close

తాజా వార్తలు

‘మీకు వయసవుతోంది’... అయితే ఏంటి?

మరింత రెచ్చిపోయి ఆడతామంటున్న క్రికెటర్లు

చేస్తున్న పనిలోనే ఏదైనా సరికొత్తగా ప్రయత్నించకూడదూ! అంటే ‘ఈ వయసులో మేమేం చేస్తామండీ’ అని సమాధానం ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఏ రంగాన్ని చూసినా ఎంత త్వరగా పనికి వీడ్కోలు పలుకుదామా అని ఎదురు చూస్తుంటారు. ఒక క్రికెట్లో మాత్రమే ‘నాలో ఇంకా సత్తువ ఉంది. ఆటను ఆస్వాదించలేనప్పుడు రిటైర్‌ అవుతా’ అనే వాళ్లను చూస్తుంటాం. అందులో కొందరేమో నిలకడ లేమితో విమర్శలు ఎదుర్కొంటారు. మరికొందరు లేటు వయసులో ఘాటుగా ఆడుతూ ఔరా! అనిపిస్తుంటారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ‘మా ఆటకు వయసుతో సంబంధం ఏముంది’ అంటున్న క్రికెటర్లు ఎవరో చూద్దాం!!

కర్త- కర్మ - క్రియ

తన అనుభవంతో విమర్శకుల నోళ్లు మూయిస్తున్న క్రికెటర్‌ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడి పరుగుతీస్తాడు. వారిని ఓడిస్తాడు. తన ఫిట్‌నెస్‌కు తిరుగులేదని చాటుతున్నాడు. అవతలి ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ సమన్వయంతో చకచకా పరుగులు తీస్తాడు. ఐపీఎల్‌ 12వ సీజన్‌లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు మహీ. 119.33 సగటుతో 8 ఇన్నింగ్సుల్లోనే 358 పరుగులు చేశాడు. అతడి సగటుకు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. రెండో స్థానంలోని రవీంద్ర జడేజా సగటు 38. దీనిని బట్టి చెప్పొచ్చు అతనెంత కసిగా ఆడుతున్నాడో. చెన్నై మొత్తం చేసిన పరుగుల్లో  19% మహీ చేసినవే. సీజన్‌లో మూడు అర్ధశతకాలు సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ ఆట ఆసక్తి రేకెత్తించింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడాడు. ఆఖరి ఓవర్‌లో 4, 6, 6, 2, 6తో అదరగొట్టాడు. అయితే చివరి బంతిని వృథా చేయడం అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ చెన్నైకి కర్త, కర్మ, క్రియ ధోనీయే కావడం గమనార్హం.

మైదానంలో 16 ఏళ్లు

ఆయన వయసు 40. మైదానంలో మాత్రం 16 ఏళ్లే. అతడే దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌. బాల్యంలో పేదరికంలో మగ్గాడు. కష్టాలెన్నో ఎదుర్కొని క్రికెట్‌లో ప్రవేశించిన తాహిర్‌ తన మిస్టరీ స్పిన్‌తో మహామహుల్ని ఇబ్బంది పెట్టాడు. లేటు వయసులోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో కీలకం అవుతున్నాడు. ఎంతలా అంటే విజిల్‌ పొడు బృందంలో అత్యధిక వికెట్లు తీసింది అతడే మరి. మొత్తం 49.2 ఓవర్లు విసిరిన తాహిర్‌ 311 పరుగులిచ్చి 21 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ బౌలింగ్‌ వీరుల జాబితాలో టాప్‌-2లో ఉన్నాడు. 4/12తో దిల్లీపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. యువ బౌలర్లు దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాను వెనక్కి నెట్టేశాడు.

వయసా.. హహ్హహ్హ

‘మీ వయసెంతా అంటే మొన్నే 20 ఏళ్ల క్రితం 20’ అనే టైపు క్రిస్‌గేల్‌. వయసనేది శరీరానికే గానీ మనసుకు కాదంటున్నాడీ యూనివర్స్‌ బాస్‌. 39 ఏళ్ల వయసులో విజృంభించి మరీ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో దుమ్మురేపిన ఈ విండీస్‌ వీరుడు ఐపీఎల్‌ 12లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలతో అభిమానులను అలరిస్తున్నాడు. పాపం! సీజన్‌లో ఒక్క పరుగుతో శతకం మిస్సయ్యాడు. పంజాబ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌ గేల్‌. 11 మ్యాచుల్లో 44.80 సగటుతో 448 పరుగులు చేశాడు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో వ్యక్తి అతడు. పంజాబ్‌ మొత్తం పరుగుల్లో గేల్‌ ఒక్కడి భాగస్వామ్యం 21.61%. కేఎల్‌ రాహుల్‌ కాస్త ముందున్నాడు. చివరి 10 ఇన్నింగ్సుల్లో అతడి గణాంకాలు 20, 40, 5, 16, 63, 99*, 30, 69, 3, 4గా ఉన్నాయి. యువ క్రికెటర్లు సైతం అతనిలా ఆడకపోవడం గమనార్హం.

36 @ మిస్టర్‌ 360

ట్రోఫీ ముద్దాడకున్నా ఏటా అభిమానులకు కనీసం పరుగుల విందైనా ఇచ్చేది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఈ సారి దానికీ నోచుకోలేదు. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి సీజన్‌పై ఆశలు వదిలేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా 36 ఏళ్ల ఏబీ డివిలియర్స్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు. ఈ సారి ఐదు అర్ధశతకాలతో అలరించాడు మిస్టర్‌ 360. పన్నెండు మ్యాచుల్లో 49 సగటుతో 441 పరుగులు సాధించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఏబీడీ (82*) విధ్వంసాన్ని ఎవరూ మరిచిపోలేరు. అతడి ధాటికి ఓ బంతి స్టేడియంపై పడటంతో మరో బంతితో ఆడాల్సి వచ్చింది. బెంగళూరు చేసిన మొత్తం పరుగుల్లో ఏబీ భాగస్వామ్యం 21.72%. ఐపీఎల్‌ 12వ సీజన్‌లో పరుగుల వీరుల జాబితాలో అతడి స్థానం 8.

ఇటు ఐపీఎల్‌.. అటు దేశవాళీ 

వయసు పెరిగినా పదును తగ్గలేదని చాటుతున్నాడు శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ. 35 ఏళ్ల వయసులో అతడు నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. ఓ వైపు ఐపీఎల్‌ మరోవైపు దేశవాళీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే 50 ఓవర్లు, 20 ఓవర్ల మ్యాచులు ఆడేసి ఔరా! అనిపించాడు. శ్రీలంక మాజీలు అతడి అంకితభావానికి ముగ్ధులవుతున్నారు. గతేడాది వేలంలోనే అమ్మడుపోని మలింగను మళ్లీ ముంబయి ఇండియన్సే తీసుకుంది. అందుకు తగ్గట్టే యాజమాన్యం ఆశలను నిలబెట్టాడు. 8 మ్యాచుల్లో 29.5 ఓవర్లు విసిరాడు. 285 పరుగులిచ్చి 12 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 3/43, 4/37 బెంగళూరుపై 4/31తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. బెంగళూరు మ్యాచులో టాప్‌ ఆర్డర్‌ ముగ్గురిని వదిలేస్తే మిగతా నలుగుర్నీ వరుసగా పెవిలియన్‌ పంపించాడు మలింగ. మైదానంలో చురుగ్గా కదులుతూ చక్కని ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.