close

తాజా వార్తలు

10 జట్లు.. 11 వేదికలు.. 40 రోజులు.. 50 ఓవర్ల క్రికెట్‌

భారత క్రికెట్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఒక క్రికెట్‌ వేడుక ముగిసిందో లేదో అప్పుడే మరో పండగ వచ్చేసింది. ఐపీఎల్‌ 12లో ఆటగాళ్ల ధనాధన్‌ మెరుపులు ఇంకా మరిచిపోనేలేదు. సొగసైన ఇన్నింగ్సులతో మురిపించేందుకు  ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ దూసుకొచ్చింది. మరో 40 రోజులు 50 ఓవర్ల క్రికెట్‌ను సీరియస్‌గా ఆస్వాదించొచ్చు. అద్భుతమైన ఆట కన్నులపండువగా మారాలంటే ఆతిథ్యమిచ్చే మైదానాలు చక్కగా ఉండాలి కదా! ఈ సారి మెగాటోర్నీని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహిస్తోంది. ఇంగ్లిష్‌ గడ్డ పచ్చికతో జీవం ఉట్టిపడే పిచ్‌లకు నిలయం. బంతులు బుల్లెట్ల మాదిరిగా దూసుకెళ్తాయి. రెండు వైపులా స్వింగ్‌ అవుతాయి. 48 మ్యాచుల్లో 10 జట్లు 11 మైదానాల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ పిచ్‌లపై అవగాహన పెంచుకుందామా!!

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ (నాటింగ్‌ హామ్‌)

చారిత్రక ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో ఐదు మ్యాచులు నిర్వహిస్తున్నారు. 1841లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. సామర్థ్యం 17,000. ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ వన్డే 1974లో జరిగింది. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆతిథ్యమిచ్చిన అనుభవం దీని సొంతం. భారత్‌ జూన్‌ 13న న్యూజిలాండ్‌తో ఇక్కడ తలపడనుంది. వెస్టిండీస్‌ × పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ × పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా × వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌కు మంచి రికార్డుంది. ఇక్కడ ఇంగ్లాండ్‌ వన్డేల్లో అత్యధిక స్కోరు 481/6 చేసింది. 2016లో 444/3 చేసింది.

రివర్‌సైడ్‌ దుర్హమ్‌ (దుర్హమ్‌)

ఇంగ్లాండ్‌ ఈశాన్యంలోని దుర్హమ్‌ కౌంటీ అందాలొలికించే తీరప్రాంతం. రాజభవంతులకు ఆలవాలం. దుర్హమ్‌ కోట, దుర్హమ్‌ క్యాథెడ్రల్‌ చర్చిని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ కట్టడానికి కొద్ది దూరంలోనే మైదానం ఉంది. 1995లో నిర్మించారు. సామర్థ్యం 14,000. ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. భారత్‌ ఇక్కడ ఆడడం లేదు. శ్రీలంక × దక్షిణాఫ్రికా, శ్రీలంక × వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ × న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 1999 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకూ దుర్హమ్‌ ఆతిథ్యమిచ్చింది. మెగాటోర్నీలో ఈ మైదానంలో నమోదైన అత్యధిక స్కోరు 261/1. స్కాట్లాండ్‌పై పాకిస్థాన్‌ చేసింది. వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌, అబ్దుల్‌ రజాక్‌ తలో మూడు వికెట్లు తీశారు.

ది ఓవల్‌ (లండన్‌)

థేమ్స్‌ నదీ తీరంలోని ది ఓవల్‌ ఇంగ్లాండ్‌లోని ప్రముఖ మైదానాల్లో ఒకటి. 1845లో నిర్మించారు. 25,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. 100 టెస్టులకు పైగా ఓవల్‌ ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచులు జరుగుతాయి. కోహ్లీసేన ఇక్కడ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇంగ్లాండ్‌ × దక్షిణాఫ్రికా, దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్‌, బంగ్లాదేశ్‌ × న్యూజిలాండ్‌, శ్రీలంక × ఆస్ట్రేలియా మ్యాచులు జరుగుతాయి. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఓవల్‌ ఆతిథ్యమిచ్చింది. పాకిస్థాన్‌ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ జింబాబ్వేపై 1999లో హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు.

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ (మాంచెస్టర్‌)

1857లో నెలకొల్పిన ఈ మైదానానికీ చారిత్రక నేపథ్యం ఉంది. 24,600 సామర్థ్యమున్న ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచులు జరగనున్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్‌ × పాకిస్థాన్‌ పోరు జూన్‌ 16న ఇక్కడే జరగనుంది. వెస్టిండీస్‌తోనూ కోహ్లీసేన ఇక్కడే తలపడనుంది. ఇంగ్లాండ్‌ × అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్‌ × న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లాండ్‌ ఇక్కడ రెండు సెమీఫైనళ్లు ఆడింది. 1979లో కివీస్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. 1983లో కపిల్‌ డెవిల్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడింది. అంటే ఇది టీమిండియాకూ అచ్చొచ్చిన వేదికే అన్నమాట.

లార్డ్స్‌ (లండన్‌)

ఈ మైదానం పేరు వింటేనే అభిమానులు, ఆటగాళ్ల కళ్లలో ఓ మెరుపు కనిపిస్తుంది. ఒక్కసారన్నా ఇక్కడ ఆడాలని కోరుకుంటారు. ఏదో ఓ ఘనత అక్కడ తన పేరుతో ఉండాలని ఆశిస్తారు. ఎందుకంటే అది క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌ కాబట్టి. క్రికెట్‌ మక్కా కాబట్టి. ప్రస్తుత ప్రపంచకప్‌ ఫైనల్‌ సహా ఐదు మ్యాచులకు లార్డ్స్‌ వేదిక. 1814లో నిర్మించిన ఈ మైదానం సామర్థ్యం 28,500. ప్రారంభమైంది 1814లోనైనా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చింది మాత్రం 1884 నుంచి. దాదాపు 10 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వగా అందులో 1975, 1979, 1983, 1999 ఫైనల్స్‌ ఉన్నాయి. భారత్‌ తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించిందే ఇక్కడే కావడం విశేషం. ప్రపంచకప్‌లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు 334/4. భారత్‌పై 1975లో ఇంగ్లాండ్‌ చేసింది. కపిల్‌ డెవిల్స్‌ ట్రోఫీని ముద్దాడిన ఇక్కడే మరోసారి కోహ్లీసేన భారత విజయ పతాక ఎగరేయాలని అశేష భారత జనావని కోరుకుంటోంది.

హెడింగ్లే (లీడ్స్‌)

ఇక్కడ నాలుగు మ్యాచులు జరగనున్నాయి. కోహ్లీసేన శ్రీలంకతో తలపడనుంది. ఇంగ్లాండ్‌ × శ్రీలంక, పాకిస్థాన్‌ × అఫ్గానిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ × వెస్టిండీస్‌ మ్యాచ్‌లకు హెడింగ్లే ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని 1890లో నిర్మించారు. 18,350 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ టోర్నీలకు వేదికైంది. 2017లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌ గెలిచిన అద్భుత టెస్టు మ్యాచ్‌ ఇక్కడే జరిగింది.

హ్యాంప్‌షైర్‌ బౌల్‌ (సౌథాంప్టన్‌)

ఇంగ్లాండ్‌లోని ఆధునిక మైదానాల్లో ఇదొకటి. 2001లో నిర్మించారు. సామర్థ్యం 17,000. ఈ ప్రపంచకప్‌లో 5 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌ ఇక్కడే తన ప్రస్థానాన్ని ఆరంభించనుంది. తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. జూన్‌ 22న అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. దక్షిణాఫ్రికా × వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ × వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌  మ్యాచులు జరగనున్నాయి. సౌథాంప్టన్‌లోని హ్యాంప్‌షైర్‌ బౌల్‌లో మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 2004 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకీ ఆతిథ్యమిచ్చింది.

ఎడ్జ్‌బాస్టన్‌ (బర్మింగ్‌హామ్‌)

భారత అభిమానులకు లార్డ్స్‌ తర్వాత ఎక్కువ గుర్తుండే మైదానల్లో ఎడ్జ్‌బాస్టన్‌ ఒకటి. 1886లో నెలకొల్పిన ఈ మైదానంలో సెమీస్‌ సహా ఐదు మ్యాచులు జరగనున్నాయి. సామర్థ్యం 24,500. కోహ్లీసేన ఇక్కడ రెండు మ్యాచుల్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. టోర్నీలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఇంగ్లాండ్‌ × భారత్‌ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టనే వేదిక. బంగ్లాదేశ్‌తోనూ ఇక్కడే మ్యాచ్‌. న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ × పాకిస్థాన్‌, సెమీస్‌ సమరాలు జరుగుతాయి. క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే సంఘటనలెన్నింటికో ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక. విండీస్‌ దిగ్గజం బ్రయన్‌లారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 501* పరుగులు చేసింది ఇక్కడే. 1979, 1983, 1999లోనూ ప్రపంచకప్‌ సెమీస్‌లు జరిగాయి. ప్రపంచంలోని అత్యుత్తుమ వన్డే సమరాల్లో ఒకటైన 1999 ప్రపంచకప్‌ సెమీస్‌ (ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా) మ్యాచ్‌ ఇక్కడే జరిగింది. అలన్‌ డొనాల్డ్‌, లాన్స్‌ క్లూసెనర్‌ క్రీజులో ఉండగా స్కోర్లు సమం కావడంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరుకుంది.

కౌంటీ మైదానం (టాంటన్‌)

అతి తక్కువ సామర్థ్యం ఉన్న మైదానాల్లో ఇదొకటి. 1882లో నిర్మించిన ఈ స్టేడియంలో 8000 మంది మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ఇక్కడ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ × న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా × పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ × బంగ్లాదేశ్ టాంటన్‌లో తలపడుతున్నాయి. 1999లో శ్రీలంకతో జరిగిన పోరులో భారత్‌ 373/6 పరుగులు చేసింది. 1983లోనూ ఓ మ్యాచ్‌ జరిగింది. 2017లో ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో 7 మ్యాచులకు టాంటన్‌ వేదికైంది.

కార్డిఫ్‌ వేల్స్‌ మైదానం (కార్డిఫ్‌)

1854లో నెలకొల్పిన కార్డిఫ్‌లో 15,200 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ఈ ప్రపంచకప్‌లో  న్యూజిలాండ్‌ × శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ × శ్రీలంక, ఇంగ్లాండ్‌ × బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా × అఫ్గానిస్థాన్‌ సమరాలకు కార్డిఫ్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ చివరి రెండు ఎడిషన్లు, 1999 ప్రపంచకప్‌లో మ్యాచులను ఇక్కడ నిర్వహించారు. 1967తో తొలి కౌంటీ మ్యాచ్‌ జరగ్గా 1999లో అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యమిచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2017 సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై పాక్‌ గెలిచింది ఇక్కడే.

బ్రిస్టల్‌ కౌంటీ మైదానం (బ్రిస్టల్‌)

ఈ మైదానం సామర్థ్యం తక్కువే. 11,000 మంది నేరుగా వీక్షించొచ్చు. 1889లో నిర్మించారు. ప్రపంచకప్‌లో  అఫ్గానిస్థాన్‌ × ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ × శ్రీలంక, బంగ్లాదేశ్ × శ్రీలంక సమరాలకు బ్రిస్టల్‌ వేదిక. 1983 ప్రపంచకప్‌లో ఒకటి, 1999లో రెండు మ్యాచులు జరిగాయి. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2017లో ఎనిమిది మ్యాచులు ఇక్కడ నిర్వహించారు. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ గెలిచి సెమీస్‌ చేరింది. ఆ తర్వాత లార్డ్స్‌లో భారత్‌ను 9 పరుగుల తేడాతో ఫైనల్లో ఓడించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.