close

తాజా వార్తలు

కొత్తగా..రెక్కలొచ్చేనా.. 

వన్డే ప్రపంచకప్‌ మరో 12 రోజుల్లో..

ఎప్పుడో 1996 ప్రపంచకప్‌లో చూశాం ఓ కొత్త విజేతను. అప్పుడు శ్రీలంక కప్పు ముచ్చట తీర్చుకుంది. ఇక అంతే.. అప్పట్నుంచి పాత ఛాంపియన్లే కప్పును ముద్దాడుతున్నాయి. ఒక్కసారైనా కప్పు గెలవాలన్న జట్ల కల నెరవేరట్లేదు. కొత్త ఛాంపియన్‌ను చూడాలన్న వారి ఆశ తీరట్లేదు.

ఇప్పుడు మళ్లీ ప్రపంచకప్‌ ముస్తాబై వచ్చేసింది. ఎప్పట్లాగే కప్పు ముచ్చట తీరిన పాతకాపులు ఒకవైపు.. కల నెరవేరని జట్లన్నీ మరోవైపు! మరి ఇంగ్లిష్‌ గడ్డ ఎవరి వైపు నిలవబోతోంది? జులై 14న ప్రపంచకప్‌ ఎవరి చేతుల్లో ఒదిగిపోనుంది?

ఇప్పటిదాకా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పదకొండు. అందులో ఐదు ఆస్ట్రేలియానే సొంతం చేసుకుంది. 1987లో తొలిసారి ఆ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. పుష్కరం తర్వాత రెండో కప్పును ముద్దాడింది. అక్కడి నుంచి కంగారూల ఆధిపత్యం మామూలుగా సాగలేదు. తర్వాతి రెండు కప్పులూ వాళ్లవే. మధ్యలో 2011లో టీమ్‌ఇండియా అడ్డం పడింది. గత పర్యాయం సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో మళ్లీ కంగారూ జట్టే ఛాంపియన్‌ అయింది. ప్రపంచకప్‌ మొదలైన రోజుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కరీబియన్‌ జట్టు వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. 1983లో కపిల్‌డెవిల్స్‌ అనూహ్య ప్రదర్శనతో తొలిసారి భారత్‌కు ప్రపంచకప్‌ను అందించింది. 2011లో ధోనీసేన చరిత్రను పునరావృతం చేసింది. పాకిస్థాన్‌ 1992లో, శ్రీలంక 1996లో ప్రపంచ విజేతలుగా నిలిచాయి. 1983లో భారత్‌ ప్రపంచ విజేత అయినప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు కొత్త ఛాంపియన్‌లను చూసింది క్రికెట్‌ ప్రపంచం. కానీ 1996తో ఈ సంప్రదాయానికి తెరపడింది. తర్వాతి టోర్నీ నుంచి పాత జట్లకే కప్పు వెళ్తోంది. మొత్తంగా ఇప్పటిదాకా జరిగిన 11 ప్రపంచకప్‌లను ఐదు జట్లు మాత్రమే పంచుకున్నాయి. ప్రస్తుతం బరిలో ఉన్న పది జట్లలో మిగతా ఐదింటికి ప్రపంచకప్‌ కల నెరవేరలేదు. మరి ఆ ఐదు జట్లలో ఒకటి ఈసారైనా కప్పు సాధిస్తుందా అన్నది ఆసక్తికరం. ఈ ఐదు జట్లలో అఫ్గానిస్థాన్‌ను పక్కన పెట్టేద్దాం. ఆ జట్టు ఆడిన ప్రపంచకప్‌ ఒకటే. ప్రస్తుతం ఆ జట్టు మెరుగైన ప్రదర్శనే చేస్తోంది కానీ.. దానికేమీ కప్పుపై ఆశలు లేవు. సెమీస్‌ చేరినా గొప్ప ఘనతగా భావిస్తుంది. బంగ్లాదేశ్‌ ప్రమాదకర జట్టే కానీ.. కప్పు గెలిచే స్థాయి లేదు. ఇప్పటిదాకా కప్పు గెలవని వాటిలో మూడు జట్లకు ఈసారి వాస్తవికమైన అవకాశాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ ఈసారి టైటిల్‌ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. 


ఈసారి గుంభనంగా.. 

ప్రతిసారీ భారీగా ఆశలు పెట్టుకోవడం.. అదృష్టం కలిసి రాకో, అంచనాలకు తగ్గట్లు ఆడకో వెనుదిరగడం దక్షిణాఫ్రికాకు ఆనవాయితీగా మారిపోయింది. క్రికెట్లోకి పునరాగమనం చేశాక ఆడిన 1992 ప్రపంచకప్‌ దగ్గర్నుంచి ప్రతిసారీ దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటే. కానీ ఈ మెగా టోర్నీలో ఆ జట్టుకు కాలం కలిసిరాదు. 1992, 1999, 2003 ప్రపంచకప్‌ల్లో ఆ జట్టును ఎలా దురదృష్టం వెంటాడిందో గుర్తుండే ఉంటుంది. అతిగా ఆశలు, అంచనాలు పెట్టుకుని.. ఆ తర్వాత నిరాశపడటం అలవాటుగా మారిన నేపథ్యంలో ఈసారి దక్షిణాఫ్రికా గుంభనంగా ఉంటోంది. గతంలో పెద్ద స్టార్లను నమ్ముకుని దెబ్బ తిన్న నేపథ్యంలో నిరుడు డివిలియర్స్‌ ఉన్నట్లుండి రిటైర్మెంట్‌ ప్రకటించినా.. దక్షిణాఫ్రికా చలించలేదు. మిగతా జట్లలా ప్రపంచకప్‌ అవకాశాలు, సన్నద్ధత గురించి సఫారీ జట్టు పెద్దగా మాట్లాడట్లేదు. వారి బలం మాత్రం తక్కువగా లేదు. డుప్లెసిస్‌, ఆమ్లా, డికాక్‌, రబాడ, తాహిర్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఆ జట్టు సొంతం. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు దక్షిణాఫ్రికా జట్టుకు కలిసొచ్చేవే. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఆ జట్టు సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే, గతంలో మాదిరి దురదృష్టం వెంటాడకపోతే కప్పు గెలవడం సఫారీలకు సాధ్యమే. 


తక్కువ అంచనా వేయొద్దు 

ఇప్పటిదాకా కప్పు కల నెరవేరని పెద్ద జట్లల)º పెద్దగా అంచనాలు లేనిది న్యూజిలాండ్‌ మీదే. ఆ జట్టుకు ప్రపంచకప్‌లో మంచి రికార్డే ఉంది. నిరుడు ఫైనల్‌ చేరింది. నాలుగుసార్లు సెమీస్‌ చేరింది. కానీ ఆరంభంలో బాగా ఆడే ఆ జట్టు.. నాకౌట్లో తేలిపోతుంటుంది. 2015లో ఆస్ట్రేలియాతో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన న్యూజిలాండ్‌ అంచనాల్ని మించి రాణించినా.. ఫైనల్లో కంగారూల ముందు నిలవలేకపోయింది. ప్రస్తుతం కివీస్‌ ప్రదర్శన కాస్త అటు ఇటుగా ఉంది. కొన్ని నెలల ముందు వరకు చక్కటి విజయాలతో సాగిపోతున్న ఆ జట్టును దాని సొంతగడ్డపై టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడించడంతో ఆత్మవిశ్వాసం దెబ్బ తింది. అలాగని న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ పిచ్‌లపై అద్భుతాలు చేయగల బౌల్ట్‌, సౌథీ లాంటి బౌలర్లు.. విలియమ్సన్‌, టేలర్‌, గప్తిల్‌ లాంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌.. గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌ లాంటి ఆల్‌రౌండర్లతో కివీస్‌ బలగానికి ఢోకా లేదు. ఆ జట్టు సెమీస్‌ చేరే అవకాశాలున్నాయి. అక్కడ నిలకడగా ఆడి, అదృష్టం కూడా కలిసొస్తే కప్పు గెలవొచ్చేమో! 


ఆపేదెవ్వరు? 

ఇంగ్లిష్‌ జట్టుకు ప్రపంచకప్‌ గెలవడానికి ఈసారి ఉన్నంత మెరుగైన అవకాశాలు ఇంతకుముందు ఎప్పుడూ లేవు, భవిష్యత్తులోనూ ఉండకపోవచ్చన్నది అందరి మాట. తమ గడ్డపై జరిగిన 2011 ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాతి పర్యాయం తమ దేశానికి ప్రపంచకప్‌ ఆతిథ్యం దక్కగా ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. ఈసారి ఇంగ్లాండ్‌ ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి ప్రపంచకప్‌ గెలిచేస్తుందని చెప్పడం కాదు. ప్రస్తుతం ఆ జట్టు బలం అలా ఉంది మరి. ప్రపంచంలో ఎక్కడ టోర్నీ జరిగినా గెలిచే సత్తా ఆ జట్టుకు ఉందిప్పుడు. గత పర్యాయం తొలి దశలోనే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించాక ఆ జట్టు పరిణామం చెందిన తీరు అనూహ్యం. టెస్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికి రాని జట్టులా తయారైన ఇంగ్లాండ్‌ను మార్చడానికి బోర్డు కంకణం కట్టుకుంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో వన్డేలు, టీ20ల మీద ప్రత్యేక దృష్టిసారించింది. జట్టులో మార్పులు జరిగాయి. విధ్వంసక ఆటగాళ్లు వచ్చారు. ఆ జట్టు ఆడే తీరే మారిపోయింది. దంచు దంచు దంచు.. ఇదే ఆ జట్టు సిద్ధాంతంగా మారిపోయింది. రాయ్‌, బట్లర్‌, మోర్గాన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌.. అందరిదీ ఇదే నినాదం. ఈ దెబ్బకు కొన్ని నెలల్లోనే ఫలితాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ వెనుదిరిగి చూసుకున్నది లేదు. బౌలింగ్‌ బలం కూడా పెంచుకుని తిరుగులేని స్థాయికి చేరుకుంది. 300 పైచిలుకు స్కోర్లు చేయడం, లక్ష్యాల్ని ఛేదించడం చాలా సులువైన పని అయిపోయింది ఇంగ్లిష్‌ జట్టుకు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఇంగ్లాండ్‌కు ఉన్న బ్యాటింగ్‌, ఆల్‌రౌండ్‌ బలం మరే జట్టుకూ లేదు. తాజాగా పాకిస్థాన్‌ మీద 359 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి తన ప్రపంచకప్‌ ప్రత్యర్థులన్నింటికీ హెచ్చరికలు పంపింది మోర్గాన్‌ సేన. భీకరమైన జట్టు, అద్భుత ఫామ్‌, ఆతిథ్య బలం.. ఈసారి ఇంగ్లాండ్‌కు కచ్చితంగా ప్రపంచకప్‌ తెచ్చిపెడతాయన్నది విశ్లేషకుల మాట. ఏదైనా మ్యాచ్‌లో ఏదైనా అనూహ్యంగా జరిగి ఇంగ్లాండ్‌ ఆగాలి తప్ప ఆ జట్టును ఆపడం ప్రత్యర్థులకు సాధ్యం కాదని అంటున్నారు. చూద్దాం క్రికెట్‌ పుట్టింట్లో ప్రపంచకప్‌ పాదం మోపుతుదేమో!


ఆ రెండే అడ్డు 

కప్పు కల నేర్చుకోవాలని చూస్తున్న ఈ మూడు జట్లకు ప్రధానంగా అడ్డుగా నిలిచే జట్లు భారత్‌, ఆస్ట్రేలియా. మూడోసారి ముచ్చట తీర్చుకోవాలని చూస్తున్న టీమ్‌ఇండియా.. బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఫామ్‌ కూడా బాగానే ఉంది. కోహ్లి, బుమ్రా, ధోని, రోహిత్‌, పాండ్య, షమి లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో భారత్‌ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతోంది. 
ఇక కొన్ని నెలల ముందు వరకు సాధారణంగా కనిపించిన ఆస్ట్రేలియా.. ప్రపంచకప్‌ ముంగిట భీకరంగా కనిపిస్తోంది. భారత్‌ను దాని సొంతగడ్డపై ఓడించడం, ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌ అందుకోవడం, స్మిత్‌-వార్నర్‌ జోడీ పునరాగమనంతో ఆస్ట్రేలియా కళే మారిపోయింది. మామూలుగానే ఆ జట్టును ఎప్పుడూ తక్కువగా తీసుకోలేం. ఇప్పుడు జట్టూ బాగుంది. భారత్‌, ఆస్ట్రేలియా రెండూ కూడా తొలిసారి కప్పు గెలవాలని ఆశిస్తున్న జట్లకు సవాలు విసరడం ఖాయం. మరి ఈ సవాల్‌ను ఛేదించి కొత్త ఛాంపియన్‌గా నిలిచేదెవరో?



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.