close

తాజా వార్తలు

మూడో వన్డే ... రెండు జట్లకు కీలకమే

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఓ జట్టు.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలవాలని మరో జట్టు.. ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో శుక్రవారం జరగనున్న మూడో వన్డే ఆసక్తికరంగా మారింది. ఐదు వన్డేల క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆసీస్‌ 2-0తో వెనుకబడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందే సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ విజయ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కోహ్లీసేన మూడో వన్డేలోనూ సమష్టిగా రాణిస్తే గెలుపు తథ్యమే. ప్రపంచకప్‌ కేవలం మూడు నెలల దూరంలో ఉండటంతో రెండు జట్లకూ ఈ సిరీస్‌ కీలకం కానుంది. ప్రపంచకప్‌ ముంగిట సిరీస్‌ విజయం ఎంతో ప్రాధాన్యమైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా వన్డేల్లో వరుస ఓటములు చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్‌, నాగ్‌పూర్‌లలో ఆ జట్టు అన్ని విభాగాల్లో చేతులెత్తేయడంతో పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.

* ఓపెనింగ్‌ సమస్యతో ఉక్కిరిబిక్కిరి..

కంగారూ సారథి ఆరోన్‌ ఫించ్‌ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో జట్టుకు మంచి శుభారంభం దక్కడం లేదు. ప్రపంచకప్‌ దృష్ట్యా జట్టు ఓపెనర్‌ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతనికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు.. మరోవైపు డేవిడ్‌ వార్నర్‌ పరిస్థితి ఇంచుమించు అలాంటిదే. కాబట్టి ఫించ్‌కు మిగిలిన మ్యాచ్‌లన్నీ తాడోపేడో తేల్చుకోవాల్సినవే. మిడిల్‌ ఆర్డర్‌లో గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టోయినీస్‌, హ్యాండ్స్‌కాంబ్‌ ఫరవాలేదనిపిస్తున్నారు. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమవుతున్నారు. అందుకే ఈ మిగిలిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ లయ అందుకోకపోతే కష్టమని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది.

* ప్రయోగాలతో భారత్‌..?

ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్‌ ముందంజలో ఉంది. అయితే కోహ్లీసేన మిగిలిన మూడు మ్యాచుల్లో ప్రయోగాలు చేయాలా లేక గెలిచిన జట్టుతోనే ఆడాలా అనే డైలమాలో పడింది. టీ20ల్లో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. యువ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. వికెట్‌ కీపర్‌గా ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకవేళ రిషబ్‌కు అవకాశం ఇవ్వాలంటే బ్యాట్స్‌మెన్‌గా తీసుకోవచ్చు. టీ20 సిరీస్‌తో పాటు మొదటి రెండు వన్డేల్లో మైదానానికి దూరంగా ఉన్న భువనేశ్వర్‌కుమార్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి. వన్డేలు,టీ20ల్లో భువనేశ్వర్‌ ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించింది లేదు. కాబట్టి భువనేశ్వర్‌ మిగిలిన మూడు మ్యాచులకు జట్టులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా మిగిలిన వన్డేలకు ఆడించే జట్టు విషయంలో యాజమాన్యం.. సిరీస్‌తో పాటు ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకోనుంది. మరోవైపు ధోనీకి రాంచీ సొంతగడ్డ కావడంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.