close

తాజా వార్తలు

బహుమతుల ఎర.. దోపిడీకి వల! 

సైబర్‌ నేరస్థుల మాయాజాలం 
వెబ్‌సైట్‌ ద్వారా వస్తువులు కొనే వారికి ఫోన్లు 
లక్కీడిప్‌లో కారు వచ్చిందంటూ రూ.లక్షల నగదు బదిలీ

‘సర్‌... నేను షాప్‌క్లూస్‌ ప్రతినిధిని... మీరు కొద్దిరోజుల క్రితం మా వెబ్‌సైట్‌ ద్వారా వస్తువులను కొన్నారు.. మా కంపెనీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు లక్కీడిప్‌ తీసి వినియోగదారులకు కారు బహుమతిగా ఇస్తున్నాం. ఈసారి మీకు వచ్చింది. 24 గంటల్లో  మీ చిరునామా, వివరాలు దగ్గర్లో కార్ల షోరూం ఎక్కడ ఉందో చెబితే.. కారు ఇచ్చేస్తాం..’ అంటూ నమ్మించి సైబర్‌ నేరస్థులు  బాధితుల నుంచి లక్షలు కాజేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

కారు ఆశ చూపి  రిజిస్ట్రేషన్‌, ఇతర రుసుముల పేరుతో రూ.లక్షల నగదును నేరగాళ్లు బదిలీ చేయించుకుంటున్నారు  మూడు నెలల వ్యవధిలో 40 మంది తాము మోసపోయామంటూ నగర సైబర్‌క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేశారు. వీరిలో ఒక్కొక్కరూ రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ నేరస్థులు సూచించిన ఖాతాల్లో బాధితులు జమచేశారు.   ఫోన్‌నంబర్ల ఆధారంగా వచ్చిన  కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా... నేరస్థులు దిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో ఉన్నట్టు  వెల్లడైంది. అక్కడి నుంచే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని దిల్లీ, బిహార్‌ పోలీస్‌ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. ప్రధానంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలు లక్ష్యంగా ఇలాంటి మోసాలకు తెరలేపారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మధ్య తరగతి వారికి కారు అవసరంగా మారిన నేపథ్యంలో బహుమతిగా ఇస్తాం అంటే మోసపోతారన్న కచ్చితమైన అంచనాతోనే నేరస్థులు ఇన్నోవా, మహీంద్రా, టాటా సఫారీ కార్ల పేర్లతో మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వివరించారు.

షాప్‌ క్లూస్‌... హోం18... నాప్‌టాల్‌.. 
ఒకటి కొంటే ఒకటి ఉచితం...  ఒక ఫ్రిజ్‌ కొంటే మరొకటి ఉచితంగా ఇస్తాం అంటూ కొన్ని కంపెనీలు రాయితీలను ప్రకటిస్తున్నాయి.. ఈ రాయితీలను అధ్యయనం చేసిన సైబర్‌ నేరగాళ్లు  ఉచితంగా వచ్చే  బహుమతులపై ప్రజలకున్న బలహీనతను సొమ్ము చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దశలవారీగా ఏవో రుసుములంటూ రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. షాప్‌ క్లూస్‌,  హోం 18, నాప్‌టాల్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా కొనుగోలు చేసే వారి వివరాలను, ఫోన్‌ నంబర్లను కొరియర్‌ ఇచ్చే సిబ్బంది,  ఇతర ప్రైవేటు సంస్థల నుంచి సేకరిస్తున్నారు. తర్వాత  ఫోన్‌ చేసి కొనుగోలుదారులకు తీసిన లక్కీ డిప్‌లో కారు బహుమతి వచ్చిదంటూ నమ్మిస్తున్నారు నిర్ణీత రుసుం రూ.15వేలు చెల్లించాలని తొలుత చెబుతూ.. అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వారితోనే సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.  తొలివిడత డబ్బు జమచేశాక రిజిస్ట్రేషన్‌, బీమా, కస్టమ్స్‌ ఖర్చులంటూ చెప్పి రూ.5 లక్షల వరకూ నగదు జమచేయించుకొంటున్నారు. ఎవరైనా బాధితులు తమకు కారు వద్దంటే రూ.12.50 లక్షల నగదు ఇస్తామంటూ మోసగిస్తూ...  కారు రిజిస్ట్రేషన్‌ మాదిరే సొమ్ము తీసుకుంటున్నారు. డబ్బు వారి ఖాతాల్లో జమ కాగానే పోలీసులు దర్యాప్తు చేసినా దొరక్కుండా సిమ్‌కార్డులను నాశనం చేస్తున్నారు.

కారు నిజంగా వస్తుందని... 
షేక్‌పేటలో  నివాసముంటున్న విజయ్‌ సైబర్‌ నేరస్థుల మాటలు నమ్మి  కారు నిజంగా వస్తుందని బంధువులు, సన్నిహితులకు చెప్పాడు. 20 రోజుల క్రితం అతడికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేశాడు. మీరు షాప్‌ క్లూస్‌ నుంచి షాపింగ్‌ చేశారా? అని హిందీలో మాట్లాడగా.. అవును అంటూ చెప్పాడు. వంటగది సామగ్రి కొన్నానంటూ వాటి వివరాలను తెలిపాడు. అనంతరం నేరస్థుడు ఫోన్‌ చేసి  మీకు 12.49 లక్షల విలువైన మహింద్రా ఎక్స్‌యూవీ కారును బహుమతిగా పంపుతున్నామన్నాడు. మాదాపూర్‌లోని షోరూం నుంచి మూడు రోజుల్లో తీసుకోవచ్చని ... ఆధార్‌ నంబరు, ఇంటి చిరునామా చెబితే..   కారు షోరూం నిర్వాహకులకు ఫోన్‌చేస్తానని నమ్మించాడు. విజయ్‌ తన వివరాలను  చెప్పగానే... డిపాజిట్‌  కింద రూ.15 వేలు జమచేయాలన్నాడు.  అతడు  వెంటనే రూ.15వేలు పంపగా.. మరుసటి రోజు ఫోన్‌ చేసి రూ.20వేలు ఇవ్వాలన్నాడు... ఇలా నాలుగురోజుల్లో రూ.2.19 లక్షలు  జమ చేయించుకున్నాడు. తర్వాత కారు ఎప్పుడొస్తుందని ప్రశ్నించేందుకు విజయ్‌  ఫోన్‌ చేయగా నేరస్థుడి ఫోన్‌ పనిచేయలేదు. ఆందోళనతో స్నేహితుడికి  విషయాన్ని వివరించగా ఆయన సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాడు. విజయ్‌  ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌ను కలిసి రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా..  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ-కామర్స్‌ సంస్థలు, వెబ్‌సైట్లలోని ప్రకటనలను సైబర్‌ మాయగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఇన్‌స్పెక్టర్‌  వివరించారు. కొద్దినెలల నుంచి ఈ తరహా మోసాలు మెట్రోనగరాల్లో పెరిగాయన్నారు.

ఉచితంగా కారెలా ఇస్తారు?...: 
కె.సి.ఎస్‌.రఘువీర్‌, అదనపు డీసీపీ(సైబర్‌ క్రైమ్‌) 
ఉచితంగా కారు ఇస్తామని ఎవరైనా చెప్పినా.. వారు ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అని మనం ప్రశ్నించుకోవాలి. భారీ లాభాలొస్తున్న కార్పొరేట్‌, ఆటోమొబైల్‌ కంపెనీలూ ఉచితంగా కార్లు ఇవ్వవు. ఇలాంటి ఫోన్లు వచ్చిన వెంటనే ఎవరైనా సరే.. తార్కికంగా ఆలోచించాలి. ఉచితంగా  ఇస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్‌ రుసుం ఎందుకు? సమీపంలో కార్ల షోరూం వారికి సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేసుంటే... మరి ఆ షోరూం వారు ఎందుకు మనకు  చేయలేదు? తొలుత రూ. వేలతో మొదలుపెట్టి తర్వాత  రూ.లక్షలు  ఎందుకు అడుగుతున్నారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నగదు జమ చేయండి అంటూ ఎవరు ఫోన్‌ చేసినా సరే.. మోసమేనని గుర్తుంచుకోండి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.