close

తాజా వార్తలు

ఏ దేశమేగినా.. ధోనీ చాటిన దేశభక్తి

ముంబయి: దేశభక్తిని చాటిచెప్పిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఒలింపిక్స్‌లో తీసుకొచ్చిన పతకాల గురించి ఇప్పటికీ స్మరించుకుంటాం. హిట్లర్‌ సైతం ఆయన ఆటకు ముగ్ధుడై జర్మనీ పౌరసత్వం తీసుకోవాలని కోరారని చాలా సార్లు చదివాం. ఇక టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అంతే. కడుపులో క్యాన్సర్‌ కణితి తన శక్తిని దహించేస్తున్నా 120 కోట్ల మంది భారతీయుల స్వప్నం నెరవేర్చాలని పట్టుదలగా నిలిచాడు. రెండోసారి భారత్‌కు ప్రపంచకప్‌ అందించాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ కోవకు చెందినవాడే. సమయం వచ్చినప్పుడల్లా తన దేశభక్తిని చాటుకున్నాడు. అలాంటి సందర్భాల్లో మచ్చుకు కొన్ని..

* జాతీయ పతాకం అందుకున్నాడు

న్యూజిలాండ్‌తో టీ20 ఆడుతున్నప్పుడు భద్రత అంచెలను దాటుకొని ఓ వ్యక్తి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అతడి చేతిలో ఉన్న జెండా కిందపడబోతుంటే ధోనీ అందుకున్నాడు. తన సమయ స్ఫూర్తితో అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్నాడు.  

* వీడ్కోలు తర్వాత సైన్యంలో సేవ

ధోనీకి సైన్యంలో సేవలందించడం చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మీడియాకు చెప్పాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత సైన్యంలో చేరతానని పేర్కొన్నాడు. అవకాశం వచ్చినప్పుడుల్లా సైనికులతో కలిసిపోతుంటాడు. భారత సైన్యం ధోనీకి లెఫ్టినెంట్‌ కల్నల్‌ గౌరవ హోదా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో ఆయన పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పురస్కారం అందజేసేటప్పుడు ధోనీ సైనిక దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యపరిచాడు. దేశభక్తిని చాటుకున్నాడు.

* హెల్మెట్‌పై కనిపించని జెండా‌

సాధారణంగా విరాట్‌ కోహ్లీ, సచిన్‌ తెందుల్కర్‌ ఇతర బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు తమ హెల్మెట్లపై మువ్వన్నెల జెండా గుర్తు ఉంచుకుంటారు. అదే ధోనీ హెల్మెట్‌పై మీరు జెండా గుర్తు చూసి ఉండరు. అందుకు ఓ కారణం ఉంది. మహీ వికెట్‌  కీపింగ్‌ చేసే సమయంలో పదేపదే తన హెల్మెట్‌ను కింద పడేస్తాడు. ఓ పక్కన ఉంచుతాడు. జాతీయ జెండా ఎప్పుడూ వినీలాకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతూనే ఉండాలని తన కోరిక. 

* జాతీయ విధులు ముందు

2015 ప్రపంచకప్‌ సమయంలో ధోనీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అప్పుడే అతడి భార్య సాక్షి బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అందరు తండ్రులు వెంటనే అక్కడ వాలిపోయి గారాల పాపాయిని ముద్దాడుతారు. కొందరు మాత్రం ఇందుకు మినహాయింపు. అందులో ధోనీ ఒకడు. జాతీయ విధులపై తాను విదేశాలకు వచ్చానని పూర్తయ్యాకే బిడ్డను చూసేందుకు వెళ్తానని చెప్పాడు. అలాగే చేశాడు. ధోనీ దేశభక్తి గురించి చెప్పేందుకు ఇలాంటి ఘటనలు మరెన్నో ఉన్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.