాన్నీ సులువుగానే సాధించవచ్చు.

నెలనెలా ఇంటి అద్దె చెల్లిస్తున్నప్పుడల్లా.. మనకూ ఓ సొంతిల్లు ఉండాలన్న ఆలోచన మనస్సును తొలుస్తూనే ఉంటుంది.అందుబాటులో ఉన్న ఇళ్ల ధరలు, సులువుగా దొరుకుతున్న గృహరుణాలు.. ఇలా ఎన్నో అవకాశాలు మన కళ్లముందు ఉన్నాయి. ముఖ్యంగా మరో ఐదేళ్లలో ఇల్లు కొనాలనే ఆలోచన ఉన్నప్పుడు దానికోసం మనం    ఎలా సిద్ధం అవ్వాలి అనే విషయంలో కాస్త ప్రణాళికతో ఉండాలి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలతో ఈ ముందస్తు చెల్లింపు మొత్తాన్ని సిద్ధం చేసేందుకు మంచి ప్రణాళిక ఉంది.

ఆలోచన రాగానే..
ఇల్లు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత, దాని గురించి పెట్టుబడి పెట్టడమూ ప్రారంభించాలి. మీరు కొనబోయే ఇల్లు ఎంత ఉంటుంది? దానికి ఎంత సొమ్ము మీ చేతి నుంచి పెట్టాలి? ఎంత రుణం తీసుకోవాలి? దానికి ఎంత ఈఎంఐ చెల్లించాలి? ఇలా అన్ని విషయాల గురించీ తెలుసుకోవాలి. మీరు ఇల్లు కొనాలనుకుంటే 20శాతం వరకూ మీ చేతి నుంచి భరించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐ చెల్లిస్తారు కదా.. ఆ ఈఎంఐ ఇప్పుడే చెల్లిస్తున్నట్లు భావించి, అందులో నుంచి అద్దె మొత్తం పోను.. మిగతా దాన్ని మదుపు చేసేందుకు ప్రయత్నించాలి.

పెట్టుబడి ఎలా?
మీరు ఇల్లు కొనేందుకు ఏడాదిలోపే సమయం ఉందనుకోండి.. అప్పుడు మీ దగ్గరున్న డబ్బును పెట్టుబడి పెట్టేందుకు లిక్విడ్‌ లేదా మనీ మార్కెట్‌ ఫండ్లను పరిశీలించాలి. ఈ ఫండ్లలో హెచ్చుతగ్గులు అంతగా ఉండవు. పెట్టుబడికి ఎక్కువ నష్టభయం ఉండకూడదు కాబట్టి, తక్కువ నష్టభయంతో ఉన్న ఈ ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం.

* సాధారణంగా ఇల్లు కొనాలనుకునే వారు 3-5 ఏళ్ల ముందే ప్రణాళిక వేసుకుంటారు. ఇలాంటి వారు ముందస్తు చెల్లింపు కోసం ఏర్పాటు చేసుకున్న మొత్తాన్ని కొద్దిగా ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకు కేటాయించవచ్చు. కనీసం రెండు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకొని, గ్రోత్‌ ఆప్షన్‌ ఎంచుకొని, సిప్‌ ప్రారంభించాలి.

* మార్కెట్‌ దిశతో సంబంధం లేకుండా సిప్‌లో మదుపు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల లభించే సగటు ప్రయోజనం మనకు లాభిస్తుంది. మార్కెట్‌ తగ్గినప్పుడు మనకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్‌ పెరిగినప్పుడు వాటి ధర పెరిగితే మనకు లాభాలు వస్తాయి. మార్కెట్‌ హెచ్చుతగ్గులే మనకు అధిక రాబడిని తెస్తాయని గుర్తించుకోవాలి. సిప్‌ చేయడం ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు కూడా. ఒకేసారి పెట్టుబడి పెట్టడం కన్నా.. ఇదే మేలు.

* కొంచెం నష్టభయం భరించగలిగినా.. డెట్‌ ఫథకాలకు కూడా కొంత కేటాయించడం మేలు. దీనికి బ్యాలెన్స్‌డ్‌ లేదా హైబ్రీడ్‌ ఫండ్లు ఉపయోగపడతాయి. ఈ ఫండ్లు పూర్తి ఈక్విటీ ఫండ్లలాగా రాబడినివ్వకపోవచ్చు. కానీ, అంత వేగంగా నష్టపోవు కూడా.

* ఐదేళ్ల వరకూ సమయం ఉన్నప్పుడు.. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) చూడొచ్చు. వీటివల్ల పన్ను మినహాయింపు లభిస్తుంది. వీటికి మూడేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించడాన్ని ఇవి తప్పనిసరి చేస్తాయి.

ఒకవేళ ఈక్విటీ ఫండ్లలోనే మదుపు చేయాలని భావించినప్పుడు.. లార్జ్‌ క్యాప్‌ ఫండ్లపై దృష్టి పెట్టండి. ఇంకా రెండేళ్ల సమయం ఉందనగానే.. ఆ మొత్తాన్ని క్రమానుగతంగా డెట్‌ ఫండ్లకు మళ్లించండి. ఇలా చేయడం వల్ల తక్కువ నష్టభయం ఉంటుంది. ఏడాది సమయం ఉన్నప్పుడే పూర్తి లిక్విడ్‌ ఫండ్లలోకి పెట్టుబడి మార్చండి. సరైన సమయం రాగానే మొత్తం డబ్బును వెనక్కి తీసుకొని, మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.