close

తాజా వార్తలు

రాజకీయ పోరులో విలక్షణ క్రికెటర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బ్యాట్‌తో అదరగొట్టి పరుగుల వరద పారించినా.. మాటలతో ప్రత్యర్థులను బెదరగొట్టినా.. జట్టు కోసం వీరుడిగా పోరాడినా.. తోటి ఆటగాళ్లతోనే గొడవలకు దిగినా..  సామాజిక అంశాల్లో మాధ్యమాల్లో ట్వీట్ల తూటాలు పేల్చినా..  సైనికుడిలా దేశభక్తిని ప్రదర్శించినా.. నాయకులకు ఎదురు నిల్చి చివరకు తానే రాజకీయాల్లోకి వెళ్లినా అంతా అతనికే చెల్లు. ఎంతో సామర్థ్యం ఉన్నప్పటికీ అంతంతే  అవకాశాలు దక్కినా అతడు ఎన్నడూ వెనకడుగు వేయలేదు. టీం ఇండియాను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గౌతీ.. తర్వాత కనీసం జట్టులో చోటు దక్కకపోయినా తన పోరాట స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు క్రికెట్‌ ఇన్నింగ్స్‌ను వదిలిపెట్టి రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాడు. తన ఇంటి పేరును సార్థకం చేసుకుంటున్నాడా అనేలా ఎప్పుడూ గంభీరంగా ఉండే గౌతీ.. నవ్వితే తనలోని కసి తగ్గిపోతుందేమోనన్నట్లు మైదానంలోనే కాదు ఎక్కడైనా సీరియస్‌గా ఉంటారు. గతేడాది బరువెక్కిన హృదయంతో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఈ స్టైలీష్‌ ఓపెనర్‌ రాజకీయాల్లో తన విజయాల ఖాతాను తెరిచేందుకు సమాయత్తమయ్యాడు.  తాజాగా భాజపాలో చేరిన గౌతమ్‌ గంభీర్‌ దిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు. ప్రచారంలో సైతం క్రికెట్‌ మైదానంలోలాగే దూకుడుగా దూసుకెళ్తున్నాడు. గౌతమ్‌ గంభీర్‌ది మొదట్నుంచి భిన్న శైలి. ఆటకంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రాపులర్‌ అయ్యాడు. సాధారణంగా ఆటగాళ్లు ఆట గురించి తప్ప ఇతర విషయాలపై స్పందించడం చాలా అరుదు.

గంభీర్‌ మాత్రం నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తాడు. సమస్య ఏదైనా స్పందిస్తాడు. గంభీర్‌కు చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. క్రికెట్‌పట్ల కూడా ఆసక్తి చూపించినా ఆర్మీపై మక్కువ వీడలేదు. ఆసక్తితో నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీకి (ఎన్‌డీఏ) కూడా ఎంపికయ్యాడు. కానీ అదే ఏడాది రంజీలు  ఆడే అవకాశం రావడంతో కొందరి సలహాతో క్రికెట్‌ వైపు మొగ్గు చూపాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా మారాడు. ఇప్పుడు విజయవంతమైన క్రికెటర్‌గా రిటైర్‌ అయ్యి  క్రీడా సంగ్రామం నుంచి రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. ఇక్కడ పరుగులకు బదులుగా ఓట్లను సాధించి విజయ దుంధుబి మోగించి తన సామాజిక బాధ్యతను అధికారికంగా నిర్వర్తించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

సామాజిక అంశాలపై చురుగ్గా  స్పందించే ఏకైక క్రికెటర్‌ గంభీర్‌. ట్విటర్‌ వేదికగా తన దేశభక్తిని వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో పదునైన ట్వీట్లతో విరుచుకుపడతాడు. ఇటీవల కశ్మీర్‌లో అమాయకులు బలవుతున్నారు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌  షాహిద్‌ అఫ్రిదీ చేసిన ట్వీట్‌పై గంభీర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఆఫ్రిదీ ప్రచారం కోసం తాపత్రయం పడుతున్నాడని.. అతని నిర్వాకం నో బాల్‌కు ఔట్‌ అయితే సంబరాలు చేసుకున్నట్లు ఉందని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌తో గట్టి బదులిచ్చాడు. కశ్మీర్‌లో ఉగ్రవాది  వానీని ఆర్మీ హతమార్చినప్పుడు ఆర్మీకి మద్దతుగా ట్వీట్‌ చేశాడు. దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత నేషనల్‌ ఒమర్‌ అబ్దుల్లా  అతను ఎందుకు తుపాకీ పట్టుకున్నాడో మీకేం తెలుసు అని అన్నాడు. ఇందుకు గౌతీ మీలాంటి వారికి మాట్లాడే అర్హత లేదని బదులిచ్చాడు. ఒకానొక సందర్భంలో వేర్పాటువాదాన్ని సమర్థించేవారు దేశాన్ని వీడాలని కూడా గౌతీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే అనేక సామాజిక అంశాలపై కూడా గౌతీ  ట్వీట్ల వార్‌ చేశాడు.  సాయుధ బలగాలంటే ప్రత్యేక అభిమానం ఉన్న గంభీర్‌  అమర వీరుల పిల్లల కోసం ఎంతో సహాయం చేస్తున్నాడు. పన్ను కడుతున్నాను కాబట్టి భవిష్యత్‌ తరాల కోసం పాలకులను నిలదీసే హక్కు తనకుందని గట్టిగా వాదించే గంభీర్‌  20 ఏళ్ల  సుదీర్ఘ క్రికెట్‌  కేరీర్‌కు వీడ్కోలు పలికి తర్వాత ఏం చేస్తాడు అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి  కమలతీర్థం పుచ్చుకున్నాడు. సమకాలిన సమాజంపై అతడికున్న అవగాహన, సమస్యలపై తాను స్పందించే తీరు, ఎవరికీ భయపడకుండా ఉండే తన స్వభావం,  వైఖరే తనను గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. తన క్రికెటింగ్‌ కేరీర్‌లాగే తన పొలికల్‌ ఎంట్రీ సైతం వివాదాలతోనే మొదలైంది. భాజపా తూర్పు దిల్లీ  నియోజకవర్గ అభ్యర్థి అయిన గౌతమ్‌ గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. అనుమతి లేకుండానే గంభీర్‌ తూర్పు దిల్లీలో ర్యాలీ నిర్వహించడాన్ని ఈసీ తప్పుపట్టింది. మరో వైపు గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నాడని అలా ఉండడం నేరమని ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్‌  డిమాండ్‌ చేస్తోంది. రూల్స్‌ తెలియకుండా గేమ్‌ మొదలు పెట్టడం ఎందుకని ఎద్దేవా చేస్తోంది. అయినా ఈ విమర్శలను పట్టించుకోని గౌతీ ముందుకు దూసుకుపోతున్నాడు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.