close

తాజా వార్తలు

కొంచెం తీపి.. కొంచెం చేదు..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణం

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఈ సీజన్‌ మిశ్రమ ఫలితాలిచ్చింది. ఆఖర్లో టైటిల్‌ ఆశలు చిగురించినా ఆ జట్టు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సన్‌ రైజర్స్‌ ఈసారి బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించింది. ఈసారి సన్‌ రైజర్స్‌ అనగానే ముందుగా గుర్తొచ్చింది.. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో ఓపెనింగ్‌ జోడీ. సీజన్‌లో వాళ్ల బ్యాటింగ్‌ ఊచకోతను తలపించింది. మిడిల్‌ ఆర్డర్‌లో ఎవరూ పెద్దగా రాణించకున్నా.. సీజన్‌ ఆఖర్లో మనీశ్‌ పాండే.. బ్యాటింగ్‌ బాధ్యతలు తీసుకొని ఫరవాలేదనిపించాడు. భువనేశ్వర్‌కుమార్‌ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇలా ఐపీఎల్‌ 12వ సీజను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కొంచెం తీపి, కొంచెం చేదు జ్ఞాపకాలతో ముగించింది.

ఆరంభం అదరగొట్టారు..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడాల్సి వచ్చిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు ఓపెనింగ్‌ జోడిపైనే దృష్టి పెట్టింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. వార్నర్‌, బెయిర్‌ స్టో విజృంభణ ఎంతలా సాగిందో. వార్నర్‌ ఆడిన 12 మ్యాచుల్లో 69.20 సగటుతో 692 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వార్నర్‌ మధ్యలోనే జట్టుకు దూరమైనా ఇంతవరకూ మరే బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ రికార్డును తాకలేదు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ వార్నర్‌ పేరిటే ఉంది. స్ట్రైక్‌ రేట్‌ కూడా 143.86 అందులో ఎనిమిది అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. మరోవైపు తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో కూడా 10 మ్యాచుల్లో 55.62సగటుతో 445 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఒక శతకం ఉన్నాయి. ఈ ఇద్దరినీ ఔట్‌ చేస్తే చాలు సన్‌ రైజర్స్‌ను గెలవొచ్చన్న స్థాయిలో ప్రత్యర్థిజట్లు యత్నించాయి.

కథ అడ్డం తిరిగింది
మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో సన్‌ రైజర్స్‌ ఈసారి కూడా టైటిల్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు చేసింది. వార్నర్‌, బెయిర్‌ జోరు చూస్తే అందరికీ అదే నిజమనిపించింది. అయితే, వార్నర్‌, బెయిర్‌ స్టో జట్టుకు స్వదేశానికి వెళ్లడంతో సన్‌ రైజర్స్‌ కథ అడ్డం తిరిగింది. ఉన్నట్టుండి సన్‌ రైజర్స్‌ ఒక్కసారిగా చతికిలపడింది. 
వాళ్లిద్దరి గైర్హాజరీలో ఆఖరి ఐదు మ్యాచుల్లో సన్‌ రైజర్స్‌ నాలుగు పరాజయాలు చవి చూసింది. 12 పాయింట్లు మాత్రమే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ సహాయంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ చేరుకున్న జట్టుగా సన్‌ రైజర్స్‌ రికార్డు సృష్టించింది. కీలకమైన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది.

కీలకం అనుకున్నవాళ్లు చేతులెత్తేశారు
గతేడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు విలియమ్సన్‌. ఈ సారి గాయం కారణంగా దాదాపు సగం మ్యాచులు ఆడలేకపోయాడు. అయితే నిలకడైన బ్యాట్స్‌మెన్‌గా పేరున్న విలియమ్సన్‌ ఈసారి పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒక మ్యాచులో 70 పరుగులు మినహా అతను ఆడి గెలిపించిన మ్యాచ్‌ల్లేవు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 22 సగటుతో 156 పరుగులు మాత్రమే చేశాడు. 
కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 

నిరాశ పరిచిన విజయ్‌ శంకర్‌..

నాలుగో స్థానం కోసం జట్టులోకి తీసుకున్న తమిళనాడు ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్నప్పటికీ విజయ్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రపంచకప్‌ జట్టులోనూ స్థానం సంపాదించడంతో విజయ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, విజయ్‌ మాత్రం  14 మ్యాచులాడి 20.33సగటుతో పరుగులు చేశాడు. కనీసం ఒక్క అర్ధశతకమైన నమోదు చేయలేకపోయాడు. కీలకమైన సమయాల్లో వికెట్‌ సమర్పించుకొని విమర్శలు ఎదుర్కొన్నాడు. బంతితోనూ రాణించకపోవడంతో జట్టు అతనిపై నమ్మకం పెట్టలేక బౌలింగ్‌ ఇవ్వలేదు.

మనీశ్‌ పాండే, భువనేశ్వర్‌ది అదే దారి..

భువనేశ్వర్‌కుమార్‌ సీజన్‌లో అనుభవజ్ఞుడైన బౌలర్‌గా జట్టులో ఉండి సారథ్య బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. కేవలం 13 వికెట్లు మాత్రమే తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులో కీలకమైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడనుకున్న మనీశ్‌ పాండే సైతం తొలి ఐదు మ్యాచుల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయడంతో జట్టు నుంచి దూరం పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆఖరి ఆరు మ్యాచుల్లో మూడు అర్ధశతకాలు బాది మళ్లీ ఫామ్‌ అందుకున్నప్పటికీ నష్టాన్ని ఆపలేకపోయాడు. మరోవైపు గాయాల కారణంగా ఖలీల్‌ అహమ్మద్‌ ఆరు మ్యాచుల్లో ఆడలేకపోయాడు. ఆ తర్వాత జట్టుతో కలిసి బాగానే రాణించినా ఫలితం మారలేదు.

తీపి, చేదు గుర్తులు..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌, బెయిర్‌ స్టో కలిసి 185 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఛేదనలో బెంగళూరును మహమ్మద్‌ నబీ 4/11 దెబ్బ తీశాడు. దీంతో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుపై 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సీజన్‌లో ఇదే సన్‌ రైజర్స్‌కు ఎప్పటికీ గుర్తుండి పోయే మ్యాచ్‌ అని చెప్పవచ్చు. మరోవైపు ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ 96 పరుగులకే చాప చుట్టేసింది. 136 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ 6/12 దెబ్బకు సన్‌ రైజర్స్‌ 17.4 ఓవర్లలోనే ఆలౌటైంది. సీజన్‌లో ఈ మ్యాచ్‌ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

బౌలర్ల వైఫల్యం..

2016లో ఛాంపియన్‌, 2018లో రన్నరప్‌గా ఉన్న సన్‌ రైజర్స్‌ 2019లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. దృఢమైన బౌలింగ్‌ జట్టుగా పేరున్న ఆ జట్టులో ఈసారి బౌలర్లంతా విఫలమయ్యారు. గతంలో రాణించిన సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, థంపీ కనీసం వాళ్ల స్థానాలు కూడా కాపాడుకోలేకపోయారు. దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌లది అదే దారి. ఆడిన అన్ని మ్యాచుల్లో విలియమ్సన్ సారథ్యం బాగానే ఉన్నప్పటికీ కీలకమైన మ్యాచులో ఖలీల్‌ అహ్మద్‌కు బదులుగా థంపీకి బంతినిచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లను సరిగా వినియోగించుకోవడంలో కేన్‌ విఫలమయ్యాడు. ఆఖర్లో భువనేశ్వర్‌కు ఓవర్లు ఉండేలా చూడాల్సిందని అంటున్నారు. గెలిచింది. మొత్తం ఐపీఎల్‌ 12వ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ ఆడిన 15 మ్యాచుల్లో 9 మ్యాచుల్లో ఓడి 6 మ్యాచుల్లో గెలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.