close

తాజా వార్తలు

‘అశ్లీల’ ప్రతీకారం..!

అమ్మాయి కాదంటే చాలు అడ్డదారిలో పయనం
అంతర్జాలంలో బాధితురాలి పరువు తీసే ప్రయత్నం

యాదాద్రి భువనగిరికి చెందిన వివాహిత(45) చరవాణికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తనకు కాల్‌గర్ల్‌ను సరఫరా చేయాలంటూ కోరడంతో వివాహిత అవాక్కైంది. తనకెందుకు ఫోన్‌ చేశారని ఆరా తీయడంతో ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో వివాహిత చరవాణి నంబరు నమోదై ఉందని తేలింది. అలా వరుసగా ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో వివాహిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆ ఫోన్‌కాల్స్‌ తాకిడికి తట్టుకోలేక చివరకు రెండు రోజుల క్రితం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కొద్దిరోజులుగా తన పరువు తీసేలా పలువురికి వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతున్న సమీప బంధువే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని బాధితురాలు అనుమానం వ్యక్తం చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

హైదరాబాద్‌: అప్పటివరకు స్నేహం చేసిన అమ్మాయిలతో విభేదాలొస్తే చాలు యువకుల ఆలోచనలు పెడదారి పడుతున్నాయి. బాగా తెలిసిన మహిళ తన మాట వినకపోతే చాలు కొందరు పురుషుల్లో ఆక్రోశం తన్నుకొస్తోంది. సదరు అమ్మాయిలు, మహిళలపై ప్రతీకారం తీర్చుకునేందుకు అశ్లీల వెబ్‌సైట్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఆయా సైట్లలో సదరు మాజీ స్నేహితురాళ్ల చిత్రాలు, ఫోన్‌నంబర్లను నమోదు చేస్తూ తాత్కాలికంగా తమ కోపాన్ని చల్లార్చుకుంటున్నారు. అలా చేయడం ద్వారా తాము విజయం సాధించామనే గర్వంతో ఊగిపోతున్నారు. అంతటితో ఆగకుండా తమ నిర్వాకాన్ని నలుగురికి చెప్పుకొని మరీ పైశాచికానందం పొందుతున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో తమ నిర్వాకం తప్పనిసరిగా బహిర్గతమవుతుందనే విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. కటకటాల పాలై భవిష్యత్తుపై మచ్చ పడ్డాక గానీ తాము ఎంత తప్పు చేశామనేది గుర్తించలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఈ తరహా పెడధోరణులు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

విదేశీ వెబ్‌సైట్లు కావడంతో జాగు
మహిళలపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ స్నేహితులు అడ్డదారి ఎంచుకోవడంతో బాధితురాళ్లు అభాసుపాలు కావాల్సి వస్తోంది. అశ్లీల వెబ్‌సైట్లలో వారి అసలు చిత్రాలు, మార్ఫింగ్‌ చేసిన చిత్రాలు, చరవాణి నంబర్లను అప్‌లోడ్‌ చేస్తుండటంతో బాధితురాళ్లకు నగుబాటు తప్పడం లేదు. ఎస్కార్ట్‌ సర్వీసెస్‌ అందజేస్తామంటూ వాటిల్లో పేర్కొంటుండటంతో పలువురు ఆయా నంబర్లకు ఫోన్లు చేసి చికాకు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాళ్లు తీవ్ర మానసిక వేదనకు గురి కావాల్సి వస్తోంది. అయితే ఇలా సులభంగా చిత్రాలు, చరవాణి నంబర్లు నమోదు చేసే అవకాశం ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది. సాధారణంగా ఆయా వెబ్‌సైట్లు విదేశీ కేంద్రంగా నడుస్తున్నవి కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ తరహా వెబ్‌సైట్లలో ఎస్కార్ట్‌ సర్వీసెస్‌పై ప్రకటనలకు అవకాశముండటంతో పోకిరీలు తమ వేధింపులకు అనువుగా మలుచుకుంటున్నారు. ఉదాహరణకు ఇలాంటి సేవల్లో పేరుమోసిన ఓ వెబ్‌సైట్‌ జర్మనీ కేంద్రంగా నడుస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఈ తరహా ప్రకటనలు పెద్దగా తప్పు కాకపోవడంతో నిర్వాహకులు పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడి బాధితురాళ్లు ఫిర్యాదు చేస్తే మాత్రం సైబర్‌క్రైమ్‌ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ కేంద్ర కార్యాలయానికి లేఖ రాసి సదరు ప్రకటనల్ని తొలగింపజేయగలుగుతున్నారు. ఇందుకు కొంత సమయం పడుతున్నా ఆయా ప్రకటనల్లో చరవాణి నంబర్లను తొలగించడం ద్వారా బాధితురాళ్లకు మాత్రం ఉపశమనం లభిస్తోంది. అయితే ఇలాంటి ఫిర్యాదులొస్తే మాత్రం ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి కటకటాల్లోకి పంపిస్తున్నారు. అలా జరిగినప్పుడు నిందితులకు వాస్తవం బోధపడి తాము చేసిన ఘోర తప్పిదానికి కుమిలిపోవాల్సి వస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.