close

తాజా వార్తలు

ఫ్రాంచైజీ క్రికెట్‌ అంటే డిసెంబర్‌ 31 వేడుకలాంటిది!

మరి సిరీస్‌ మోడల్‌ క్రికెట్‌ అంటే?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ అభిమానులను ఆద్యంతం అలరించింది. బంతిని వీరబాదుడు బాదిన బ్యాటర్లు.. చురకత్తుల్లాంటి బంతులు సంధించిన పేసర్లు.. గింగిరాలు తిరిగే బంతులతో మ్యాచ్‌ గమనాన్నే మార్చేసిన స్పిన్నర్లు అందరికీ నచ్చేశారు. రియాన్‌ పరాగ్‌ లాంటి కుర్రాళ్ల మెరుపుల్ని మర్చిపోవడం అంత సులభం కాదు. ఫ్రాంచైజీ క్రికెట్‌ అంటేనే అలా ఉంటుంది మరి. డిసెంబర్‌ 31 తరహా కొత్త సంవత్సరం వేడుకను తలపిస్తుంది. అయితే సిరీస్‌ మోడల్‌ క్రికెట్‌ ఎలాగుంటుందనేగా మీ ప్రశ్న. అది ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయ ఉగాది పండుగలా ఉంటుందంటే అభ్యంతరం ఏమీ లేదుగా!

అన్నీ మెరుపులే

గతంలో ఎన్నడూ చూడని వింతలను పరిచయం చేసింది ఐపీఎల్‌. 2008లో ప్రారంభమైన ఈ పొట్టి క్రికెట్‌ వేడుక దినదిన ప్రవర్థమానంగా ఎదిగింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. క్రికెట్‌ దేశాలకు మార్గదర్శిగా మారింది. అరంగేట్రం నుంచి 12వ సీజన్‌ వరకు తనకు తానే సాటి అని నిరూపించుకుంది. చాలామంది విశ్లేషకులు దీనిని లలిత్‌మోదీ మానస పుత్రికగా చెబుతుంటారు. అప్పటికే పరిచయం ఉన్న ఫుట్‌బాల్‌ లీగ్‌లను ఆదర్శంగా తీసుకొని ఐపీఎల్‌ను రూపొందించారు. ఇందుకోసం ఓ నిర్వాహక  కమిటీని ఏర్పాటు చేశారు. దానికి ఛైర్మన్‌ ఉంటారు. ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. వాణిజ్యవేత్తల నుంచి సినిమా తారల వరకు దీనిపై ఆసక్తి చూపించారు. ఒక్కో ఫ్రాంచైజీకి నగదు ఖర్చుచేసేందుకు పరిమితి ఉంటుంది. దాంతోనే అన్నింటికీ ఖర్చుచేసుకోవాలి. ఐపీఎల్‌ ఆర్థికంగా విజయవంతం కావడంతో క్రికెట్‌ దేశాలన్నీ టీ20 లీగ్‌లను ఆరంభించాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ సైతం ఫ్రాంచైజీ మోడలే. ఐపీఎల్‌ తర్వాతి స్థానం దీనిదే. వారు మహిళలకూ టీ20 లీగ్‌ నిర్వహిస్తున్నారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సైతం హిట్టే. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ ఇదే దారి అనుసరించాయి.

బాధ్యత ఫ్రాంచైజీలదే

ఫ్రాంచైజీ క్రికెట్‌లో దాదాపు యాజమాన్యమే అన్నీ వసతులు కల్పిస్తుంది. ఆటగాళ్ల జెర్సీలు, కిట్‌లు సమకూరుస్తుంది. వీటిని సమకూర్చేందుకు వారు వ్యాపారసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. ఆ మేరకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తారు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే భారత్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రికెటర్లు భారీ మొత్తం ఆర్జిస్తుంటారు. ఫ్రాంచైజీ నిర్వహణకు ఓ బృందం ఉంటుంది. అన్నీ అవే చూసుకుంటుంది. ప్రధాన కోచ్‌, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనుభవజ్ఞులను మార్గనిర్దేశకులు, సలహాదారులుగా ఎంచుకుంటారు. వీరికీ భారీ మొత్తంలో ఖర్చుచేస్తారు. ఇక ఫిజియోలు, సహాయ సిబ్బంది తప్పనిసరి. లీగ్‌ మ్యాచుల టికెట్లు విక్రయించుకోవాల్సిన బాధ్యతలు ఫ్రాంచైజీలవే. వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. అయితే నాకౌట్‌ దశ మ్యాచుల ఆదాయం మాత్రం లీగ్‌ నిర్వాహకులకు వెళ్తుంది. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను తుదిజట్టుకు ఎంపిక చేస్తుంటారు. దేశవిదేశాల నుంచి క్రికెటర్లు డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకుంటారు. వారి కుటుంబ సభ్యులూ ఉంటారు. అంతా సందడిగా ఉంటుంది. డ్రస్సింగ్‌ రూమ్‌ ఓ మినీ ప్రపంచాన్ని తలపిస్తుంది. వీరికి విడిదిలో మనోరంజక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇక పార్టీలు మామూలే. ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌ను ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు భారీ మొత్తమే చెల్లిస్తారు.

సారుప్యత ఉన్నా భిన్నం

సిరీస్‌ మోడల్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌కు సారూప్యతలు కనిపించినా చాలా భిన్నంగా ఉంటుంది. దేశాల మధ్య సిరీస్‌లు జరుగుతాయి. ప్రతీదేశంలో ఓ క్రికెట్‌ బోర్డు ఉంటుంది. ఇవన్నీ ఐసీసీకి అనుబంధంగా ఉంటాయి. ఐసీసీ భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) ప్రకారం సిరీస్‌ సమయం నిర్దారించుకుంటారు. ఆయా బోర్డులు ఐసీసీ సమక్షంలో టెస్టు, వన్డే, టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఐసీసీలో నిర్ణయించిన మేరకు ఆదాయాన్ని పంచుకుంటాయి. ఏ దేశంలో మ్యాచ్‌లు జరిగినా అన్నిటికీ స్థానిక బోర్డులదే బాధ్యత. టికెట్ల విక్రయం నుంచి ఆటగాళ్లకు సదుపాయాల వరకు అన్నీ చూసుకోవాలి. సిరీస్‌లకు జట్లను బోర్డులే ఎంపిక చేస్తాయి. ఇందుకోసం సెలక్షన్‌ కమిటీలు ఉంటాయి. ప్రతి జట్టుకు కోచ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లు ఉంటారు. ఇక్కడ మార్గదర్శకులు ఉండరు. సహాయ సిబ్బందిలో ఫిజియో, హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌, సాంకేతిక విశ్లేషణ నిపుణులు ఉంటారు. ఆటగాళ్లకు బోర్డులు ముందుగా కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం మ్యాచుఫీజు చెల్లిస్తాయి. సహాయ సిబ్బందికీ బోర్డే చెల్లింపులు చేస్తుంది. బోర్డు అనుమతుల మేరకే క్రికెటర్ల వెంట జీవిత భాగస్వాములు ఉంటారు. ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలు అతిక్రమించకూడదు. బోర్డుల మధ్య ఆదాయం, ఇతర విషయాల్లో విభేదాలు తలెత్తితే ఐసీసీ పరిష్కరిస్తుంది. సిరీస్‌ మోడల్‌ క్రికెట్‌ అంతా సంప్రదాయబద్ధంగా ఉంటుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.