close

తాజా వార్తలు

ఐపీఎల్‌ డెత్‌ స్ట్రైకర్స్‌

కళ్లుచెదిరే సిక్సర్లు.. కన్నార్పకుండా అందుకుంటున్న క్యాచ్‌లు.. గింగిరాలు తిరిగే బంతులు.. పేసర్ల వేగానికి ఎగిరిపడుతున్న వికెట్లతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రోజులు గడిచే కొద్దీ జట్ల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒత్తిడి పెరుగుతోంది. దానికి అభిమానుల వేడీ తోడవుతోంది. అద్భుతాలు ఎన్ని జరిగినా పొట్టి క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎంత వేగంగా పరుగులు సాధిస్తున్నాడనే అందరూ తెలుసుకుంటారు. విశ్లేషకులు సైతం స్ట్రైక్‌రేట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. 12వ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ముగిసే సరికి డెత్‌ ఓవర్లలో ఏ ఆటగాళ్లు స్ట్రైక్‌రేట్‌ పరంగా ముందున్నారో తెలుసుకుందామా?

‘పవర్‌’ప్లేలో తగ్గుదల

ఒకప్పుడు ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో పరుగుల వరద పారేది. సిక్సర్ల వర్షం కురిసేది. ఎక్కువ మంది ఫీల్డర్లు అంతర్‌ వృత్తంలో ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ బంతుల్ని గాల్లోకి పంపేవారు. రానురానూ ఈ సరళి మారింది. 2017-19 కాలంలో మొదటి 16 మ్యాచ్‌లకు జట్ల స్ట్రైక్‌రేట్‌లో 13% తగ్గింది. అదే 2018-19లో ఏకంగా 27% తగ్గుదల నమోదవ్వడం గమనార్హం. ఇందుకు భిన్నంగా డెత్‌ ఓవర్ల (16-20)లో బ్రహ్మాండమైన వృద్ధి నమోదైంది. పవర్‌ప్లేలో జట్ల స్ట్రైక్‌రేట్‌ 141గా ఉంటే డెత్‌ ఓవర్లలో 168-171గా నమోదవుతోంది. ఆండ్రీ రసెల్‌, సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌ డెత్‌ స్ట్రైక్‌రేట్లు అందరికన్నా మిన్నగా ఉన్నాయి.

‘ఆండ్రీ’ సైక్లోన్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్‌ 12కు ఊపు తెచ్చాడు. ఎంతగా అంటే తొలి 16 మ్యాచులను పరిశీలిస్తే డెత్‌లో అతడి స్ట్రైక్‌ రేట్‌ ఏకంగా 297.56గా ఉంది. అతడు 41 బంతుల్లోనే 122 పరుగులు సాధించాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. బంతికి మూడు పరుగుల చొప్పున చేశాడు. ఈడెన్‌లో సన్‌రైజర్స్‌పై 49 (19 బంతుల్లో) పరుగులతో అజేయంగా నిలిచాడు. కింగ్స్‌ ఎలెవన్‌పై (17 బంతుల్లో 48) అతడి ఇన్నింగ్స్‌ సైక్లోన్‌ను తలపించింది. 

‘సొగసరి’ విధ్వంసం

రసెల్‌ తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు సంజు శాంసన్‌ది. డెత్‌లో అతడి స్ట్రైక్‌రేట్‌ 258.33 కావడం గమనార్హం. ఈ కేరళ కుర్రాడు డెత్‌లో 24 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్‌పై అతడి ఇన్నింగ్స్‌ (102; 55 బంతుల్లో) ఈ సీజన్‌కే హైలైట్‌. 15 ఓవర్లలోపు 37 బంతుల్లో 51 చేసిన సంజూ డెత్‌లో 18 బంతుల్లో 51 పరుగులు పిండుకోవడం విశేషం. అతడు సొగసైన బౌండరీలతో ఆకట్టుకున్నాడు.

‘డెవిల్‌’ పంత్‌

విభిన్న షాట్లతో భారీ సిక్సర్లు సాధించడంలో రిషభ్‌ పంత్‌ దిట్ట. ఎలాంటి బంతినైనా అతడు అలవోకగా బౌండరీకి తరలించగలడు. ఐపీఎల్‌ డెత్‌ ఓవర్లలో అతడి స్ట్రైక్‌రేట్‌ 251.71. కేవలం 31 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌పై పంత్‌ ఆటను ఎవరూ మరిచిపోలేరు. ఆ జట్టుపై 27 బంతుల్లో 78 పరుగులు చేశాడు. చివరి ఐదు ఓవర్లలో 18 బంతులకు ఏకంగా 62 పరుగులు సాధించాడు. అప్పుడతని స్ట్రైక్‌రేట్‌ 344.44 కావడం గమనార్హం.

‘డేర్‌’ వార్నర్‌

సన్‌రైజర్స్‌ ప్రధాన ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది కసిగా ఆడుతున్నాడు. డెత్‌ ఓవర్లలో అతడి స్ట్రైక్‌రేట్‌ 220గా ఉంది. చివరి ఓవర్లలో 20 బంతులాడి 44 పరుగులు చేశాడు. ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కండబలం, టెక్నిక్‌ తెలియంది కాదు. అతడు 39 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేట్‌ 212.82. ఎంఎస్‌ ధోనీ (178.38), విజయ్‌ శంకర్‌ (172.73) సైతం పోటీలో ఉన్నారు.

దిల్లీయే ముందు

 జట్ల పరంగా చూస్తే చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్‌. ముంబయి ఇండియన్స్‌పై 273.33 స్ట్రైక్‌రేట్‌తో 82 పరుగులు చేసింది. చెన్నైపై ముంబయి సైతం 256.67 స్ట్రైక్‌రేట్‌తో 77 పరుగులు పిండుకుంది. 15 ఓవర్లకు 93 చేసిన రోహిత్‌ సేన తర్వాతి ఐదు ఓవర్లలో విధ్వంసం సృష్టించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం రాజస్థాన్‌పై 253.33 స్ట్రైక్‌రేట్‌తో 76 పరుగులు సాధించింది.

గమనిక: ఈ గణాంకాలు ఏప్రిల్‌ 4 వరకు మాత్రమే...


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.