
తాజా వార్తలు
ముంబయి : క్రికెట్ అభిమానులను ఈ రోజు మరో పెద్ద మ్యాచ్ అలరించనుంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రెండు జట్లూ ఈ రోజు పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్లు మూడుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్ వేటలో ముందున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ముంబయి మాత్రం ఎప్పట్లాగే ఓటమితో టోర్నీని ప్రారంభించింది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడిపోయింది. గెలిచిన ఒక్క మ్యాచులోనూ అష్టకష్టాలు పడింది. బౌలింగ్‌లో ఓవైపు బుమ్రా, మరోవైపు మలింగ ఉన్నప్పటికీ ముంబయి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మలింగ సైతం స్వదేశానికి వెళ్లిపోయాడు. ముంబయి జట్టు మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు ఇతర జట్లతో పోల్చి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్‌లో పెద్ద హిట్టర్లు ఎవరూ కనిపించకున్నా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించింది. ధోనీ సారథ్యం ఆ జట్టుకు చాలా ఉపయోగపడుతోంది. మరి ఈ రోజు చెన్నైని అడ్డుకునేందుకు రోహిత్ ఏ వ్యూహాలతో బరిలోకి దిగుతాడో.. అవి ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఈ రోజు రాత్రి 8గంటలకు వాంఖడే వైదికగా జరిగే చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ చూడాల్సిందే.
ఇరుజట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
ముంబయి జట్టు ఓపెనర్‌గా లివీస్ను తీసుకుంటే పవర్‌ప్లేలో బ్యాట్ ఝులిపించి ముంబయికి మంచి ఆరంభం ఇచ్చే అవకాశం ఉంది. కానీ డికాక్ వరుస మ్యాచుల్లో రాణిస్తుండటంతో డికాక్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు జట్టులో అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఇషాన్ భారీషాట్లు కొట్టగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు. కానీ ఆ స్థానంలో ఆడుతున్న యువరాజ్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా.. బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న ఆల్‌రౌండర్ కాబట్టి ఈ మ్యాచ్‌లో ముంబయి ఏ నిర్ణయం తీసుకున్న ఆచితూచి ఆలోచించాల్సి ఉంటుంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కాబట్టి వాళ్లను ఇబ్బంది పెట్టేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో కొంచెం బలహీనంగా కనిపిస్తున్న చెన్నై.. ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్ లేదా సామ్ బిల్లింగ్స్‌ను జట్టులోకి తీసుకొవచ్చు.
రికార్డులు ఏమంటున్నాయంటే..
* గత సీజన్లో ముంబయిలో రెండు జట్లు నాలుగు మ్యాచుల్లో తలపడగా మూడింట్లో చెన్నై గెలుపొందింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ముంబయిదే పైచేయి.
* బ్రావో బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఐదు సార్లు అవుటయ్యాడు.
* వాంఖడే మైదానంలో సురేశ్‌రైనా సగటు 44.91. ముంబయి మీద రైనా 140 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.