close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ వీరులు ఎంతమంది?

అబ్బుర పరిచే ప్రపంచ కప్‌ ఘనతలు ఇవే

క్రికెట్‌ అంటే కేవలం పరుగులు.. వికెట్లేనా! అబ్బుర పరిచే గణాంకాలూ.. ఘనతల కళబోత. అవి ప్రపంచకప్‌లో నమోదైనవైతే ఆ కిక్కే వేరప్పా! అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, అత్యధిక సగటు, అత్యధిక శతకాలు ఇలా లెక్కలేనన్ని రికార్డులు ఈ ఆట సొంతం. అందులో భారతీయులు ఉంటే మనకు మరింత ఆనందం. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019 ఇంగ్లాండ్‌లో ఘనంగా ఆరంభమైంది. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన గణాంకాలూ, ఘనతలపై ఓ లుక్కేద్దామా!!

అత్యధిక పరుగుల వీరులు

ప్రపంచ కప్‌లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు 417/6. అఫ్గానిస్థాన్‌పై 2015లో ఆస్ట్రేలియా చేసింది. రెండో అత్యధిక స్కోరు 413/5. భారత్‌ 2007లో బెర్ముడాపై సాధించింది.
ప్రపంచకప్‌లో నమోదైన అత్యల్ప స్కోరు 36. శ్రీలంకపై 2003లో కెనడా చేసింది.

మెగా టోర్నీలో అత్యధిక లక్ష్యం ఛేదించిన జట్టు ఐర్లాండ్‌. 2011లో ఇంగ్లాండ్‌పై 49.1 ఓవర్లకు 329/7తో విజయం అందుకుంది. 2015లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్‌ 322/4తో విజయం సాధించింది.

విశ్వసమరంలో స్వల్ప తేడాతో గెలిచిన మ్యాచ్‌లు 2. భారత్‌ను ఆసీస్‌ రెండు సార్లు పరుగు తేడాతో ఓడించింది. 1987లో 271, 1992లో 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా పరుగు దూరంలో ఆగిపోయింది.
ప్రపంచ కప్‌లో ఎక్కువ విజయాల సాధించిన జట్టు ఆసీస్‌. 62 గెలిచింది. ఎక్కువ మ్యాచ్‌లు ఓడింది జింబాబ్వే. 42 ఓడింది.

అత్యధిక శతక ధీరులు

ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా వరుసగా 27 మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని రికార్డు సాధించింది. 1999 నుంచి 2011 వరకు జైత్రయాత్ర కొనసాగించింది. 2011లో పాక్‌ దానిని నిలువరించింది.
2011 నుంచి 2015 వరకు వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.
అత్యంత వేగంగా ద్విశతకం బాదిన క్రికెటర్‌ వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌. 2015లో జింబాబ్వేపై 138 బంతుల్లో సాధించాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ వెస్టిండీస్‌పై 152 బంతుల్లో చేశాడు.
అత్యంత వేగంగా అర్ధశతకం సాధించింది కివీస్‌ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌. 2015లో ఇంగ్లాండ్‌పై 18 బంతుల్లో చేశాడు.
మెగా టోర్నీలో జింబాబ్వే (1983-1992) వరుసగా 18 మ్యాచుల్లో ఓడింది. స్కాట్లాండ్‌ (1999-2015) వరుసగా 14 ఓడి రెండో స్థానంలో నిలిచింది.

అతి తక్కువ బంతుల్లో శతకాలు

ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల రికార్డు మెక్‌గ్రాత్‌పై ఉంది. 2003లో నమీబియాపై 7-15 నమోదు చేశాడు.
భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌ చేతన్ శర్మ. న్యూజిలాండ్‌పై 1987లో చేశాడు. 1999లో సక్లైయిన్‌ ముస్తాక్‌ జింబాబ్వేపై, 2003లో చమిందా వాస్‌ బంగ్లాదేశ్‌పై,   2003లో బ్రెట్‌లీ కెన్యాపై హ్యాట్రిక్‌ నమోదు చేశారు.
ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసింది శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ. దక్షిణాఫ్రికాపై 2007లో చేశాడు.
ఒకే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసింది ఆసీస్‌ పేసర్‌ మెక్‌గ్రాత్‌. 2007లో 11 మ్యాచుల్లో 26 వికెట్లు తీశాడు. 2003లో శ్రీలంక పేసర్‌ చమిందావాస్‌ 10 మ్యాచుల్లో 23,  2007లో శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ 23,  2007లో ఆసీస్‌ ఆటగాడు షాన్ టెయిట్‌ 23 వికెట్లు తీశారు.
ప్రపంచకప్‌లో అత్యధిక ఔట్లు చేసిన వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర. 54 మందిని పెవిలియన్‌ పంపించాడు. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 52 మందిని ఔట్‌ చేశాడు.

అత్యధిక వికెట్ల వీరులు

2003లో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ గిల్‌క్రిస్ట్‌ 21 మందిని ఔట్‌ చేశాడు.
1999లో పాక్‌×స్కాట్లాండ్‌ మ్యాచ్‌లో ఎక్కువ అదనపు పరుగులు నమోదయ్యాయి. 59 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అదే ఏడాది భారత్‌×జింబాబ్వే మ్యాచ్‌లో 51 నమోదయ్యాయి.
ఎక్కువ సార్లు ప్రపంచకప్‌ ఆడింది సచిన్‌ తెందుల్కర్‌, జావెద్‌ మియాందాద్‌. ఇద్దరూ 6 టోర్నీలు ఆడారు.
అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడింది రికీ పాంటింగ్‌. 46 ఆడాడు. సచిన్‌ ఒకటి తక్కువ ఆడి రెండో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ కప్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌ రికీ పాంటింగ్‌. మొత్తం 28 క్యాచ్‌లు ఒడిసిపట్టాడు.

సారథుల ఘనతలు

అండర్సన్‌ కమిన్స్‌, కెప్లెర్‌ వెసెల్స్‌, ఎడ్‌ జాయ్‌సీ, ఇయాన్‌ మోర్గాన్‌ ఒకటి కన్నా ఎక్కువ దేశాలకు ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించారు.
ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మెక్‌గ్రాత్‌, రికీ పాంటింగ్‌ మూడుసార్లు ప్రపంచకప్‌ ట్రోఫీ ముద్దాడారు. 1999, 2003, 2007లో వారు ప్రపంచకప్‌ గెలిచారు.
మెగా టోర్నీ ఆడిన అత్యంత పిన్న వయస్కుడు నితీశ్‌ కుమార్‌ (కెనడా). 16 ఏళ్ల 283 రోజులప్పుడు 2011 ప్రపంచకప్‌ ఆడాడు. అధిక వయస్కుడు నోలన్‌ క్లార్క్‌ (నెదర్లాండ్స్‌). 47 ఏళ్ల 257 రోజుల వయసులో 1996 ప్రపంచకప్‌ ఆడాడు.
సారథిగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది రికీ పాంటింగ్‌. 29 ఆడాడు.
ప్రపంచకప్‌ ముద్దాడిన పిన్న వయస్కుడు టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌. 24 ఏళ్ల 5 నెలల 19 రోజుల వయసులో 1983లో ట్రోఫీ అందించాడు.

అత్యధిక వ్యక్తిగత పరుగులు

ప్రపంచకప్‌లో ఎక్కువ సిక్సర్లు బాదింది క్రిస్‌గేల్‌. 40* కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ కొట్టిందీ అతడే. జింబాబ్వేపై 2015లో 16 బాదేశాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం విండీస్‌ జోడీ మార్లోన్‌ శామ్యూల్స్‌, క్రిస్‌గేల్‌ నెలకొల్పింది. 2015లో జింబాబ్వేపై రెండో వికెట్‌కు 372 పరుగులు చేసింది. 1999లో శ్రీలంకపై రెండో వికెట్‌కు సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ 318 సాధించారు.
ఒకే టోర్నీలో 4 శతకాలు బాదిన ఒకే ఒక క్రికెటర్‌ కుమార సంగక్కర. 2015లో చేశాడు. మార్క్‌ వా (1996), సౌరవ్‌ గంగూలీ (2003), మాథ్యూ హెడేన్‌ (2007) మూడు శతకాలు బాదారు.
ఒక టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది సచిన్‌. 2003లో 11 ఇన్నింగ్సుల్లో 673 చేశాడు.

- ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.