వికెట్లు విరిగే బంతులు.. బంతులు పగిలిపోయేలా బాదే బౌండరీలు.. బౌండరీల ముందు జిగేల్మనే క్యాచ్‌లు.. ఇలా అన్నింటి మేళవింపు ఐపీఎల్.. సీజన్ ప్రారంభమైంది మొదలు మ్యాచ్‌లన్నీ.. దూసుకెళుతున్న రైలు పెట్టెళ్లా కళ్లు మూసి తెరిచే లోపు వెళ్లిపోతుంటాయి. అయితే కేవలం 4 గంటలు మాత్రమే ఉండే ఈ పొట్టి క్రికెట్లో శతకం బాదడం అంత సులువైన పని కాదు. ప్రపంచంలోని దిగ్గజ బ్యాట్స్‌మెన్ పాల్గొంటున్న ఐపీఎల్.. 11 సీజన్ల చరిత్రలో 656 మ్యాచ్‌లు జరగ్గా నమోదైన సెంచరీలు కేవలం 52 మాత్రమే. అంటే టీ20ల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫార్మాట్‌తో మాకేం పని.. బ్యాటు ఝులిపించడమే మా లక్ష్యం అన్నట్లుగా కొందరు బ్యాట్స్‌మెన్ చెలరేగి శతకాలు నమోదు చేశారు. వాళ్లెవరో ఓ సారి చూద్దాం..
యూనివర్స్ బాస్.. క్రిస్ గేల్
మ్యాచులు : 112, శతకాలు : 6, అత్యధిక పరుగులు : 175*

ఇతర బ్యాట్స్‌మెన్ ఒక శతకం బాదడానికే నానాతంటాలు పడుతుంటే ఈ విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ మాత్రం ఏకంగా 6 శతకాలు బాదేశాడు. 2009లో ఎన్నో అంచనాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గేల్‌ను కొనుగోలు చేసింది. అయితే అంచానాలను అందుకోకపోవడంతో గేల్‌ను ఆ జట్టు వదులుకుంది. 2011లో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి సీజన్లోనే ఏకంగా రెండు శతకాలు బాది తన బ్యాటుకు ఏమాత్రం పదును తగ్గలేదని విమర్శకులకు సంకేతాలు పంపించాడు. అంతటితో ఆగకుండా 2012, 2013 సీజన్లలో ఒక్కో శతకం నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని శతకాలు నమోదు చేసిన మరో బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. 2011లో రెండు శతకాలు, 2012, 2013, 2015లో బెంగళూరు తరఫున మొత్తం ఐదు శతకాలు నమోదు చేశాడు. పుణె వారియర్స్ ఇండియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏకంగా 66 బంతుల్లో 175 పరుగులతో ఐపీఎల్లో సునామీ సృష్టించాడు. అత్యంత వేగవంతమైన శతకం(30బంతుల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు. 2018లో పంజాబ్ జట్టుకు మారిన గేల్ మరో శతకం నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే దాదాపు శతకం దాకా చేరుకున్న గేల్.. తన బ్యాట్ నుంచి ఈసారి కూడా శతకాలు జాలువారనున్నట్లు సంకేతాలు పంపించాడు.
కింగ్ కోహ్లీ... సెంచరీలు
మ్యాచులు : 164, శతకాలు : 4, అత్యధిక పరుగులు : 113
అంతర్జాతీయ క్రికెట్లో వరుస రికార్డులతో దూసుకెళుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మొదటి నుంచీ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు. శతకాల విషయంలోనూ కోహ్లీ భారత ఆటగాళ్లందరికంటే ముందున్నాడు. మొత్తానికి గేల్ తర్వాత నాలుగు శతకాలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ బాదిన నాలుగు శతకాలు మొత్తం 2016లోనే ఉండటం విశేషం. ఆ సీజన్లో కోహ్లీ విజృంభించి ఏకంగా నాలుగు శతకాలతో 973 పరుగులు చేశాడు. ఒక సీజన్లో అన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. అత్యధిక పరుగుల విషయంలోనూ కోహ్లీ 4,985 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
వావ్.. వాట్సన్
మ్యాచులు : 119, శతకాలు : 4, అత్యధిక పరుగులు : 117*
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ సైతం కోహ్లీతో సమానంగా నాలుగు శతకాలు నమోదు చేశాడు. 2018 సీజన్లోనే రెండు శతకాలు బాదేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శతకం బాది చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2013లో అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సమయంలో పుణె జట్టుపై 117 పరుగులు చేశాడు. 2015మరోసారి కోల్‌కతాపై 104 పరుగులు చేశాడు.
మిస్టర్ 360
మ్యాచులు : 142, శతకాలు : 3, అత్యధిక పరుగులు : 133*
దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ ఏబీ డివిలియర్స్.. వార్నర్‌తో సమానంగా మూడు శతకాలు నమోదు చేశాడు. మైదానంలో అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు ఫీల్డింగ్‌లోనూ విన్యాసాలు చేసే ఏబీ ఐపీఎల్లో బ్యాటుతో చేసే విజృంభణ గురించి అందరికీ తెలిసిందే. 2015లో ముంబయి ఇండియన్స్, బెంగళూరు మ్యాచ్‌లో ఏబీ 59 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. అంతకంటే ముందు 2009లో దిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఒక శతకం బాదాడు. 2016లో గుజరాత్ లయన్స్‌పై మరో శతకం బాది మూడు శతకాలు పూర్తి చేశాడు. దూకుడుగా ఆడే డివిలియర్స్ ఏ క్షణంలో శతకం బాదుతాడో ఊహించలేం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ సఫారీ బ్యాట్స్‌మెన్ ఈ ఐపీఎల్ సీజన్లో చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డేంజర్.. వార్నర్
మ్యాచులు : 115, శతకాలు : 3, అత్యధిక పరుగులు : 126
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్లలో ఒకడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్లో మూడు శతకాలు బాదాడు. రెండు సంవత్సరాల పాటు నిషేధానికి గురైన ఈ ఆసీస్ బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్ తరఫున మరోసారి బ్యాట్ ఝులిపించాడు. తొలి మ్యాచ్‌లోనే 85 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 2010 అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వార్నర్ తక్కువ సమయంలోనే 4000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. అరంగేట్రంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై తొలి శతకం నమోదు చేశాడు. దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌పై రెండో శతకం బాదాడు. 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. 2017లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులు చేశాడు.
వీళ్ల తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్ కలమ్, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, గిల్‌క్రిస్ట్, హసీం ఆమ్లా రెండేసి శతకాలు నమోదు చేశారు. ఐపీఎల్ మొత్తంగా 32 మంది ఆటగాళ్లు శతకాలు నమోదు చేశారు. కనీసం ఒక శతకం లేదా అంతకంటే ఎక్కవ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్లలో భారత బ్యాట్స్‌మెన్ 14 మంది ఉన్నారు. వేగవంతమైన శతకాల్లో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో 100 రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 12వ సీజన్లో.. ప్రారంభంలోనే ఆయా జట్ల బ్యాట్స్‌మెన్ తమ బ్యాటుకు పని చెప్పారు. మరి ఈసారి ఎవరెవరు ఎన్ని శతకాలతో అభివాదం చేస్తారో చూడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం