close

తాజా వార్తలు

ముంబయిలో ఆ ఫ్లాట్‌ అద్దె రూ.64 మాత్రమే!

ముంబయి:  ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా ఇళ్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది. ఒకవేళ దొరికినా వాటి అద్దె నెలకు  తక్కువలో తక్కువ కొన్ని వేలల్లోనే ఉంటుంది.  గ్రామాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో అద్దె ఇళ్లకు ఎంత డిమాండు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మన అదృష్టం బాగుండి ఇల్లు కిరాయికి దొరికినా దాని అద్దె మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. కానీ దీనికి విరుద్ధంగా ముంబయి నగరంలోని ఖరీదైన టార్టీయో ప్రాంతంలో ఒక అద్దె అపార్టుమెంటు ఉంది. దాదాపు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందీ ఈ భవనం. ఈ గృహాన్ని అమ్మితే ప్రస్తుత అక్కడ ఖరీదు ప్రకారం ఒక్కో చదరపు అడుగు రూ. 60,000 పైబడి మాటే.. ఇలాంటి భవంతికి నెలవారీ అద్దె వేలల్లోనో, లక్షల్లోనో ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఆ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవునండీ..ఈ ఫ్లాట్‌ అద్దె నెలకు కేవలం రూ.64 మాత్రమే. ఇంత తక్కువ అద్దె అయినా సరే గత 11 సంవత్సరాలుగా ఈ భవనం ఖాళీగా ఉంది.  ఏంటి? ముంబయిలో అంత పెద్ద భవనం అద్దె రూ.64 మాత్రమేనా? అంతే కాకుండా అంత తక్కువ అద్దె అయినా సరే 11 ఏళ్లుగా ఖాళీగా ఉందా? అని ముక్కున వేలేసుకోకండి.. ఇక్కడే ఉంది అసలు విషయం. అదేంటో తెలుసుకుందాం.
పార్శీలకు చెందిన ఆర్‌డీ మహలక్ష్మీవాలా ఛారిటీ బిల్డింగ్‌ ట్రస్ట్‌కు సంబంధించినది ఈ అపార్టుమెంటు. ఈ భవనాన్ని కేవలం పార్శీ పోలీసు అధికారులకు మాత్రమే అద్దెకు ఇవ్వాలని 1940 సంవత్పరంలో ముంబయి పోలీసువారితో ఈ ట్రస్టు ఒక ఒప్పందం కుదుర్చుకుందట! దీని వల్ల ఈ భవనంలో కేవలం పార్శీ పోలీసులు మాత్రమే నివాసం ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే అప్పటి నుంచి పార్శీ కమ్యూనిటీ చెందిన పోలీసు అధికారులు ఈ భవనంలో అద్దెకు నివాసమున్నారు.  ముంబయి నగర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన పార్శీలు కొన్నేళ్ల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ముంబయి నగరంలో ఉపాధి పొందుతూ జీవనం సాగించేవారు. అయితే క్రమేపి ప్రస్తుతం వారి జనాభా తగ్గుతూ వస్తోంది.  ప్రస్తుతం ముంబయి పోలీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పార్శీలు ఉన్నారట! అందులో ఒకరు నగర శివార్లలో విధులు నిర్వహిస్తుండగా, మరొకరికి సొంత ఇల్లు ఉంది. దీంతో గత 11 ఏళ్లుగా ఈ భవనం ఖాళీగా మిగిలిపోయింది. పార్శీలకు కాకుండా వేరేవారికి అద్దెకు ఇవ్వడానికి ఒప్పందం ప్రకారం కుదరదు. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయించడానికి ముంబయి పోలీసువారు ట్రస్టుతో సంప్రదింపులు జరుపుతున్నారు. నగరంలో పార్శీలు కాకుండా ఇతర కమ్యూనిటీకి చెందిన  పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో ఈ భవనాన్ని అద్దెకు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా వారికి ఈ అవకాశం రాలేదు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.